ఆమిర్ సినిమా డిజిటల్ ఆఫర్ వార్తలన్నీ పుకార్లేనా?
సితారే జమీన్ పర్ మూవీతో ఈ విధానాన్ని అమలు చేసి ఆడియన్స్ కు తక్కువ రేటులో సినిమా చూపించే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 5 Jun 2025 8:54 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓటీటీ డీల్ విషయంపై గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో ఆమిర్ తీసుకున్న డెసిషన్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ను సందేహంలో పడేసింది. సితారే జమీన్ పర్ ఓటీటీ రైట్స్ ను ఏ సంస్థకూ ఇవ్వనని, డైరెక్ట్ గా యూట్యూబ్ లో పే పర్ వ్యూస్ విధానంలో అందుబాటులోకి తెస్తానని ఆమిర్ కొన్నాళ్ల కిందట అనౌన్స్ చేశాడు. ఇలా చేయడం వల్ల మంథ్లీ సబ్‌స్క్రిప్షన్ బాధ లేకుండా తక్కువ రేటుకే ఇష్టమొచ్చిన సినిమా చూడొచ్చని ఆమిర్ ఉద్దేశం.
సితారే జమీన్ పర్ మూవీతో ఈ విధానాన్ని అమలు చేసి ఆడియన్స్ కు తక్కువ రేటులో సినిమా చూపించే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమిర్ ప్లాన్ కు నెట్‌ఫ్లిక్స్ దిగొచ్చి మొదట రూ.60 ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం రూ.60 కోట్లు ఆఫర్ చేయగా, ఇప్పుడు ఆ రేటును డబుల్ చేసి రూ.125 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఆమిర్ తో సంప్రదింపులు జరిపిందని వార్తలొస్తున్నాయి.
ఈ సినిమాను నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేసి ఆడియన్స్ కు పే పర్ వ్యూస్ విధానాన్ని అలవాటు చేస్తే అందరూ ఇదే ఫాలో అవుతారని, దాని వల్ల డిజిటల్ బిజినెస్ మొత్తం పడిపోయే ప్రమాదముందని నెట్‌ఫ్లిక్స్ ఇలా డబుల్ రేట్ ను ఆఫర్ చేసిందని వార్తలొచ్చాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ ఆమిర్ ఖాన్ టీమ్ కు రూ.125 కోట్లు ఆఫర్ చేసిన మాటలో ఏ మాత్రం నిజం లేదని స్ట్రీమింగ్ దిగ్గజానికి దగ్గరగా ఉన్న వారు చెప్తున్నారు.
