Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ - ఆదర్శ కుటుంబం

By:  Tupaki Desk   |   30 Oct 2026 12:41 PM IST
మూవీ రివ్యూ - ఆదర్శ కుటుంబం
X

‘ఆదర్శ కుటుంబం’ మూవీ రివ్యూ

నటీనటులు: వెంకటేష్- శ్రీనిధి శెట్టి- నారా రోహిత్- సత్య-రఘుబాబు- యువిన- మాస్టర్ ప్రజ్వల్- రావు రమేష్- ఉదయ్ బిర్ సంధు-సచిన్ ఖేద్కర్- బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: రవి.కె.చంద్రన్

నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ

రచన-దర్శకత్వం: త్రివిక్రమ్

త్రివిక్రమ్ రచనలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్..మల్లీశ్వరి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ నటించడానికి ఇంకో 20 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు వీరి కలయికలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ కలల కాంబో అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం పదండి.

కథ:

చిట్టిబాబు (వెంకటేష్) మధ్య తరగతి వ్యక్తి. తన ఉద్యోగం పోయి ఇల్లు గడవడానికి.. భార్య చేసిన అప్పులు కట్టడానికి.. కొడుకు సర్జరీకి డబ్బుకు అవసరం పడి నానా ఇబ్బందులు పడుతుంటాడు. అలాంటి టైంలోనే చిట్టిబాబుకు వంద కోట్ల లాటరీ తగులుతుంది. ఆ డబ్బు వచ్చే లోపు ఒక లగ్జరీ విల్లాలోకి మారుతుంది చిట్టిబాబు కుటుంబం. ఐతే అంత పెద్ద లాటరీ తగలడంతో అందరి దృష్టి వీళ్ళ మీద పడుతుంది. చందన్ అనే దొంగల ముఠా నాయకుడు చిట్టిబాబు ఇంటి మీద దాడి చేసి లాటరీ డబ్బంతా కొట్టేయాలని అనుకుంటాడు. అనుకున్న ప్రకారమే చందన్ గ్యాంగ్ చిట్టిబాబు ఇంటి మీద దాడికి వెళ్తుంది. మరి చిట్టిబాబు ఫ్యామిలీ ఈ దాడి నుంచి తప్పించుకుందా.. తర్వాత ఏం జరిగింది అన్నాడు మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన.. విక్టరీ వెంకటేష్ నటన.. ఈ రెండూ కలిస్తే అద్భుతమే. ఒక నువ్వు నాకు నచ్చావ్.. ఒక మల్లీశ్వరి.. మామూలు సినిమాలు ఇవ్వలేదు ఈ జోడీ. మరి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ సినిమా చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని ఆశిస్తే.. నిరాశ తప్పదు. సినిమా తీస్తున్నపుడే ఈసారి తమ జోడీ అద్భుతాలేమీ చేయబోవట్లేదని అర్థమయ్యే ప్రోమోల్లోనే అంచనాలు తగ్గించేసిందేమో ఈ జోడీ. కథాకథనాల పరంగా ‘ఆదర్శ కుటుంబం’ చాలా సాధారణంగా అనిపించే సినిమా. ఏమాత్రం లాజికల్ గా అనిపించని సెటప్ తో త్రివిక్రమ్.. కథ పరంగా బాగా నిరాశపరుస్తాడు. ఆ స్టోరీ చుట్టూ అల్లిన కథనం కూడా పెద్దగా కిక్కు ఇవ్వదు. కానీ బలహీన కథాకథనాల్లోనే తన మార్కు చమత్కారం.. డైలాగులతో త్రివిక్రమ్ ఒక చేయి వేస్తే.. విక్టరీ వెంకటేష్ తనదైన నటనతో సన్నివేశాలను పాస్ చేయించేశాడు. ‘ఆదర్శ కుటుంబం’ చూస్తున్నంతసేపు ఏముంది దీని స్పెషాలిటీ అనిపిస్తూ ఉంటుంది. కానీ రెండున్నర గంటలు అలా అలా గడిచిపోతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే టైంసాప్ వినోదానికి ఢోకా లేని ఈ సినిమాను ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే.

