అమెరికా కంటే థియేటర్లలో వెనకబడ్డాం: అమీర్ ఖాన్
ముంబైలో వేవ్స్ 2025 సమ్మిట్ సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ఆస్కారం కల్పిస్తోంది.
By: Tupaki Desk | 3 May 2025 9:01 AM ISTముంబైలో వేవ్స్ 2025 సమ్మిట్ సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ఆస్కారం కల్పిస్తోంది. ఈ వేదికపై దిగ్గజాలు సినీరంగంపై తమ పరిశోధనల్ని ఆవిష్కరిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఎగ్జిబిషన్ రంగం పరిస్థితిపైనా, సినిమాలు ఆడకపోవడానికి కారణాలపైనా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. నటుడిగా, నిర్మాతగా దశాబ్ధాల అనుభవం ఉన్న అమీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి.
నిజానికి భారతదేశంలో జనాభాకు తగ్గట్టు థియేటర్లు అందుబాటులో లేవని అమీర్ ఖాన్ వేవ్స్ వేదికగా జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. జనాలకు చేరువగా థియేటర్లు అందుబాటులో లేనప్పుడు సినిమాల గురించి వినగలరు కానీ చూడలేరని అన్నారు. అంతేకాదు.. చైనా, అమెరికా లాంటి చోట్ల జనాభా దృష్ట్యా చూస్తే ఎక్కువ థియేటర్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. భారతదేశంలో కనీసం 10,000 థియేటర్లు కూడా లేకపోవడం ఎప్పుడూ సమస్యగా ఉందని అభిప్రాయపడ్డారు. మనం థియేటర్లలో పెట్టుబడులు పెట్టాలి. వాటిని పెంచాలి! అని అన్నారు. మనకంటే చాలా తక్కువ జనాభా ఉన్న అమెరికా థియేట్రికల్ రంగంలో బెస్ట్ గా ఉందని తెలిపారు. దేశంలో అపారమైన సామర్థ్యం ఉన్నా కానీ అమ్మకాల పాయింట్లు (థియేటర్లు) లేవని అమీర్ బలంగా చెబుతున్నారు. మనకు ఇంకా చాలా స్క్రీన్లు రావాలని కోరుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని దురదృష్టకర పరిస్థితి అని అభివర్ణించారు.
అలాగే ఓటీటీల రాకతోనే జనం థియేటర్లకు రావడం తగ్గిందని విశ్లేషించారు. థియేట్రికల్ రిలీజ్ కి ఓటీటీ రిలీజ్ కి మధ్య కేవలం 45 రోజుల గ్యాప్ ఉందని, దీని కారణంగా కూడా జనం థియేటర్లకు రావడం లేదని అన్నారు. మనకు మనమే సినిమా వ్యాపారాన్ని చంపుకుంటున్నామని వ్యాఖ్యానించారు. సినిమాలు ఎందుకు ఆడటం లేదు? అంటే కచ్ఛితంగా ఓటీటీల గురించి ఆలోచించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాక, అతడు పూర్తిగా తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పార్ పైనే దృష్టి సారించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
