గ్లోబల్ మీడియా నివేదికలపై ఏఏఐబీ స్ట్రాంగ్ రియాక్షన్!
అప్పటి నుంచి ఆ నివేధికకు కొనసాగింపుగా అంతర్జాతీయ మీడియాలు రకరకాల కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఏఐబీ రియాక్ట్ అయ్యింది.
By: Tupaki Desk | 17 July 2025 9:44 PM ISTఅహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమానం ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోన్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇప్పటికే ప్రాథమిక నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ నివేధికకు కొనసాగింపుగా అంతర్జాతీయ మీడియాలు రకరకాల కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఏఐబీ రియాక్ట్ అయ్యింది.
అవును... పలు అంతర్జాతీయ మీడియా సంస్థలను ఏఏఐబీ తాజాగా తీవ్రంగా విమర్శించింది! ఇందులో భాగంగా... అంతర్జాతీయ మీడియాలోని కొన్ని వర్గాలు పదే పదే ఎంపిక చేసిన, ధృవీకరించని నివేదికల ద్వారా తీర్మానాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని.. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఇటువంటి చర్యలు బాధ్యతారహితమైనవని తెలిపింది.
ఈ మేరకు ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ ఈ ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం ప్రమాదం ఇటీవలి విమానయాన చరిత్రలో అత్యంత వినాశకరమైన సంఘటన అని.. ఈ సమయంలో రూల్స్, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ లకు అనుగుణంగా దర్యాప్తును కఠినంగా, అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో జరుగుతుందని అన్నారు!
ముఖ్యంగా ఆధారం లేని అంశాలతో భారత విమానయాన పరిశ్రమ భద్రత పట్ల ప్రజల్లో ఆందోళన సృష్టించాల్సిన సమయం ఇది కాదని తెలిపారు. ఇదే సమయంలో... ఏఏఐబీ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయాలకు రావద్దని కోరారు. ఏమి జరిగిందనే దాని గురించి సమాచారాన్ని అందించడమే ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఉద్దేశ్యం అని నొక్కి చెప్పారు.
ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఈ కోణంలోనే చూడాలని.. ఈ దశలోనే ఖచ్చితమైన నిర్ధారణలకు చేరుకోవడం చాలా తొందరపాటు అవుతుందని.. ఏఏఐబీ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. పక్కాగా తుది దర్యాప్తు నివేదిక బయటకు వస్తుందని వెల్లడించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత వచ్చే తుది దర్యాప్తు నివేదిక కోసం వేచి ఉండాలని కోరారు.
కాగా... లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అందులో ఉన్న 242 మందిలో 241 మందితో పాటు బయట ఉన్న 19 మంది పౌరులు మృతి చెందారు. దీంతో... ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత వినాశకరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా ఏఏఐబీ దీనిని అభివర్ణించింది.
ఈ సమయంలో... బాధితుల కుటుంబాల దుఃఖాన్ని గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. 2012లో ఏర్పడినప్పటి నుండి 92 ప్రమాదాలు, 111 తీవ్రమైన సంఘటనలను దర్యాప్తు చేసి, బ్యూరో తన ట్రాక్ రికార్డ్ ను గుర్తు చేసింది. ఈ సందర్భంగా... తుది దర్యాప్తు నివేదిక కోసం వేచి ఉండమని తన విజ్ఞప్తిని పునరుద్ఘాటించింది.
కాగా అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిరిండియా విమానంలోని ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన కాక్ పిట్ వాయిస్ రికార్డింగ్ పై "వాల్ స్ట్రీట్ జర్నల్" తో పాటు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఏఐబీ ఈ రియాక్షన్ ఇచ్చింది!