‘ఆదర్శ కుటుంబం’ మేకింగ్ దశలో ఉండగా.. తమిళ చిత్రం ‘బ్లాస్ట్’తో దీనికి పోలిక ఉన్నట్లు గట్టి ప్రచారమే నడిచింది. వేసవికే రావాల్సిన సినిమా.. ఆలస్యం కావడానికి స్క్రిప్టులో జరిగిన మార్పులు చేర్పులు.. రీషూట్లే కారణమని కూడా వార్తలు వచ్చాయి. ‘ఆదర్శ కుటుంబం’ సెటప్ చూస్తే ఈ సందేహాలు నిజమే అనిపిస్తుంది. పైకి సామాన్యంగా కనిపించే ఒక కుటుంబం.. తమ చుట్టూ బిగించిన ఉచ్చును అసామాన్య రీతిలో ఛేదించుకుని బయటికి వచ్చిందన్నది ఈ సినిమా కథాంశం. ఐతే బ్లాస్ట్ లోనే కాదు వేరే సినిమాల్లోనూ చూసిన ఈ పాయింటు చుట్టూ త్రివిక్రమ్ పకడ్బందీ కథనైతే అల్లలేకపోయాడు. త్రివిక్రమ్ బయట మాట్లాడుతున్నపుడు ఉండేంత స్పష్టత.. లాజిక్.. ఈ కథలో మిస్సయ్యాయి. ఇందులో కనిపించే నలుగురు కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాక్ స్టోరీలో కానీ.. సందర్భానుసారం ఆ నలుగురూ తమకు ఎదురైన సవాలును ఛేదించే క్రమంలో కానీ ఏమాత్రం లాజిక్కులు కనిపించవు. ఇదేం సిల్లీ సెటప్ అనిపిస్తుంది. క్రైమ్ ఎలిమెంట్ చుట్టూ నడిపిన వ్యవహారం కూడా సాధారణమే. ఐతే కొంచెం బుర్రపెట్టి ఆలోచించడం మొదలుపెడితే ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి కానీ.. ఆ విషయాలను లైట్ తీసుకుని ఇందులో కామెడీని మాస్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేయడం మొదలుపెడితే మాత్రం టైం ఈజీగానే గడిచిపోతుంది.

‘పోకిరి’ సినిమాలో చివర్లో హీరో పోలీసాఫీసర్ అని తెలిశాక.. మొదట్నుంచి చూసిన సన్నివేశాలను ఒకసారి తలుచుకుంటే చాలా సిల్లీగా అనిపిస్తాయి. ‘ఆదర్శ కుటుంబం’లో మొదట్లో చూపించిన సెటప్ గురించి.. తర్వాత ఆలోచిస్తే మరీ కామెడీగా అనిపిస్తుంది. కానీ లాజిక్స్ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను ప్రతి సన్నివేశంలోనూ ఇన్వాల్వ్ చేయించి గిలిగింతలు పెట్టే త్రివిక్రమ్ చమత్కారానికి మాత్రం ఇందులో లోటు లేదు. సింపుల్ పదాలతోనే ఫన్నీగా అనిపించే డైలాగులను క్రియేట్ చేసి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో తన మార్కును ఆయన మరోసారి చూపించారు. మధ్యతరగతి కుటుంబాన్ని నడిపే హీరోకు ఉండే కష్టాలు.. ఇలాంటి ఫ్యామిలీకి లాటరీ తగిలితే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు... ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ రొటీన్ సీన్స్ లోనే వినోదం పండించాడు. తొలి గంటలో కథ పరంగా ఏం లేదు అనిపిస్తూనే కథనం మాత్రం మంచి స్పీడుతో సాగిపోతుంది. ఇంటర్వెల్ ముంగిట వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ కావాల్సినంత హై ఇస్తుంది.

కథలో పెద్ద ట్విస్ట్ ఇచ్చి భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన త్రివిక్రమ్.. ఈ ట్విస్ట్ వెనుక స్టోరీని సరిగా డీల్ చెయ్యడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. హీరో అండ్ ఫ్యామిలీ బ్యాక్ స్టోరీ చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. దీని వల్ల ఫ్యామిలీ తాలూకు ఎమోషన్ అంతా తేలిపోయింది. ఈ రకంగా నిరాశ పరిచినప్పటికీ కామెడీతో మళ్ళీ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాడు త్రివిక్రమ్. ముఖ్యంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వెంకీ అండ్ ఫ్యామిలీని విచారించే ఎపిసోడ్లో కామెడీ అయితే భలేగా పేలింది. వినోద పరంగా ఇది సినిమాలో మేజర్ హైలైట్. అందులో సత్య హావభావాలు వేరే లెవెల్. ఒక వైపు విలన్ గ్యాంగ్.. ఇంకో వైపు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి హీరో.. తన కుటుంబం చేసే ప్రయత్నాల చుట్టూ చాలా రొటీన్ గానే కథ నడిచినా.. కామెడీ వర్కవుట్ కావడంతో ‘ఆదర్శ కుటుంబం’ పాస్ మార్కులు వేయించుకుంటుంది . సినిమాలో కథాకథనాలు వీకే అయినప్పటికీ.. తన మార్కు వినోదం-డైలాగులతో త్రివిక్రమ్.. తన పెర్ఫార్మెన్స్ తో వెంకీ మేకప్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే వినోదానికి ఇందులో ఢోకా లేదు. వెంకీ - త్రివిక్రమ్ కాంబో మీద మరీ అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ వినోదమే కోరుకుంటే ఆదర్శ కుటుంబం ఓకే అనిపిస్తుంది.

