సూపర్ స్టార్ చివరి ప్రాజెక్ట్ అదే కావచ్చట..!
సూపర్ స్టార్స్ నుంచి చిన్న స్టార్స్ వరకు అందరికీ ఏదో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది.
By: Tupaki Desk | 2 Jun 2025 3:00 PM ISTసూపర్ స్టార్స్ నుంచి చిన్న స్టార్స్ వరకు అందరికీ ఏదో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రస్తుత స్టార్స్‌లో చాలా మందికి పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాలు లేదా సిరీస్‌లు చేయాలని కోరికగా ఉంది. అందులో భాగంగానే పలువురు స్టార్స్‌కి మహాభారతం ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. చాలా కాలంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మహాభారతంను చెబుతూ వస్తున్న విషయం తెల్సిందే. మహాభారతం ను పలు పార్ట్‌లుగా చేయాలని కోరుకుంటున్నాను అంటూ పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే మహాభారతం చేసిన తర్వాత తాను మళ్లీ సినిమాలు చేయక పోవచ్చు అని రాజమౌళి అన్నారు.
మహాభారతం సినిమాను చేయడం కోసం తనకు ఉన్న అనుభవం సరిపోదు అనుకుంటున్నాను. అందుకే ఆ సినిమాను చేయడం కోసం మరికొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాను అన్నాడు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ సైతం ఆసక్తికర వ్యాక్యలు చేశాడు. ఇటీవల అమీర్ ఖాన్ తన సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక పాడ్ కాస్ట్‌లో పాల్గొన్నాడు. రాజ్ షమానీ తో పాడ్ కాస్ట్‌లో ఆమీర్ ఖాన్ పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ... నా చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తూ ఉండాలి అనుకుంటున్నాను. అయితే తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహాభారతం సినిమా ప్రారంభం చేయాలని అనుకుంటున్నాను.
మహాభారతం అనేది చాలా లోతుగా తీయాల్సిన సినిమా, ఆ ప్రాజెక్ట్‌ను చేసిన తర్వాత ఇక చేయడానికి ఏమీ ఉండదు. మహాభారతంలో అన్ని భావోద్వేగాలు, అన్ని రకాల ఫీలింగ్స్‌ను చూపించే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోని అన్ని రకాల ఫీలింగ్స్‌ను మహాభారతం కథలో చూపించే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో మన చుట్టూ జరుగుతున్న ఘటనలు, సంఘటనలు మహాభారతంలో మనం చూస్తూ ఉంటాం. అందులో లేనిది అంటూ ఏమీ లేదు. అందుకే మహాభారతం సినిమాను తీయాలి అంటే మామూలు విషయం కాదు. తక్కువ సమయంలో మహాభారతం ను సినిమాగా తీయడం అంత సులభమైన విషయం కాదు. అందుకే చాలా ఎక్కువ సమయం తీసుకుంటాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఆమీర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా రెండు దశాబ్దాలు అయినా ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంది. అందుకే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా సితారే జమీన్ పర్ సినిమా రూపొందింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ విభిన్నమైన పాత్రలో కనిపించాడు. ఈ సినిమా రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. ఆమీర్ ఖాన్ దశాబ్ద కాలంగా సాలిడ్ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. ఈ సినిమాతో అయినా సూపర్ హిట్ సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమీర్ ఖాన్ ఈ సినిమా తర్వాత ఒక భారీ కమర్షియల్ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఆ సినిమా అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.
