ఆమిర్ ఖాన్.. మళ్లీ టార్గెట్ అయ్యాడు
బాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన హీరో ఆమిర్ ఖాన్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతను నంబర్ వన్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ చిత్రాలతో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
By: Tupaki Desk | 14 May 2025 11:36 AMబాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన హీరో ఆమిర్ ఖాన్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతను నంబర్ వన్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ చిత్రాలతో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఆమిర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. రికార్డులు బద్దలవ్వాల్సిందే అన్నట్లుండేది పరిస్థితి. కానీ ‘దంగల్’తో మరో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక కథ మారిపోయింది. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు ఆమిర్. దాన్నుంచి కోలుకుని ‘లాల్ సింగ్ చడ్డా’లో మళ్లీ పుంజుకుంటాడని అనుకుంటే.. అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది.
ఆమిర్ మీద ఎన్నడూ లేనంత నెగెటివిటీ ఆ సినిమా టైంలో కనిపించింది. ‘లాల్ సింగ్ చడ్డా’ డిజాస్టర్ అన్న సంగతి విడుదలకు ముందే ఖరారైపోయింది. దాని ట్రైలర్ అంత పేలవంగా అనిపించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు ఆమిర్. తొలి రోజే జనం లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఐతే కెరీర్లో బ్రేక్ తీసుకుని.. చాలా టైం తీసుకుని చేసిన ‘సితారే జమీన్ పర్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల మనసు గెలవాలనుకున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఆమిర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘తారే జమీన్ పర్’ ఘనవిజయం సాధించడంతో పాటు బాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది. దానికి కొనసాగింపుగా తీసిన సినిమాగా భావించిన ‘సితారే జమీన్ పర్’ ఆమిర్‌కు మంచి విజయాన్నందిస్తుందని అనుకుంటే.. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోయింది.
ఈ చిత్రం ‘తారే జమీన్ పర్’ సీక్వెల్ కాదని.. స్పానిష్ మూవీ ‘ఛాంపియన్స్’కు రీమేక్ అని తెలిసి నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. కేవలం అసంతృప్తి చేయడంతో సరిపెట్టట్లేదు. పోస్టర్లతో మొదలుపెట్టి ట్రైలర్ వరకు ఒరిజినల్‌ను మక్కీకి మక్కీ దించేయడం చూసి ఆమిర్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక స్పానిష్ మూవీని కాపీ కొట్టడానికి నాలుగేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నావా అంటూ ఆమిర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌తో చేతులు కాల్చుకున్నాక కూడా ఆమిర్‌కు బుద్ధి రాలేదని.. మళ్లీ ఇలా విదేశీ చిత్రాన్ని ఇండియాకు తీసుకొస్తున్నాడని.. అతడికి మళ్లీ షాక్ తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ‘సితారే జమీన్ పర్’ సైతం ‘లాల్ సింగ్ చడ్డా’ బాట పడుతుందా అన్న చర్చ నడుస్తోంది. తన మీద ఉన్నట్లుండి ఇంత నెగెటివిటీ రావడం చూసి పాపం ఆమిర్ కచ్చితంగా షాకవుతూనే ఉంటాడేమో.