'హనీమూన్ హత్య కేసు'పై అమీర్ ఖాన్ సినిమా
ఇటీవల దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా చర్చించుకున్న ఒక సంచలన కేసు ఆధారంగా రూపొందించిన కథతో సినిమాని రూపొందించేందుకు అమీర్ ఖాన్ సన్నాహకాల్లో ఉన్నారు.
By: Tupaki Desk | 22 July 2025 9:40 AM ISTఅమీర్ ఖాన్ ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు చేస్తున్నాడు. కానీ అవేవీ అతడికి సంతృప్తికర ఫలితాన్ని అందించడం లేదు. `లాల్ సింగ్ చడ్డా` అతడి కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సీతారే జమీన్ పర్ మంచి సమీక్షలు అందుకున్నా కానీ, యావరేజ్ కలెక్షన్లతో సరిపెట్టుకుంది.
ఈ పరిస్థితుల్లో అతడు వందశాతం సంతృప్తిని ఇచ్చే సరైన బ్లాక్ బస్టర్ కొట్టడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. అందుకే సీతారే జమీన్ పర్ తర్వాత ఆమిర్ ఖాన్ ఊపిరి పీల్చుకునే మూడ్‌లో కనిపించడం లేదు. అతడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి నిజ జీవితకథను ఎంపిక చేసుకున్నాడని కథనాలొస్తున్నాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా చర్చించుకున్న ఒక సంచలన కేసు ఆధారంగా రూపొందించిన కథతో సినిమాని రూపొందించేందుకు అమీర్ ఖాన్ సన్నాహకాల్లో ఉన్నారు. ఇది మేఘాలయ హనీమూన్ హత్య కేసు. ఈ కేసులో ట్విస్టులు, టర్నులు అమీర్ ఖాన్ ని విపరీతంగా ఆకర్షించాయని తెలిసింది. హనీమూన్ హత్య కేసు వివరాల్లోకి వెళితే.. రాజా రఘువంశీ మరణం వెనక అతడి భార్య సోనమ్ కుట్ర ఏమిటన్నది తెరపై ఆవిష్కరించనున్నారు.
ఆమిర్ ఖాన్ ఈ కేసును నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత వార్తల్ని అమీర్ బృందం ఇంకా ధృవీకరించలేదు. ఇంతకుముందు క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో అమీర్ `తలాష్` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు కూడా నిజజీవిత ఘటనల ఆధారంగా సినిమాని తెరకెక్కించాలని అతడు ఆలోచిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు మహాభారతం ఆధారంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని కూడా అతడు పట్టాలెక్కించబోతున్నాడని ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే. తదుపరి రజనీకాంత్ కూలీలోను ఆమిర్ కనిపిస్తాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.
