Begin typing your search above and press return to search.

స్టార్ హీరో ఆస్తి 1800 కోట్లు.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

అమీర్ ఖాన్ భారతీయ సినిమా లెజెండ్‌ల‌లో ఒకడు. గత 30 సంవత్సరాలుగా తనవైన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   15 March 2024 12:30 AM GMT
స్టార్ హీరో ఆస్తి 1800 కోట్లు.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే
X

అత‌డు అద్భుత న‌టుడు మాత్ర‌మే కాదు.. అద్భుత వ‌క్త‌.. అద్భుత ప‌రిశీల‌కుడు.. ప‌రిశోధ‌కుడు.. క‌థ‌ల ఎంపిక‌లో నిష్ణాతుడు.. ప్ర‌యోగశాల‌.. సినీనిర్మాత‌గా ప‌రిప‌క్వ‌త చెందిన‌వాడు.. ఇంకా ఇలాంటి క్వాలిటీస్ అప‌రిమితంగా అత‌డిలో ఉన్నాయి. అందుకే అత‌డు మూడు ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాల్లో న‌టించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అనంతంగా ప్రేమించే అభిమానులు అత‌డికి ఉన్నారు. ఇన్నేళ్ల‌లో అత‌డు 1800 కోట్ల ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టాడు. ఖాన్ ల త్ర‌యంలోనే ఎదురేలేని హీరోగా రాణించాడు. ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా చిన్న‌పాటి వెనుకంజ ఉన్నా కానీ, అత‌డికి ఉన్న ఇమేజ్ ఎంత‌మాత్రం చెక్కు చెద‌ర‌లేదు.


అత‌డు ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌రం లేదు. ది గ్రేట్ అమీర్ ఖాన్. అద్భుతమైన నటుడిగా కాకుండా, నిర్మాతగా అమీర్ ఖాన్‌కు `మిడాస్ టచ్` ఎలా సాధ్య‌మైంది? అనేది ప‌రిశోధ‌కులు వెతుకుతూనే ఉన్నారు. అలాంటి వారికి ఇక్క‌డ స‌మాధానం ఉంది.

అమీర్ ఖాన్ భారతీయ సినిమా లెజెండ్‌ల‌లో ఒకడు. గత 30 సంవత్సరాలుగా తనవైన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నిజానికి రూ.100 కోట్ల క్లబ్‌ను మాత్రమే కాకుండా రూ.200 కోట్ల క్ల‌బ్‌, 300 కోట్ల క్లబ్‌ను కూడా ప్రారంభించిన‌ మొదటి భార‌తీయ హీరోగా అమీర్ రికార్డుల‌కెక్కారు. అత‌డిని బాక్సాఫీస్ లెజెండ్ గా గౌర‌విస్తారు. బాక్సాఫీస్ వద్ద అతడి శక్తి, క‌థ‌ల ఎంపిక‌లో రిస్క్ తీసుకోగల సామర్థ్యం అతడు నిర్మాతగా మారడానికి ప్ర‌ధాన కార‌ణంగా మారింది. నిర్మాత‌గా అత‌డు అజేయ‌మైన రికార్డును క‌లిగి ఉన్నారు. అత‌డు పెద్ద ప్రాజెక్ట్‌లకు మాత్రమే కాకుండా.. చిన్న ప్రయోగాత్మక చిత్రాలకు కూడా మద్దతు ఇస్తున్నాడు. వాటిని గెలిపిస్తున్నాడు.

నిర్మాతగా అమీర్ ప్రయాణం కొత్త సహస్రాబ్దితో ప్రారంభమైంది. అతడు `లగాన్: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా`కు నిర్మాత‌. ద‌ర్శ‌కుడు అశుతోష్ గోవారికర్ కలకి మద్దతు ఇచ్చి గెలిపించిన ధీరోధాత్త హీరో. స్వాతంత్య్రానికి పూర్వం సాగే క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. 11 మంది భార‌తీయ‌ గ్రామస్తులు క్రికెట్ ఆట‌లో గేమ్ పుట్టుక‌కు కార‌ణ‌మైన‌ బ్రిటిష్ వారితో త‌ల‌ప‌డే అద్భుత‌మైన కథను తెర‌పై చూపించారు. అప్పట్లో ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా రికార్డుల‌కెక్కింది. ఈ చిత్రం కోసం 25 కోట్ల బ‌డ్జెట్ పెట్ట‌గా, రూ. 34 .31 కోట్లు వ‌సూలైంది. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆస్కార్ పోటీలోను నిలిచింది.