నటీనటులు:

సోసో కథాకథనాలతో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ వెంకటేష్ మీద కొంచెం ఎక్కువ భారమే మోపగా.. ఆయన మాత్రం సులువుగా బండి లాగేశాడు. తన కామెడీ టైమింగ్ తో చిట్టిబాబు పాత్రను పండిస్తూ సినిమాను భుజాల మీద మోశాడు వెంకీ. త్రివిక్రమ్ కామెడీ పంచులతో పాటు.. తత్వంతో కూడిన డైలాగులను వెంకీ తనదైన స్టయిల్లో చెప్పి వాటి ఎఫెక్ట్ పెంచాడు. వెంకీ మార్కు చిలిపితనం కూడా కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది. వెంకీ లుక్ కూడా పాత్రకు తగ్గట్లు కుదిరింది. ఆయన సరసన శ్రీనిధి శెట్టి బాగానే కుదిరింది. తన పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. శ్రీనిధి త్రివిక్రమ్ శైలిని అర్థం చేసుకుని నటించింది. నారా రోహిత్ ఎస్పీ పాత్రలో తనకు అలవాటైన స్టయిల్లోనే నటించాడు. సత్య పాత్ర మొదట్లో మామూలుగానే అనిపించినా.. స్టేషన్ ఎపిసోడ్లో కడుపుబ్బ నవ్వించాడు. రావు రమేష్ నుంచి ఆశించే స్థాయి క్యారెక్టర్ కాకపోయినా.. ఓకే అనిపించాడు. రఘుబాబు ఆకట్టుకున్నాడు. నివేథా పెతురాజ్ గురించి చెప్పడానికేమీ లేదు. తన పాత్ర నామమాత్రం. శ్రీనిధిని మామూలుగా చూపించిన నేపథ్యంలో సినిమాకు గ్లామర్ టచ్ ఇవ్వడానికి పెట్టినట్లున్నాడు త్రివిక్రమ్. విలన్ పాత్రలో కనిపించిన ‘దురంధర్-2’ ఫేమ్ ఉదయ్ బిర్ సింగ్ ఓకే. సచిన్ ఖేద్కర్.. బ్రహ్మాజీ.. మిగతా నటీనటులు మామూలే.

సాంకేతిక వర్గం:

తమన్ తన మీద ఉన్న అంచనాలకు తగ్గ ఔట్ పుటే ఇచ్చాడు. థియేటర్లో ఏమీ సర్ప్రైజ్ చేయలేదు. తన పాటలు సోసోగా అనిపిస్తాయి. నారాయణమ్మ సాంగ్ ఒకటి కొంచెం ఊపు తెస్తుంది. మిగతా పాటలేవీ గుర్తుంచుకునేలా లేవు. ‘మాల’ పాట సినిమాలో లేదు. తమన్ బీజీఎం మాత్రం ఉత్సాహం నింపుతుంది. కొత్త సౌండ్స్ ఏమీ లేకపోయినా.. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో తమన్ బీజీఎం కీలక పాత్ర పోషించింది. రవి.కె.చంద్రన్ కలర్ ఫుల్ విజువల్స్ తో మెప్పించాడు. త్రివిక్రమ్-హారిక హాసిని కాంబినేషన్ అంటే ఉండే క్వాలిటీ సినిమాలో కనిపిస్తుంది. ఇక రచయితగా-దర్శకుడిగా త్రివిక్రమ్ పనితనం విషయానికి వస్తే.. ఇది బెస్ట్ లోకి వెళ్లదు. అలా అని బ్యాడ్ వర్క్ అని కూడా చెప్పలేం. కథాకథనాల పరంగా కన్వీనియెంట్ రైటింగ్ తో లాగించేసిన త్రివిక్రమ్.. చాలా చోట్ల తన మార్కు చమత్కారం.. డైలాగులతో నెట్టుకొచ్చేశారు. కథతో పాటు కొన్ని సీన్లు చూస్తే త్రివిక్రమ్ మరీ రాజీపడిపోయాడు అనిపిస్తుంది. లాజిక్స్ ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ టార్గెట్ ఆడియన్స్ మెచ్చే వినోదంతో ఆయన సినిమాను ఎంగేజింగ్ గా మార్చారు.

చివరగా: ఆదర్శ కుటుంబం.. అతకని కథలో టైంపాస్ వినోదం

రేటింగ్ - 2.5/5