చివరి సినిమా కాదు.. నేను అలా అనలేదు!
ఆమీర్ ఖాన్ వయసు 60 అయినప్పటికీ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Tupaki Desk | 12 Jun 2025 7:01 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత 'సితారే జమీన్ పర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 20న విడుదల కాబోతున్న ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆమీర్ ఖాన్ బిజీ బిజీగా ఉంటున్నాడు. దేశ వ్యాప్తంగా ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చక్కర్లు కొడుతున్నాడు. ఆమీర్ ఖాన్ సినిమా ప్రమోషన్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. చాలా ఇంటర్వ్యూల్లో ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చాడు. అలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నేను మహాభారతం సినిమాను చేయాలి అనుకుంటున్నాను అన్నాడు. అంతే కాకుండా ఆ సినిమా చేసిన తర్వాత నటుడిగా చేయడానికి ఏమీ ఉండదు అన్నట్లు చెప్పుకొచ్చాడు.
మహాభారతంలోని ప్రతి పాత్ర ఎన్నో భావోద్వేగాలను కలిగి ఉంటుంది. ఏ కథను తీసుకున్నా, ఏ సన్నివేశం తీసుకున్నా అది మహాభారతంలో భాగంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మహాభారతంను సినిమాగా తీసిన తర్వాత తన కెరీర్‌లో చేయడానికి, పోషించడానికి పాత్రలు ఉండవేమో అన్నట్లుగా ఆమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. దాంతో జాతీయ మీడియాతో పాటు, స్థానిక మీడియాల్లో కూడా ఆమీర్ ఖాన్ చివరి ప్రాజెక్ట్ మహాభారతం అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆమీర్ ఖాన్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆమీర్ ఖాన్ వయసు 60 అయినప్పటికీ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మరో ఇరువై... ముప్పై ఏళ్లు ఆయన నటుడిగా కొనసాగాలని, ఆయన సినిమాలు చేయాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. మహాభారతంతో తన కెరీర్ ముగుస్తుంది అంటూ వస్తున్న వార్తలపై ఆమీర్ ఖాన్ స్పందించాడు. తాను ఇప్పటి వరకు సినిమాలను వదిలి పెట్టాలి అనే ఆలోచనకు రాలేదు. మహాభారతం చేయడం అనేది గొప్ప విషయం అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి నేను మొత్తం ఇండస్ట్రీనే వదిలి పెట్టి పోతాను అన్నట్లుగా వార్తలు రాయడం విడ్డూరంగా ఉందని ఆమీర్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. నటనకు స్వస్థి చెప్పే ఉద్దేశం నాకు లేదని అన్నాడు.
నటుడిగా మంచి పాత్రలు వస్తే నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నేను నటుడిగా ప్రేక్షకులను మెప్పించడం కోసం చివరి వరకు కొనసాగుతాను అన్నాడు. మీడియాలో వస్తున్న వార్తలపై, ఆమీర్ ఖాన్ చివరి సినిమా అంటూ జరుగుతున్న ప్రచారంకు తెర పడ్డట్లు అయింది. ఆయన నుంచి వచ్చిన ఈ ప్రకటన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. గత కొన్నాళ్లుగా ఆమీర్ ఖాన్ విజయాలను దక్కించుకోలేక పోతున్నాడు. అయినా కూడా ఆయన పై నమ్మకంతో అభిమానులు సితారే జమీన్ పర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా మాత్రమే కాకుండా ముందు ముందు ఆయన చేయబోతున్న సినిమాల కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
