అంధులకు బ్యాంక్ దోపిడీ పథకం?
ఏదైనా ఫ్లాప్ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచన చేయడం సాహసంతో కూడుకున్నది. సెంటిమెంట్ పరంగా చూస్తే, నిర్మాతలు అలాంటి సాహసం చేయలేరు
By: Tupaki Desk | 26 April 2025 8:45 AM ISTఏదైనా ఫ్లాప్ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచన చేయడం సాహసంతో కూడుకున్నది. సెంటిమెంట్ పరంగా చూస్తే, నిర్మాతలు అలాంటి సాహసం చేయలేరు. కానీ ఇప్పుడు 2000లో విడుదలై ఫ్లాపైన ఆంఖేన్ చిత్రానికి సీక్వెల్ తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి దిగ్గజ హీరోలు నటించిన ఈ సినిమా కథాంశం ఇంట్రెస్టింగ్. బాక్సాఫీస్ లెక్కలతో సంబంధం లేకుండా క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులకు ఇది నచ్చింది. కానీ ఎందుకనో కలెక్షన్లలో మాత్రం అనుకున్నది సాధించుకోలేకపోయింది.
`ఆంఖేన్` బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ. ముగ్గురు అంధులు, ఒక స్కూల్ టీచర్ సాయంతో ఒక బ్యాంక్ దోపిడీకి పథకం వేసిన మాస్టర్జీ ఎవరు? అతడి గతం ఏమిటన్నది ఈ సినిమా కథాంశం. ఆ నలుగురికీ దోపిడీ పథకం వివరించి శిక్షణ ఇచ్చి అతడు ఏం చేసాడో థ్రిల్లర్ మోడ్ లో కొత్త పంథాలో రూపొందించిన ఈ సినిమా క్లాసిక్ మూవీగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు పొందినా కానీ, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అందుకే ఇప్పుడు ఆంఖేన్ కి సీక్వెల్ తెరకెక్కిస్తే జనాల్ని థియేటర్లకు రప్పించడం కష్టమేమీ కాదని, నేటి జెన్ జెడ్ ఆడియెన్ కి ఇలాంటి కాన్సెప్టులు ఎక్కుతాయని కూడా విశ్లేషిస్తున్నారు.
అయితే ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ తీసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారా? అమితాబ్, అక్కీలతో పాటు, అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుష్మితా సేన్ లాంటి తారలు దీని కోసం ముందుకు వస్తారా? అన్నది వేచి చూడాలి. గతంలో `ఆంఖేన్` సీక్వెల్ తీయాలని ప్రయత్నించినా అప్పటి పరిస్థితుల్లో కుదరలేదు. కానీ ఇప్పుడు రీరిలీజ్ లు హిట్లు కొడుతున్న ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఆంఖేన్ కి సీక్వెల్ రావాలని బలంగా కోరుకుంటున్నారు.
