అతిపెద్ద డిజాస్టర్ గురించి సూపర్ స్టార్ ఏమన్నాడంటే..!
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌లతో పాటు ఫ్లాప్స్ కూడా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి హీరో కెరీర్‌లో సక్సెస్‌ల కంటే ఫ్లాప్‌లు ఎక్కువగా ఉంటాయి.
By: Tupaki Desk | 26 Jun 2025 11:14 AM ISTసినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌లతో పాటు ఫ్లాప్స్ కూడా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి హీరో కెరీర్‌లో సక్సెస్‌ల కంటే ఫ్లాప్‌లు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది హీరోలు వరుస ఫ్లాప్స్ కారణంగా కనుమరుగవడం, కనిపించకుండా పోవడం, స్థాయి తగ్గించుకుని సినిమాలు చేయడం వంటివి చేస్తారు. దర్శక, నిర్మాతలకు కూడా హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఫ్లాప్స్ లేని హీరోలు, దర్శకులు చాలా చాలా అరుదుగా ఉంటారు. ఇండస్ట్రీలో అలాంటి వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. బాలీవుడ్ సూపర్ స్టార్ మిస్టర్ పెర్ఫెక్ట్ అంటూ పేరు సొంతం చేసుకున్న ఆమీర్ ఖాన్ కెరీర్ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గత పదేళ్ల కాలంలో ఆమీర్ నుంచి ఒక్క హిట్ బొమ్మ పడిందే లేదు.
ఆమీర్ ఖాన్ తాజాగా సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఆమీర్ చాలా నమ్మకంగా ప్రచారం చేస్తూ వచ్చాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా పూర్ ఓపెనింగ్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. లాంగ్ రన్‌లో సినిమా నిలబడుతుందని అంతా భావిస్తున్నారు. సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అతి పెద్ద డిజాస్టర్ 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' గురించి స్పందించాడు. ఆ సినిమా ఫ్లాప్ చాలా నిరాశను మిగిల్చిందని అన్నాడు, చాలా నమ్మకంతో చేసిన ఆ సినిమా ఫ్లాప్‌ను జీర్ణించుకోవడంకు చాలా సమయం పట్టింది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.
మొదట అనుకున్న స్క్రిప్ట్ బాగా వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల స్క్రిప్ట్‌ను చేంజ్ చేస్తూ వచ్చాం. సాధారణంగా తాను అలాంటి మార్పులను వ్యతిరేకిస్తూ ఉంటాను. కానీ ఆ సమయంలో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సినిమా ఫ్లాప్ బాధ్యతను దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య, నిర్మాత ఆదిత్య చోప్రా తో కలిసి తాను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సినిమా విడుదలకు ముందు చూసిన సమయంలోనే అందరి అభిప్రాయాలు కలవలేదు. ఆ సమయంలోనే అనుమానం వ్యక్తం అయింది అన్నట్లుగా ఆమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఆమీర్ ఖాన్ చేయడం జరిగింది.
బాలీవుడ్ మీడియా వర్గాల కథనం ప్రకారం అప్పట్లో రూ.350 కోట్ల బడ్జెట్‌తో థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా నిర్మాణం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ బడ్జెట్ చాలా ఎక్కువ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఆమీర్ ఖాన్ అప్పటి ఫామ్ నేపథ్యంలో ఈజీగా రూ.500 కోట్లు వసూళ్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆమీర్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మొదటి రోజు ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. నెగటివ్ టాక్ వ్యాప్తి చెందడంతో సినిమా లాంగ్ రన్‌లో ముక్కుతూ మూలుగుతూ రూ.150 కోట్ల వరకు రాబట్టిందని సమాచారం. సినిమా వల్ల నిర్మాణ సంస్థకు అతి పెద్ద నష్టం మిగిలింది. ఇక ఆమీర్ ఖాన్ కెరీర్ కూడా తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడంలో ఆ సినిమా ప్రధాన కారణం అంటారు. అప్పటి నుంచి ఆమీర్ భారీ బడ్జెట్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు.
