అన్ని ప్రశ్నలకూ ఆమిర్ సమాధానం
తన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. సినిమాలో కంటెంట్‌తో సంబంధం లేకుండా ఆమిర్ చిత్రాల మీద నెగెటివిటీ ముసురుకుంటూ ఉండడం గమనార్హం.
By: Tupaki Desk | 16 Jun 2025 4:00 AM ISTఒకప్పుడు ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఉండేవాడు ఆమిర్ ఖాన్. ఆయన సినిమాలు రికార్డులు బద్దలు కొట్టేసేవి. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్లు ఇచ్చిన ఘనత ఆయన సొంతం. కానీ ఆమిర్ చివరి రెండు చిత్రాలు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. తన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. సినిమాలో కంటెంట్‌తో సంబంధం లేకుండా ఆమిర్ చిత్రాల మీద నెగెటివిటీ ముసురుకుంటూ ఉండడం గమనార్హం. ఆయన్ని యాంటీ నేషనల్‌గా అభివర్ణిస్తూ.. తన సినిమాలను బాయ్‌కాట్ చేస్తోంది ఓ వర్గం. ‘లాల్ సింగ్ చడ్డా’ టైంలో నడిచిన ఈ బాయ్‌కాట్ ఉద్యమమే.. 'సితారే జమీన్ పర్' రిలీజ్ ముంగిటా నడుస్తోంది. ఇలా తన మీద ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకతను పెంచే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఒక టీవీ షోలో అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆమిర్.
పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ మీద తాను స్పందించలేదంటూ తన మీద విమర్శలు చేయడంపై ఆమిర్ స్పందించాడు. తనకు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోనూ అకౌంట్ లేదని.. అలాంటపుడు తన స్పందన జనాలకు ఎలా తెలుస్తుందని ఆమిర్ ప్రశ్నించాడు. పహల్గాం ఘటన కేవలం మన జనాల మీద కాదు, మన ఏకత్వం మీద దాడి అని ఆమిర్ అభివర్ణించారు. అది తనను ఎంతో కలచి వేసిందన్నాడు. మన సైనికులు దానికి దీటైన బదులు చెప్పారని ఆమిర్ అన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను ‘సితారే జమీన్ పర్’ ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేశానని.. ఇతర ప్రమోషన్ కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నానని ఆమిర్ తెలిపాడు.
తాను 90వ దశకంలోనే 'సర్ఫరోష్' చిత్రంలో పాకిస్థాన్, ఐఎస్ఐ రిలేషన్ గురించి ప్రస్తావించానని.. తర్వాతే మిగతా సినిమాలు దాన్ని అందిపుచ్చుకున్నాయని ఆమిర్ తెలిపాడు. ‘పీకే’ సినిమాలో హిందూ మతాన్ని కించపరిచేలా సన్నివేశాలున్నాయన్న ఆరోపణలపై ఆమిర్ స్పందిస్తూ.. మతం ఎలా జనాలను తప్పుదోవ పట్టిస్తుందో అందులో చూపించామని, అది అన్ని మతాలకూ వర్తిస్తుందని.. ఏదో ఒక మతాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని ఆమిర్ తెలిపాడు. తాను హిందూ మహిళలను పెళ్లి చేసుకోవడం ద్వారా ‘లవ్ జిహాద్’ను ప్రమోట్ చేస్తున్నాననే విమర్శ మీద ఆమిర్ స్పందిస్తూ.. తన సోదరి, కూతురు హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారని.. మరి ఇది కూడా ‘లవ్ జిహాద్’ కిందికే వస్తుందా అని ఆమిర్ ప్రశ్నించాడు. ఇందులో ప్రేమను, మానవత్వాన్ని మాత్రమే చూడాలని ఆమిర్ కోరాడు.
