అమీర్ ఖాన్.. ఈసారి హిట్టు కొట్టినట్లేనా?
3 ఇడియట్స్ - పీకే - దంగల్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసిన అమీర్ ఖాన్ ఈమధ్య కాలంలో కొన్ని ఊహించని డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నాడు.
By: Tupaki Desk | 23 Jun 2025 3:41 PM IST3 ఇడియట్స్ - పీకే - దంగల్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసిన అమీర్ ఖాన్ ఈమధ్య కాలంలో కొన్ని ఊహించని డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నాడు. సౌత్ సినిమాల డామినేషన్ తో ఖాన్ త్రయం సందిగ్ధంలో పడగా ఎక్కువ ప్రభావం మిస్టర్ పర్ఫెక్ట్ మీదే పడింది. అయినప్పటికీ సేఫ్ గేమ్ ఆడకుండా ప్రయోగాత్మక కథలపైనే ఫోకస్ పెట్టాడు అమీర్ ఖాన్. ఇప్పుడు ఉన్న బాలీవుడ్ హీరోల్లో తన సినిమాలతో సామాజికమైన అంశాలపై చర్చను తెచ్చే స్టైలే అమీర్ ఖాన్‌ది.
లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ తర్వాత మళ్లీ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ‘సితారే జమీన్ పర్’ అనే ఎమోషనల్ డ్రామాతో అందరినీ ఆలోచనలో పడేసాడు. హాలీవుడ్ చిత్రం 'చాంపియన్స్' ఆధారంగా రూపొందిన ఈ సినిమా, పిల్లలపై, వారి మానసిక స్థితిపై ఫోకస్ చేస్తూ తనదైన శైలిలో అమీర్ మళ్లీ స్క్రీన్ మీద మెరిశాడు. ఈ సినిమాపై మొదటి రెండు రోజులు పెద్దగా అంచనాలు లేకపోయినా, ఇప్పుడు క్రమంగా వేగం పెంచుతోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 60 కోట్లు వసూలు చేసింది. ఆదివారం ప్రత్యేకంగా మంచి గ్రోత్ కనిపించింది. మహేష్ బాబు వంటి సౌత్ స్టార్లు ఈ సినిమాపై సోషల్ మీడియాలో సపోర్ట్ తెలపడంతో పాజిటివ్ వేవ్ మరింత పెరిగింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా అనే అభిప్రాయం జనం మధ్య విస్తరిస్తోంది.
ఈ సినిమాకు పెద్ద రేంజ్ బ్లాక్‌బస్టర్ స్థాయి టాక్ రాకపోయినా, ఓ ఫ్యామిలీ డ్రామాగా నిలవగలదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. బాలీవుడ్‌లో ఇప్పట్లో పెద్ద రిలీజ్‌లు లేకపోవడంతో హిందీ ఆడియన్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ గా మారుతోంది. కుబేర హిందీలో పెద్దగా క్లిక్ కాకపోవడంతో అమీర్ సినిమా స్థిరమైన చోటు దక్కించుకుంటోంది. తారే జమీన్ పర్, చక్ దే ఇండియా వంటి భావోద్వేగ చిత్రాల మిక్స్ లా ఉండడంతో ఫ్యామిలీస్ అట్రాక్ట్ అవుతున్నారు.
ఇక ఓటీటీ విషయానికి వస్తే, ఇప్పటికే కొన్ని సంస్థలు 100 కోట్లకు పైగా ఆఫర్ చేసినా అమీర్ ఖాన్ మాత్రం యూట్యూబ్ పేపర్ వ్యూ మోడల్‌నే ముందుగానే ప్లాన్ చేశాడని తెలుస్తోంది. థియేటర్లో మంచి వసూళ్లు వస్తే అమీర్ ఆ డిస్ట్రిబ్యూషన్ మోడల్‌నే ఫాలో కావచ్చు. ఒకవేళ ఇంకా కలెక్షన్లు బాగా పెరిగితే, ఓటీటీ డీల్స్‌పై మళ్లీ ఆలోచించవచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక షోలు వేసే ఆలోచనలో అమీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది జరిగితే మళ్లీ ఒక కొత్త మార్కెట్‌ను టార్గెట్ చేసినట్టే అవుతుంది.
