విశాఖ నగరంలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్!
ఇప్పుడు బీచ్ సొగసుల విశాఖ నగరంలో AAA మల్టీప్లెక్స్ నిర్మాణం మొదలైంది.
By: Tupaki Desk | 11 July 2025 10:24 AM ISTఅల్లు అర్జున్ బ్రాండ్ అన్ని వైపులా విస్తరిస్తోంది. ఏసియన్ సినిమాస్ తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (AA) హైదరాబాద్ సత్యం థియేటర్ స్థానంలో AAA మల్టీప్లెక్స్ ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్ ని అత్యంత వేగంగా నిర్మించి సినీప్రియులకు అంకితమిచ్చారు. ఎస్.ఆర్. నగర్, అమీర్ పేట్ నడిబొడ్డున స్టూడెంట్స్, స్థానికులకు ఇది హాట్ స్పాట్ గా వెలుగొందుతోంది. ఏఏఏ సినిమాస్ తొలి వెంచర్ ఇప్పటికే గ్రాండ్ సక్సెసైంది.
ఇంతలోనే పలు నగరాలకు ఏఏఏ సినిమాస్ ని విస్తరించాలని ఏషియన్ నారంగ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ బృందం ప్లాన్ చేస్తున్నట్టు కథనాలొచ్చాయి. ఇప్పుడు బీచ్ సొగసుల విశాఖ నగరంలో AAA మల్టీప్లెక్స్ నిర్మాణం మొదలైంది. ఇంతకుముందే అల్లు అరవింద్- ఏషియన్ నారంగ్ మల్టీప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించినట్టు కథనాలొస్తున్నాయి.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుందరమైన బీచ్ సిటీగా విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇప్పుడు హైదరాబాద్ తలదన్నేలా జేజమ్మ లాంటి ప్రాజక్టులు ఇక్కడ శరవేగంగా నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న అన్ని బ్రాండెడ్ స్టార్ హోటల్స్, మాల్స్, మల్టీప్లెక్సులకు సంబంధించిన శాఖలు ఇక్కడ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఇనార్బిట్ మాల్ కూడా అత్యంత భారీగా విశాఖ నగరం నడిబొడ్డును నిర్మితమవుతోంది. ఈ మాల్ లోనే ఇప్పుడు AAA సినిమాస్ ని కూడా ప్రారంభించేందుకు నారంగ్- అల్లు బృందాలు తహతహలాడుతున్నాయి.
అత్యంత విలాసవంతంగా నిర్మిస్తున్న ఇనార్బిట్ లో ఏఏఏ సినిమాస్ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ మాల్ నిర్మాణానికి 9 నెలలు పడుతుందని, ఇనార్బిట్ నిర్మాణ కర్తలు ఒత్తిడి చేయడంతో ఆషాడం అయినా కానీ ఈ నెలలోనే ఏఏఏ సినిమాస్ పనుల్ని ప్రారంభించాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ వగైరా అల్లు అర్జున్ ఫైనల్ చేసారని కూడా తెలుస్తోంది. AAA మల్టీప్లెక్స్ ప్రత్యేక ఆకర్షణతో, ఇనార్బిట్ మాల్ 2026 వేసవి నాటికి ప్రారంభం కానుంది
