Begin typing your search above and press return to search.

19 ఏళ్ల నాటి సినిమాకు పట్టం!

కానీ ఈ వారం వచ్చిన '7/జి బృందావన కాలనీ' చిత్రానికి మాత్రం అదిరిపోయే స్పందన వస్తోంది.19 ఏళ్ల కిందట యువ ప్రేక్షకుల మతులు పోగొట్టిన ఈ చిత్రాన్ని శుక్రవారమే రీ రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   22 Sep 2023 3:53 PM GMT
19 ఏళ్ల నాటి సినిమాకు పట్టం!
X

రీరిలీజ్ అంటే చాలు.. మన ప్రేక్షకులు ఎగబడి చూసేస్తున్నారు. ఎప్పటెప్పటి సినిమాలనో ఇప్పుడు రిలీజ్ చేస్తుంటే.. కొత్త సినిమాలను కూడా పక్కన పెట్టి వాటి కోసం థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఏడాది కిందట ఊపందుకున్న ఈ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఫస్ట్ రిలీజ్‌లో సరిగా ఆడని సినిమాలకు సైతం ఇప్పుడు అదిరిపోయే స్పందన వస్తుండటం షాక్‌కు గురి చేస్తోంది.

మన స్టార్ల సినిమాలను ఆదరించడం ఒకెత్తయితే.. డబ్బింగ్ చిత్రాల కోసం కూడా ఇలాగే ఎగబడటం ఇంకా పెద్ద షాక్. ధనుష్ సినిమాలు '3', 'రఘువరన్ బీటెక్'.. సూర్య మూవీ 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'లకు వచ్చిన స్పందన చూసి కోలీవుడ్ జనాలు సైతం షాకయ్యారు. ఇదే వరుసలో ఈ మధ్యే 'బిచ్చగాడు' మూవీని కూడా రీ రిలీజ్ చేశారు కానీ.. దాన్ని ఎందుకోగానీ మన ఆడియన్స్ పట్టించుకోలేదు.

కానీ ఈ వారం వచ్చిన '7/జి బృందావన కాలనీ' చిత్రానికి మాత్రం అదిరిపోయే స్పందన వస్తోంది.19 ఏళ్ల కిందట యువ ప్రేక్షకుల మతులు పోగొట్టిన ఈ చిత్రాన్ని శుక్రవారమే రీ రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రమోట్ చేయడం.. కొత్తగా రీ రిలీజ్ ట్రైలర్ వదలడం.. ఇలా టీం బాగానే కష్టపడింది. అందుకు తగ్గట్లే ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది తెలుగు రాష్ట్రాల్లో.

ఏపీ, తెలంగాణల్లో కలిపి ఏకంగా ఈ సినిమాకు 1250కి పైగా షోలు వేయడం విశేషం. శుక్రవారం ఉదయం ఈ చిత్రం హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. హైదరాబాద్‌లో పలు థియేటర్లు ఉదయం 8 గంటలకు పలు షోలు వేశాయి. అవన్నీ ప్యాక్డ్ హౌస్‌లతో నడిచాయి. థియేటర్లలో మన ప్రేక్షకుల హంగామా మామూలుగా లేదు. త్వరలోనే '7/జి బృందావన కాలనీ'కి సీక్వెల్ తీయాలని చూస్తున్న చిత్ర బృందానికి ఈ స్పందన మంచి ఉత్సాహాన్నిచ్చేదే.