OTTలపై మాటకు కట్టుబడిన ఒకే ఒక్క నిర్మాత కం హీరో
భారతీయ సినీ పరిశ్రమలో ఓటీటీ (OTT) విప్లవం వచ్చిన తర్వాత థియేటర్ల ఉనికి ప్రశ్నార్థకమైందని చాలామంది నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By: Sivaji Kontham | 25 March 2026 9:15 AM ISTభారతీయ సినీ పరిశ్రమలో ఓటీటీ (OTT) విప్లవం వచ్చిన తర్వాత థియేటర్ల ఉనికి ప్రశ్నార్థకమైందని చాలామంది నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఓటీటీల దూకుడుకు పక్కాగా ముకుతాడు వేసిన ఏకైక హీరో కం నిర్మాతగా అమీర్ ఖాన్ నిలుస్తున్నారు. థియేటర్ వ్యవస్థను కాపాడటమే లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.
సాధారణంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది నిర్మాతలు తమ సినిమా విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదనే `8 వారాల రూల్` గురించి మాట్లాడతారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అదనపు ఆదాయం కోసం కేవలం నాలుగు వారాలకే సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన మాటపై నిలబడి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఒక్కడిగానే ఢీకొడుతున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.
ఓటీటీల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతోందని... దీనివల్ల ఎగ్జిబిషన్ రంగం పూర్తిగా విధ్వంసం అవుతోందని అమీర్ ఖాన్ గతంలోనే తన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సొంత సినిమాల విషయంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. థియేటర్ అనుభవాన్ని ప్రేక్షకులు పూర్తిగా పొందిన తర్వాతే.. అది కూడా చాలా నెలల గ్యాప్ తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమా స్ట్రీమ్ అవ్వాలని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
అమీర్ ఖాన్ నిర్మించి నటించిన తాజా చిత్రం `సితారే జమీన్ పర్` ఇందుకు ఒక చక్కని ఉదాహరణ. గతేడాది జూన్ 20న విడుదలైన ఈ సినిమా ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు ఏ ఓటీటీలోనూ ప్రత్యక్షం కాలేదు. భారీ ఆఫర్లు వచ్చినా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమా వచ్చే గ్యాప్ విషయంలో ఆయన ఏమాత్రం రాజీ పడలేదు. థియేటర్ వ్యవస్థను గౌరవించడం కోసం ఎంతటి ఆర్థిక ప్రయోజనాన్నైనా వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు.
ఎట్టకేలకు నెలల నిరీక్షణ తర్వాత `సితారే జమీన్ పర్` ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇతర స్టార్ హీరోల సినిమాలు నెల రోజుల్లోనే ఫోన్లలోకి వచ్చేస్తున్న తరుణంలో అమీర్ ఖాన్ తన సినిమాను ఇంతకాలం ఆపడం విశేషం. ఈ పోరాటం థియేట్రికల్ రంగానికి ఒక కొత్త ఊపిరి పోస్తుందని మిగిలిన హీరోలు కూడా ఇలాగే స్పందిస్తే పరిశ్రమ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల తెలుగు చిత్రసీమలోను 8 వారాల విండో నియమాన్ని నిర్మాతలు ఆమోదించారని కథనాలొచ్చాయి. హిందీ సినీరంగంలానే టాలీవుడ్ లోను ఎనిమిది వారాలపాటు ఓటీటీలలో స్ట్రీమింగ్ లేకుండా నియమాన్ని పాటిస్తే అది ఒక గొప్ప మలుపుగా భావించాలి.
