లైనప్ లో వంశీ పైడపల్లి నెంబర్ ఎంత?
స్టోరీ పరంగా అమీర్ ఖాన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఎప్పుడు పిలుస్తాడా? అని వంశీ ఎదురు చూస్తున్నాడు.
By: Tupaki Desk | 22 May 2025 11:22 AM ISTబాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. 'లాల్ సింగ్ చడ్డా' తర్వాత సైలెంట్ అయిపోయిన అమీర్ ఇప్పుడా గ్యాప్ ను వీలైనంత వేగంగా ఫిల్ చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన నటించిన 'సితారా జమీన్ పర్' చిత్రం పూర్తయింది. ప్రస్తుతం ఆ సినిమా ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. వాటిలో అమీర్ ఖాన్ పాల్గొంటు న్నారు. జూన్ 20 న ఆ చిత్రం రిలీజ్ అవుతుంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో ఓ కామిక్ ఎంటర్ టైనర్ రంగం సిద్దమవుతోంది.
ఇందులో ఓ కీలక పాత్రకు ఆమిర్ ఖాన్ తో చర్చలు జరుగుతున్నాయి. 'డ్రీమ్ గర్ల్' ఫేం రాజ్ శాండిల్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్ త్వరలోనే స్క్రిప్ట్ వింటారు. ఆ తర్వాతే అమీర్ నటిస్తు న్నారా? లేదా? అన్న దానిపై క్లారిటీ వస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'సితారే జమీన్ పర్' తర్వాత అమీర్ నటించే సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. సెప్టెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నారు. అలాగే అమీర్ఖాన్ హీరోగా రాజ్ కుమార్ సంతోషి కూడా ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు.
లాహోర్ 1947 బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా ఉంటుంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా అమీర్ ఖాన్కు స్టోరీ చెప్పి సిద్దంగా ఉన్నారు. స్టోరీ పరంగా అమీర్ ఖాన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఎప్పుడు పిలుస్తాడా? అని వంశీ ఎదురు చూస్తున్నాడు. అలాగే భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో కూడా నటిస్తు న్నట్లు అధికారకంగా వెల్లడించారు అమీరు. దీనికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇలా అమీర్ ఖాన్ లైనప్ లో నాలుగు సినిమాలు కనిపిస్తున్నాయి. వీటిలో ముందుగా ఏది పట్టాలెక్కుతుంది? అన్నది అమీర్ చెబితే గానీ క్లారిటీ రాదు. ఇందులో వంశీ టోకెన్ నెంబర్ తెలియాల్సి ఉంది. త్వరలో రిలీజ్ కానున్న 'కూలీ' చిత్రంతో అమీర్ అలరించనున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన సినిమాలో అమీర్ గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.
