Begin typing your search above and press return to search.

మాన‌సిక విక‌లాంగుల‌పై అమీర్ డాక్యుమెంట‌రీ

వారు పూర్తిగా అవ‌గాహ‌న‌తో మాట్లాడ‌లేరు.. త‌మ ఇబ్బందిని కూడా స‌రిగా చెప్పుకోలేరు.

By:  Tupaki Desk   |   26 May 2025 7:00 AM IST
మాన‌సిక విక‌లాంగుల‌పై అమీర్ డాక్యుమెంట‌రీ
X

వారు పూర్తిగా అవ‌గాహ‌న‌తో మాట్లాడ‌లేరు.. త‌మ ఇబ్బందిని కూడా స‌రిగా చెప్పుకోలేరు. శ‌రీరం ఎదిగినా మ‌న‌సు ఎద‌గలేదు.. ఆలోచ‌నలు ఎద‌గ‌లేదు.. మెద‌డులో ఎదుగుద‌ల వారికి లేదు.. కానీ వారంతా ఇప్పుడు ఒక సినిమాలో న‌టించారు. అది కూడా అమీర్ ఖాన్ లాంటి అగ్ర క‌థానాయ‌కుడు నిర్మించిన ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు వ‌స్తోంది. ఈ సినిమా- `సితారే జ‌మీన్ ప‌ర్`. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తారే జమీన్ ప‌ర్ కి సీక్వెల్ ఇది. ఇందులో మానసికంగా ఎద‌గ‌ని కొంద‌రు పిల్ల‌లు న‌టించారు.

ఈ చిన్నారుల‌కు అమీర్ ఖాన్ ఒక అరుదైన కానుక‌ను ఇవ్వ‌నున్నారు. అది వారిపై ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీని రూపొందించి జ‌న‌బాహుళ్యంలోకి విడుద‌ల చేస్తున్నారు. నిజ జీవితంలో మాన‌సిక విక‌లాంగుల‌ పోరాటాలను ఈ డాక్యుమెంట‌రీ ప్ర‌తిబింబిస్తుంది. నిజానికి ఇలాంటి పిల్ల‌లతో సినిమా చేయాల‌నేది ఒక పెద్ద సాహ‌సం. అమీర్ అలాంటి సాహ‌సం చేసాడు. ఒక ర‌కంగా ప్ర‌యోగం చేసాడు. ఇటీవ‌లే సితారే జ‌మీన్ ప‌ర్ ట్రైల‌ర్ విడుద‌లై ఆక‌ట్టుకుంది. మాన‌సిక విక‌లాంగులతో అత‌డు అనుభ‌వించిన క‌ష్టం ఎలాంటిదో ఈ ట్రైల‌ర్ తోనే అర్థ‌మైంది.

ఇలాంటి ప్ర‌యోగం అమీర్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌డని అర్థ‌మైంది. సితారే జ‌మీన్ ప‌ర్ ప్ర‌యోగాత్మ‌క క‌థ‌, పాత్ర‌ల‌తో వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి ప్ర‌చారం ఎక్కువ అవ‌స‌రం. కానీ అమీర్ దానిపై పూర్తిగా దృష్టి సారించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కానీ ఇప్పుడు డాక్యుమెంట‌రీతో వ‌స్తున్నాడు గ‌నుక, అది అత‌డికి క‌లిసొస్తుంది.

నేటి ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాల‌కు ప‌ట్టంగ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో పాన్ ఇండియా కంటెంట్ ని ఆద‌రిస్తున్నారు. సితారే జ‌మీన్ ప‌ర్ కంటెంట్ తో వ‌స్తున్న చిత్రం. ఇది ఎంపిక చేసిన ఆడియెన్ కి మాత్ర‌మే చేరుతుందా? అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించ‌గ‌లుగుతుందా? అన్న‌ది వేచి చూడాలి. ఈ సినిమా కంటెంట్ పై అమీర్ పూర్తి న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఏం జ‌రుగుతుందో కాల‌మే నిర్ణ‌యించాలి.