మేమే కాదు ఆ ముగ్గురూ సమానులే.. మిస్టర్ పర్ఫెక్ట్ కామెంట్
బాలీవుడ్ ని దశాబ్ధాల పాటు ఖాన్‌ల త్రయం ఏల్తోంది. ఆ ముగ్గురూ సినీపరిశ్రమకు అత్యంత కీలకమైన హీరోలు.
By: Tupaki Desk | 2 Jun 2025 9:53 AM ISTబాలీవుడ్ ని దశాబ్ధాల పాటు ఖాన్‌ల త్రయం ఏల్తోంది. ఆ ముగ్గురూ సినీపరిశ్రమకు అత్యంత కీలకమైన హీరోలు. హిందీ చిత్రసీమ ఉన్నతి, పురోభివృద్ధి కోసం ఖాన్‌లు చేసిన కృషి అసాధారణమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ లో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందించిన ఘనత వారికి ఉంది. వందల కోట్ల వసూళ్లను తేగలిగే సత్తా ఇప్పటికీ ఉంది. మూడున్నర దశాబ్ధాల కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు.
అయితే ఇండస్ట్రీ అంటే ఖాన్‌ల త్రయం మాత్రమేనా? బాలీవుడ్ కి ఇక ఎవరూ లేరా? ఇదే ప్రశ్న మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. ఖాన్‌ల త్రయంలో కీలక వ్యక్తి అయిన అమీర్ ఖాన్... దీనిని బాధాకరం అని అన్నారు. ఖాన్‌ల త్రయం అని పిలిస్తే తప్పేమీ కాదు కానీ, మాతో పాటు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్లు స్థిరంగా సుదీర్ఘ కాలం ఇండస్ట్రీలో ఉన్నారు. వారంతా గొప్ప విజయాలను అందిస్తున్నారు. పరిశ్రమకు సేవ చేస్తున్నారు. వారి పేర్లను ప్రస్థావించకపోవడం బాధ కలిగిస్తుందని, చెడుగా అనిపిస్తుందని కూడా అమీర్ ఖాన్ అన్నారు.
నిజానికి ఖాన్‌లు ఇటీవల మారారు.. మునుపటితో పోలిస్తే బహిరంగంగా ఇతరుల గొప్పతనాన్ని అంగీకరిస్తున్నారు. ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ అన్నిటినీ మార్చేసింది. సౌత్ నుంచి పోటీ తీవ్రంగా ఉంది. అదే సమయంలో ఖాన్‌లు నెమ్మదిగా నిజాల్ని అంగీకరిస్తున్నారు. పరిశ్రమ అంటే కేవలం తాము మాత్రమే కాదనే సత్యం వారికి బోధపడినట్టే కనిపిస్తోంది. దేవగన్, అక్షయ్, హృతిక్ లను తమతో సమానంగా చూడాలని గౌరవించాలని అమీర అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఇటీవలి కాలంలో సౌత్ హీరోలను కూడా వారు బహిరంగంగా ప్రశంసిస్తున్నారు. బాహుబలి ప్రభాస్ కి, పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ కి, ఆర్.ఆర్.ఆర్ స్టార్లు ఎన్టీఆర్, చరణ్ లపైనా ప్రశంసలు కురిపించారు. ఉత్తరాది నుంచి ఖాన్‌లు మాత్రమే కాదు, చాలా మంది స్టార్లు దక్షిణాది స్టార్ల ప్రతిభను కొనియాడుతున్నారు. ఈ పరిణామం టాలీవుడ్ స్థాయిని అమాంతం పెంచుతోంది. ఇది అందరికీ కలిసొచ్చే కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
