ఆ ఆఫర్లకు నో చెప్పింది నేనొక్కడినే!
లాల్ సింగ్ చద్దా తర్వాత ఆమిర్ ఖాన్ కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
By: Tupaki Desk | 7 Jun 2025 5:00 AM ISTలాల్ సింగ్ చద్దా తర్వాత ఆమిర్ ఖాన్ కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూన్ 20న సితారే జమీన్ పర్ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు ఆమిర్ ఖాన్. పలు మీడియాలకు ఇంటర్వ్యూలిస్తూ ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు ఆమిర్.
సితారే జమీన్ పర్ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా యూ ట్యూబ్ లో రిలీజవుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ చెప్పారు. థియేటర్ రిలీజ్ త్వరాతే యూ ట్యూబ్ లో పే పర్ వ్యూ ద్వారా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని, సినిమా రిలీజ్ తర్వాత ఏం జరుగుతుందనేది తనక్కూడా తెలియదని, ఈ విషయంలో తాను నిజాయితీగా ఉన్నట్టు చెప్పారు.
ఈ రోజుల్లో సినిమా అనేది బిజినెస్ అయిపోయిందని, ఓటీటీ రైట్స్ అమ్మకుండా సినిమాను కనీసం మొదలు కూడా పెట్టడం లేదని, ఈ సినిమాకు తనకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ వాటన్నింటినీ నో చెప్పానని, ఓటీటీ రైట్స్ అమ్మడానికి నో చెప్పిన ఒకే ఒక నిర్మాత తానే అని, దీని వల్ల తనకు ఆర్థికంగా నష్టం కలగొచ్చని, అయినప్పటికీ ఆడియన్స్ తన సినిమాను థియేటర్లో చూడాలని కోరుకుంటున్నానని, తగ్గిపోతున్న థియేటర్ బిజినెస్ ను తిరిగి బలోపేతం చేయడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇదే సందర్భంగా సినిమా రీమేక్స్ విషయంలో కూడా ఆయన మాట్లాడారు. తాను రీమేక్‌లనే నమ్ముతానని, తన దగ్గరకు ఏ మంచి రీమేక్ వచ్చినా చేస్తూనే ఉంటానని, సినిమా తీయడమనేది తన ఇష్టమని, చూడటం చూడకపోవడం మీ ఇష్టమని, ఇప్పటికే తన కెరీర్లో పదికి పైగా రీమేక్ సినిమాలు చేయగా, అందులో లాల్ సింగ్ చద్దా తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయని, సినిమా బావుంటే ఎలాంటి ట్రోలింగ్స్ పని చేయవని, తాను కేవలం ఆడియన్స్ మాటల్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటానని చెప్పారు.
