90స్ డైరెక్టర్ ప్లాన్ ఏంటి? రిస్క్ చేస్తున్నట్లేనా?
టాలీవుడ్ లో కొత్తగా వచ్చిన దర్శకుల్లో ఆదిత్య హాసన్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.
By: M Prashanth | 30 April 2026 3:00 PM ISTటాలీవుడ్ లో కొత్తగా వచ్చిన దర్శకుల్లో ఆదిత్య హాసన్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన తెరకెక్కించిన 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ విడుదలయ్యే వరకు పెద్దగా గుర్తింపు లేకపోయినా, ఆ సిరీస్ సక్సెస్ తో ఒక్కసారిగా అందరి దృష్టి ఆయనపై పడింది. ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన ఆ సిరీస్ ప్రేక్షకులను తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి మంచి రెస్పాన్స్ అందుకుంది.
దీంతో ఆ దర్శకుడు ఎవరు? అంటూ ఆడియన్స్ సెర్చ్ చేసే స్థాయికి చేరుకుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల లైఫ్ స్టైల్, చిన్న చిన్న ఎమోషన్స్ ను నేచురల్ గా చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఆ సిరీస్ తో దర్శకుడిగా తన టాలెంట్ ను నిరూపించుకున్న ఆయనకు ఇప్పుడు అవకాశాలు వరుసగా వస్తున్నాయి.
దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయన తన ముద్ర వేశారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ కు డైలాగులు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలోని కన్వర్జేషన్స్.. తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో రచయితగా కూడా ఆయనపై నమ్మకం పెరిగింది. ఇక నిర్మాతగా అడుగుపెట్టిన ఆదిత్య హాసన్ లిటిల్ హార్ట్స్ సినిమాతో మరో యాంగిల్ ను చూపించారు.
సోషల్ మీడియా స్టార్ మౌళి హీరోగా నటించిన ఆ సినిమా ద్వారా కొత్త ప్రయోగంతో సక్సెస్ అయ్యారు. ఇలా ఒక్కొక్కటిగా తన రేంజ్ లో పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఎపిక్ టాలీవుడ్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఆ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా, కలర్ ఫుల్ గా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్ ను చూస్తే ఇది కంప్లీట్ జెన్ జెడ్ లవ్ స్టోరీతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఆనంద్, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ కూడా హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆదిత్య హాసన్ తీసిన 90స్ సిరీస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్, నాస్టాల్జియా ప్రధానంగా ఉండగా, ఇప్పుడు ఎపిక్ లో మాత్రం పూర్తిగా ప్రేమకథపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.
అంటే ఆయన తనకు సెట్ అయిన జోనర్ ను వదిలి కొత్త దారిలో అడుగుపెడుతున్నట్టే. ఇది ఒక విధంగా రిస్క్‌గా చెప్పొచ్చు. కానీ అదే రిస్క్ ఆయనకు మరో పెద్ద విజయాన్ని కూడా తీసుకురావొచ్చు. కొత్త కథలు, కొత్త జోనర్లు ప్రయత్నించే దర్శకులకే ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. ఎపిక్ సినిమా ద్వారా ఆదిత్య హాసన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఆయన క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ఒక సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ఎపిక్ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ఇక ఆ ప్రయోగం ఆయన కెరీర్ ను ఎటు తీసుకెళ్తుందో చూడాలి.