కెరీర్‌లో బ్రేక్

లగాన్ తర్వాత, మంగళ్ పాండే: ది రైజింగ్ కోసం సిద్ధమవుతున్నందున అమీర్ తన కెరీర్‌కు సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. 2007లో దర్శీల్ సఫారీ ప్రధాన పాత్రలో `తారే జమీన్ పర్‌`తో తిరిగి వచ్చాడు. డైస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లవాడి క‌థ‌ను దృష్టిలో ఉంచుకుని సెకండ్ హాఫ్‌లో మాత్రమే కనిపించిన అమీర్ సెకండ్ లీడ్ గా సాహ‌సం చేసాడు. అత‌డి ఆలోచ‌న‌ తేలిగ్గా పాస్ అవ్వడం వల్ల ఈ సినిమా పెద్ద రిస్క్‌గా భావించాల్సి వ‌చ్చింది. అయితే ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద‌ 61.83 కోట్లు వసూలు చేసింది. తర్వాత అతడి మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తొలి చిత్రం జానే తు యా జానే నా 2008 ని నిర్మించాడు. ఈ చిత్రం విజయవంతమైంది. రూ. 55.62 కోట్లు వసూలు చేసింది.

ప్రయోగాత్మక సినిమా

2010లో రైతు ఆత్మహత్యల గురించిన వ్యంగ్యమైన పీప్లీ (లైవ్)కి ఒక నిర్మాత‌గా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు అమీర్ కొంచెం ఎక్కువ ప్రయోగాత్మకంగా క‌నిపించాడు - ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజ‌యం సాధించింది. రూ. 30.41 కోట్లు రాబట్టింది. 2011లో అమీర్ తదుపరి రెండు ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రాలకు మద్దతు ఇచ్చాడు. ఒకటి కిరణ్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ తొలి చిత్రం ధోబీ ఘాట్ - ఇది న‌లుగురు విభిన్న వ్యక్తుల కథ. ఇమ్రాన్ ఖాన్, వీర్ దాస్ , కునాల్ రాయ్ కపూర్ న‌టించిన‌ ఢిల్లీ బెల్లీకి పెట్టుబ‌డులు పెట్టాడు. ధోబీ ఘాట్‌ కేవలం రూ.13.77 కోట్లు రాబట్టి గుండెలవిసేలా చేసింది. ఇది పెద్ద ఫెయిల్. త‌ర్వాత‌ ఢిల్లీ బెల్లీ కథాంశం, పాటలు వ‌ర్క‌వుటై రూ.52 కోట్లు వసూలు చేసింది.

అమీర్ తర్వాత జోయా అక్తర్ `తలాష్: ది ఆన్సర్స్ లైస్ విథిన్`కి సహ-నిర్మాతగా ఉన్నాడు. రాణి ముఖర్జీ -కరీనా కపూర్‌లు కలిసి నటించిన ఈ చిత్రం అతీంద్రియ అంశాలతో దుఃఖాన్ని అధిగమించే క‌థ‌తో రూపొందింది. ఈ సినిమా మంచి రివ్యూలు రాబట్టి 93.40 కోట్ల వసూళ్లను రాబట్టింది. అమీర్ తన తదుపరి చిత్రం కోసం రెజ్లర్‌గా మారాడు. దీనికోసం చాలా శ్ర‌మించాడు. నితేష్ తివారీ తెర‌కెక్కించిన‌ దంగల్ భార‌త‌దేశంలోనే అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా మారింది. అమీర్ తో పాటు, ఫాతిమా సనా షేక్ , సన్యా మల్హోత్రా ఇత‌ర‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 387 కోట్లు రాబట్టింది.

2017లో అమీర్ ఖాన్ తన ప్రొడక్షన్ లో `సీక్రెట్ సూపర్‌స్టార్‌`తో మరోసారి పెద్ద‌ రిస్క్ తీసుకున్నాడు. ఇది గృహ హింస యువత‌రం కలల నేప‌థ్యంలో సాగే సినిమా. అతడి అసిస్టెంట్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జైరా వాసిమ్, మెహెరే విజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా, అతిథి పాత్రలో అమీర్‌ నటించారు. ఈ చిత్రం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది ముఖ్యంగా చైనాలో రూ. 900 కోట్లు రాబట్ట‌డం పెను సంచ‌ల‌నం. అయితే భారతదేశంలో రూ. 63.40 కోట్లు మాత్ర‌మే వసూలు చేసింది.

లాల్ సింగ్ చద్దా పరాజయంతో నిరాశ‌:

2022లో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల‌లో `లాల్ సింగ్ చడ్డా` తెర‌కెక్కింది. అమీర్ ఖాన్ నిర్మాత‌. హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఫారెస్ట్ గంప్`కి అధికారిక హిందీ రీమేక్ ఇది. అద్వైత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది. 150 కోట్లు పైగా బ‌డ్జెట్ ని పెట్ట‌గా, కేవలం రూ. 58.73 కోట్లు మాత్రమే సంపాదించింది. ఇది లాగ్ టైమ్‌లో అమీర్ ఖాన్ చిత్రానికి అత్యల్ప కలెక్షన్. ఈ చిత్రం విధి అమీర్‌ను ప్రభావితం చేసింది. అతడు చాలా కాలం పాటు తన పని నుండి వైదొలిగి తన కుటుంబంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవ‌ల త‌న కుమార్తె ఇరా ఖాన్ పెళ్లి న‌చ్చిన యువ‌కుడితో జ‌రిపించాడు. తిరిగి ఇప్పుడు త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తారే జ‌మీన్ పార్ సీక్వెల్ తో కంబ్యాక్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు.