లోకేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఆమిర్
ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో కోలీవుడ్ లో నెక్ట్స్ లెవెల్ గుర్తింపును తెచ్చుకోవడంతో పాటూ స్టార్ డైరెక్టర్ గా మారాడు లోకేష్ కనగరాజ్.
By: Tupaki Desk | 5 Jun 2025 6:42 PM ISTఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో కోలీవుడ్ లో నెక్ట్స్ లెవెల్ గుర్తింపును తెచ్చుకోవడంతో పాటూ స్టార్ డైరెక్టర్ గా మారాడు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు చేస్తుండగా కూలీ ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకేష్ అడగాలే కానీ ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి ఆలోచించరు. అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్. ఈ నేపథ్యంలోనే తాను త్వరలోనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు వెల్లడించాడు ఓ స్టార్ హీరో. ఆయన మరెవరో కాదు, బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
సితారే జమీన్ పర్ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న ఆమిర్ పలు విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయాన్ని వెల్లడించాడు. సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో ఓ విలేకరి నుంచి ఆమిర్ కు దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
గత కొన్నాళ్లుగా మీరు లోకేష్ తో సినిమా చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి అందులో నిజమెంత అని అడగ్గా, దానికి ఆమిర్ స్పందిస్తూ అవును, ఆ వార్తలు నిజమే, లోకేష్ తో తాను సినిమా చేస్తున్నట్టు వెల్లడించాడు. ప్రస్తుతం తామిద్దరూ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నామని, ఓ సూపర్ హీరో జానర్ లో ఈ సినిమా ఉండబోతుందని, నెక్ట్స్ ఇయర్ జూన్ లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని, ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని, మరో రెండేళ్ల తర్వాత దీని గురించి మాట్లాడుకుందామని ఆమిర్ తెలిపాడు.
