ఫస్ట్ లుక్: రోలెక్స్ గజినీకి తాతలా ఉన్నాడు!
ఇంతలోనే అమీర్ ఖాన్ తన తదుపరి సినిమాల లైనప్ గురించి ఆలోచిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 4 July 2025 9:29 AM ISTలాల్ సింగ్ చద్దా డిజాస్టర్ ఫలితం తర్వాత మూడు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న అమీర్ ఖాన్ 'సీతారే జమీన్ పర్'తో తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. ఈ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్ కథానాయికగా నటించగా, 10 మంది వర్ధమాన తారలు నటించారు. మానసిక వైకల్యం ఉన్న క్రీడాకారుల టీమ్ కోచ్ గా అమీర్ ఖాన్ నటించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 200 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నా, ఇది ఒక సెక్షన్ ప్రేక్షకులను మాత్రమే ఆకర్షించిందని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.
ఇంతలోనే అమీర్ ఖాన్ తన తదుపరి సినిమాల లైనప్ గురించి ఆలోచిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అమీర్ ఖాన్ తదుపరి రజనీకాంత్ కూలీలో అతిథి పాత్రతో అభిమానులను అలరించనున్నాడు. కూలీలో దహా అనే ఒక మాస్ బోయ్ పాత్రలో కనిపించబోతున్నాడు అమీర్ ఖాన్. తాజాగా కూలీ టీమ్ అతడి లుక్ ని రిలీజ్ చేసింది. అమీర్ నల్ల బనియన్ తొడుక్కుని మెడలో పెండెంట్ చైన్, చేతికి గోల్డ్ వాచ్.. టాటూలు.. చెవి పిన్ను .. చెరిగిన జుత్తుతో ఊరమాస్ గా కనిపిస్తున్నాడు. నిజానికి చాలా ఫ్లాప్ సినిమాల్లో నటిస్తున్న అమీర్ కి ఈ కొత్త లుక్ రీఫ్రెషింగ్ గా కనిపిస్తోంది. అమీర్ స్ట్రాంగ్ గా హుక్కా పీలుస్తున్నాడు. రింగు రింగులుగా పొగలు వదులుతున్నాడు. చూడగానే తమిళ హీరో సూర్య మాస్ పాత్రల్లో ఒకదానిని గుర్తు చేస్తోంది. రోలెక్స్ గజినీకి తాతలా కనిపిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. దీనిని బట్టి అతడు తెరపై కొద్దిసేపు కనిపించినా అభిమానుల్ని ఒక రేంజులో అలరిస్తాడని అర్థమవుతోంది.
ఈ సినిమాలో నటించాల్సిందిగా రజనీకాంత్ టీమ్ అమీర్ ని సంప్రదించగా, కథేంటి, పాత్ర ఏమిటి? అన్నది కూడా అడగకుండా రెండో ఆలోచనే లేకుండా ఓకే చేసానని అమీర్ చెప్పాడు. తాను సూపర్ స్టార్ రజనీకాంత్ కి అభిమానిని.. ఆయనంటే గౌరవం.. ప్రేమ అని, అది ఎలాంటి పాత్ర అయినా తాను నటిస్తానని వెంటనే మాటిచ్చానని అమీర్ చెబుతున్నారు. అయితే అతడు అలా అంగీకరించినందుకు గిట్టుబాటు అయ్యే పాత్రనే రజనీ ఆఫర్ చేసారని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. బాలీవుడ్ లో రొటీన్ లేదా ప్రజలకు కనెక్ట్ కాని వెరైటీ పాత్రల్లో నటించినా కానీ, మాస్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే పాత్రల్లో అమీర్ ఖాన్ కనిపించడం లేదు. ఈసారి అచ్చం తమిళ తంబీ అవతారంలోకి మారాడు. ఇంకా చెప్పాలంటే సింగం, గజినీ- రోలెక్స్ కి తాతలా కనిపిస్తున్నాడు ఈ కొత్త లుక్కులో.
కూలీ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో నటించారు, సౌబిన్ షాహిర్, నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్ , ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టులో ఈ చిత్రం అత్యంత భారీగా విడుదల కానుంది.
