'సితారే జమీన్ పర్'..మిస్టర్ పర్ఫెక్ట్ ఈసారి గట్టిగానే!
దక్షిణాదిలో విభిన్నమైన పాత్రలకు, సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో కమల్ హాసన్.
By: Tupaki Desk | 11 Jun 2025 1:46 PM ISTదక్షిణాదిలో విభిన్నమైన పాత్రలకు, సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో కమల్ హాసన్. ఆయన అంత కాకపోయినా నార్త్‌లో మాత్రం ఆమీర్‌ఖాన్‌ది ప్రత్యేక శైలి. విభిన్నమైన సినిమాలు, కథలు, పాత్రలని ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన హీరో తను. 'దంగల్' లాంటి సినిమాలో భారీ కాయంతో రెజ్లర్‌గా, ఆ తరువాత అంతర్జాతీయ స్థాయిలో తన పిల్లలని రెజ్లర్‌లుగా నిలబెట్టాలని తపన పడే తండ్రిగా నటించి శభాష్ అనిపించుకున్నారు.
ఈ సినిమాతో ఇండియన్ సినిమా 2 వేల కోట్ల క్లబ్‌లోనూ చేరగలదని నిరూపించి వరల్డ్ సినిమా ఆశ్చర్యపడేలా చేశారు. అయితే గత కొంత కాలంగా ఈ ప్రయోగాల స్టార్ ఆమీర్‌ను వరుస డిజాస్టర్లు పలకరిస్తూ కలవరపెడుతున్నాయి. హాలీవుడ్ రీమేక్ `ఫారెస్ట్ గంప్`పై మనసుపడి `లాల్ సింగ్ చద్దా`గా రిమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. భారీ అంచనాల మధ్య రూ.180 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లు మాత్రమే రాబట్టి ఆమీర్ ఖాన్ కెరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది.
దీంతో రెండేళ్లకు పైనే గ్యాప్ తీసుకున్న ఆమీర్‌ఖాన్ స్పానిష్ ఫిల్మ్ 'ఛాంపియన్స్' ఆధారంగా రూపొందిన `సితారే జమీన్ పర్` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది. జూన్ 20న హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఇప్పటికే హిందీ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించిన నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ని టీమ్ రిలీజ్ చేసింది.
యాంగర్ మేనేజ్‌మెంట్ ఉన్న బాస్కెట్ బాల్ కోచ్‌గా ఆమీర్‌ఖాన్ నటించిన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనకోని పరిస్థితుల్లో బాస్కెట్ బాల్ కోచ్ డ్రంక్ అండ్ డ్రౌవ్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న లేడీ జడ్జ్ ఆమీర్ ఖాన్ మూడు నెలల పాటు మతిస్థిమితంసరిగాలేని దివ్యాంగులకు శిక్షణ ఇవ్వాలని తీర్పు ఇస్తుంది. తప్పనిసరిపరిస్థితుల్లో దీనికి అంగీకరించిన ఆమీర్‌ఖాన్ మితిస్థిమితం సరిగా లేని దివ్యాంగులకు శిక్షణ ఇస్తాడు. ఈ క్రమంలో వారితో తను పడే ఇబ్బందులు, వారి ఎమోషన్స్ ప్రధానంగా సినిమా సాగుతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని, ఈ సినిమాతో ఆమీర్‌ఖాన్ ఈ సారి గట్టిగానే బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ ఇవ్వబోతున్నాడని స్పష్టమతోంది. రీసెంట్‌గా ఈ మూవీని ఓటీటీకి 8 వారాల తరువాతే ఇస్తానని ప్రకటించిన ఆమీర్‌ఖాన్ సెలబ్రిటీస్ కోసం ఈ మూవీ ప్రీమియర్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆమీర్‌ఖాన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.