సూపర్ స్టార్ ఇంటికి 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు...!
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
By: Tupaki Desk | 28 July 2025 4:10 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం సమాజంలో ఉన్న ఒక లోపంను తీసుకుని ఆమీర్ ఖాన్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. సినిమా థియేట్రికల్ రిలీజ్ మాత్రమే ఉంటుంది అని, ఓటీటీ లో విడుదల చేసే ఉద్దేశం లేదని ముందే ఆమీర్ ఖాన్ ప్రకటించిన నేపథ్యంలో అంతా కూడా ఆ విషయమై మాట్లాడుకోవడం జరిగింది. మొన్నటి వరకు సినిమా గురించి, ఆయన తీసుకున్న నిర్ణయం గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆమీర్ ఖాన్ మరో కొత్త విషయంతో వార్తల్లో నిలిచారు.
ఆమీర్ ఖాన్ ఇంటికి ఉన్నట్లుండి ఏకంగా 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు రావడం చర్చనీయాంశం అయింది. ఆమీర్ ఖాన్ ఇంటి ముందు ఎప్పుడూ కొందరు మీడియా ప్రతినిధులు ఉంటారు. వారు చూస్తూ ఉండగానే ఆ 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఆమీర్ ఖాన్ ఇంట్లోకి వెళ్లారట. ఈ విషయం జాతీయ మీడియాలోనూ ఒక్కసారిగా చర్చనీయాంశం అయింది. ఆమీర్ ఖాన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అంతే కాకుండా ఆయన స్టాఫ్‌ని అడిగే ప్రయత్నం చేసిన మీడియా వారికి సరైన సమాధానం రాలేదు. వారి స్టాఫ్ కి సైతం ఆ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన విజిట్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఒక స్టార్ హీరో ఇంట్లో ఐటీ సోదాలు జరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇలా ఒకే సారి స్టార్ హీరో ఇంటికి 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు రావడం ఏంటో అని స్థానికులు, మీడియా వారు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే వారు నిజమైన ఐపీఎస్ ఆఫీసర్‌లేనా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆమీర్ ఖాన్ ఇంటి ముందు కొన్ని గంటల పాటు హడావిడి వాతావరణం నెలకొంది, అంతే కాకుండా ఏం జరుగుతుందో తెలియక బయట ఉన్న వారు కంగారు పడటం కూడా జరిగింది. విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఆమీర్ ఖాన్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారని మీడియా లో చూపిస్తున్నారు.
పోలీస్ ఆఫీసర్‌లతో కూడిన వ్యాన్ ఆమీర్ ఖాన్ ఇంటి ముందు ఆగడం, అందులో నుంచి పెద్ద ఎత్తున ఐపీఎస్ ఆఫీసర్లు దిగుతూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమై ఆమీర్ ఖాన్ వెంటనే స్పందించాలని అభిమానులు, మీడియా వారు డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ విషయం గురించి ఆమీర్ ఖాన్ ఆఫీస్ నుంచి ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు మీడియా ప్రతినిధులు వేచి చూస్తున్నారు. జాతీయ మీడియా వారు పలువురు ఆమీర్ ఖాన్‌ను, ఆయన టీం మెంబర్స్‌ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ ఇప్పటి వరకు అందుబాటులోకి రావడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ విషయమై సస్పెన్స్ నెలకొంది.
