మూవీ రివ్యూ : 3 బీహెచ్‌కే
ఒకప్పుడు తెలుగులో పెద్ద పెద్ద హిట్లు కొట్టి.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయిన తమిళ నటుడు సిద్దార్థ్. కొన్నేళ్లుగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వాటి అనువాదాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.
By: Tupaki Desk | 4 July 2025 4:55 PM IST'3 బీహెచ్‌కే' మూవీ రివ్యూ
నటీనటులు: సిద్దార్థ్- శరత్ కుమార్- దేవయాని- మీథా రఘునాథ్- యోగిబాబు- ఛైత్ర తదితరులు
సంగీతం: అమృత్ రామ్ నాథ్
ఛాయాగ్రహణం: దినేష్ కృష్ణన్- జితిన్
మాటలు: రాకేందు మౌళి
నిర్మాత: అరుణ్ విశ్వ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీ గణేష్
ఒకప్పుడు తెలుగులో పెద్ద పెద్ద హిట్లు కొట్టి.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయిన తమిళ నటుడు సిద్దార్థ్. కొన్నేళ్లుగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వాటి అనువాదాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. కానీ సరైన ఫలితం దక్కలేదు. కానీ తన కొత్త చిత్రం ‘3 బీహెచ్కే' మాత్రం ట్రైలర్ తో అంచనాలు పెంచింది. మరి సినిమా ఆ అంచనాలకు తగ్గట్లే ఉందా? తెలుసుకుందాం పదండి.
కథ:
వాసుదేవన్ (శరత్ కుమార్) ఒక మధ్య తరగతి వ్యక్తి. చిన్న ఉద్యోగం చేస్తూ భార్య ఇద్దరు పిల్లలతో జీవితాన్ని సాగిస్తున్న అతడికి సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడం కల. అందుకోసం ప్రతిసారీ ప్రయత్నం చేయడం.. అంతా ఓకే అనుకున్నాక ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ కల తీరకపోవడం.. ఇలాగే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయి. కొడుకు ప్రభు (సిద్దార్థ్) ఎదిగి వచ్చాక అయినా ఆ కల నెరవేరుతుందనుకుంటే అది జరగదు. ఓవైపు కోరుకున్న ఉద్యోగం చేయట్లేదనే అసంతృప్తి ప్రభును వెంటాడుతుంటే.. మరోవైపు వాసుదేవన్ కూతురి వైవాహిక జీవితంలో ఇబ్బందలు తప్పవు. ఇన్నిసమస్యల మధ్య సొంత ఇంటి కలను పక్కన పెట్టేస్తాడు వాసుదేవన్. మరి వీళ్లందరి సమస్యలు తీరాయా లేదా.. ఇంతకీ వీరి సొంతింటి కల ఏమైంది.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఒకప్పుడు వైవిధ్యమైన కథలకు.. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది తమిళ సినీ పరిశ్రమ. కానీ గత దశాబ్ద కాలంలో అక్కడి సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మూస చిత్రాలతో విసుగెత్తించేస్తున్నారు అక్కడి దర్శకులు. ఐతే తమిళ సినిమాలు పూర్తిగా గాడి తప్పుతున్న దశలో కొందరు యువ దర్శకులు.. ఫీల్ గుడ్ సినిమాలతో కొంత ఉపశమనాన్ని అందిస్తున్నారు. గుడ్ నైట్.. కుటుంబస్థాన్.. టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి చిత్రాలు ‘స్లైస్ ఆఫ్ లైఫ్' కథలతో ప్రేక్షకులను కదిలించాయి. మధ్య తరగతి మనుషుల జీవితాలను తరచి చూస్తూ.. వారి ఆశలు ఆకాంక్షల చుట్టూ కథనాన్ని నడిపిస్తూ.. అంతిమంగా ఒక జీవిత పాఠాన్ని నేర్పడానికి ప్రయత్నించిన కథలు ఇవి. ఈ కోవలోనే ‘3 బీహెచ్‌కే' కూడా తెరకెక్కింది. ఐతే టైటిల్.. ట్రైలర్ చూస్తేనే ఇది ఎలాంటి సినిమానో ఒక అంచనా వచ్చేస్తుంది. సినిమాలో అంతకుమించి కొత్తగా సర్ప్రైజులేమీ ఉండవు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నా.. కొన్ని మూమెంట్స్ హృద్యంగా అనిపించినా.. తెలిసిన కథే కథా చూస్తున్నాం అనే ఒక మొనాటనస్ ఫీలింగ్ కలిగిస్తుందీ సినిమా. కాకపోతే సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఒక మధ్య తరగతి కుటుంబం చేసే పోరాటం చుట్టూ తిరిగే కథ కాబట్టి.. ఎక్కువమంది ఈ కథతో రిలేట్ చేసుకునే అవకాశముండడం దీనికి ఉన్న ప్లస్.
సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉండే వర్గం.. మధ్యతరగతి వారే. వాళ్లందరికీ ‘సొంత ఇల్లు' అనేది పెద్ద ఎమోషన్. ఇల్లు ఉన్న వారికీ అది ప్రత్యేకం. ఇక దాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఏళ్ల తరబడి కష్టపడేవాళ్లకు దాంతో ఉండే ఎమోషన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాయింట్ మీద కథను ఎంచుకోవడంలోనే రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీ గణేష్ సగం విజయం సాధించేశాడు. ఈ పాయింట్ చుట్టూ కథా విస్తరణ కూడా సరిగా జరిగి ఉంటే.. కొన్ని సర్ప్రైజులను జోడించి ఉంటే.. ‘3 బీహెచ్‌కే' ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచేది. కానీ ప్రేక్షకులను ఏమాత్రం ఆశ్చర్యపరచని విధంగా.. చాలా రొటీన్ గా సాగిపోయే ఎపిసోడ్ల వల్ల ‘3 బీహెచ్‌కే' చాలా వరకు సాధారణంగానే అనిపిస్తుంది. ఇల్లు కొనడానికి సన్నాహాలు చేసుకోవడం.. అంతలోనే ఏదో ఒక అడ్డంకి రావడం.. ఇలా ఒకట్రెండు సార్లు జరగ్గానే ఈ కథ ఎలా నడవబోతోంది.. ఎలా ముగియబోతోంది అన్నది ఒక అంచనా వచ్చేస్తుంది. ఒక దశ దాటాక చూస్తే.. పనిగట్టుకుని హీరో కుటుంబాన్ని కష్టాలు పెడుతున్నట్లు అనిపిస్తుంది. మెలోడ్రామా శ్రుతి మించిపోతుంది. ఎంతకీ వేగం పుంజుకోని కథనంతో సగం వరకు ‘3 బీహెచ్‌కే' చాలా సాధారణంగా అనిపిస్తుంది.
ఐతే ద్వితీయార్ధంలో ఇంటి గొడవ పక్కకు వెళ్లి.. హీరో ఉద్యోగ-వ్యక్తిగత జీవితం.. తన చెల్లెలి వైవాహిక జీవితం చుట్టూ కథ నడవడం మొదలుపెట్టాక ప్రేక్షకులకు కొంచెం ఉపశమనం దక్కుతుంది. ఇక్కడ కూడా కథనం కొంచెం ఎగుడుదిగుడుగానే సాగినప్పటికీ.. ప్రథమార్ధంతో పోలిస్తే సెకండాఫ్ చాలా మెరుగ్గానే అనిపిస్తుంది. చివరి అరగంటలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సినిమా గ్రాఫ్ ను పెంచుతుంది. సెక్యూరిటీ.. కంఫర్ట్ పేరుతో జీవితానికి పరిమితులు విధించుకోకుండా అభిరుచి మేరకు బతకడమే ముఖ్యమని చెప్పే చివరి అరగంట ‘3 బీహెచ్‌కే'లో హైలైట్ గా నిలుస్తుంది. పతాక సన్నివేశాలు హృద్యంగా సాగి సినిమాకు మంచి ముగింపునిస్తాయి. ఫీల్ గుడ్.. ఎమోషనల్ సినిమాలను ఇష్టపడేవాళ్లు.. మరీ అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడ్డానికి ‘3 బీహెచ్‌కే' ఓకే.
నటీనటులు:
సిద్దార్థ్ చాన్నాళ్ల తర్వాత తనకు నప్పే పాత్రను ఎంచుకున్నాడు. నటన కొత్తగా ఉందని చెప్పలేం కానీ.. ప్రభు పాత్రకు అవసరమైనట్లు నటించాడు. వేర్వేరు వయసులకు తగ్గట్లుగా తన లుక్ ను మార్చుకునేందుకు అతను పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఆయా వయసులకు తగ్గ హావభావాల్లోనూ వైవిధ్యం చూపించాడు. శరత్ కుమార్ తన అనుభవాన్ని చూపించాడు. వాసు పాత్రకు న్యాయం చేశాడు. ఆయనకు జంటగా నటించిన దేవయాని కూడా బాగా చేసింది. హీరో చెల్లెలి పాత్రలో ‘గుడ్ నైట్' ఫేమ్ మీథా రఘునాథ్ ఆకట్టుకుంది. సిద్ధుకు జోడీగా నటించిన ఛైత్ర హీరోయిన్ లాగా కాకుండా ఒక పాత్రధారిలా కనిపించడం భిన్నంగా అనిపిస్తుంది. యోగిబాబు పర్వాలేదు. తన నుంచి ఆశించే స్థాయి కామెడీ అయితే ఇందులో లేదు.
సాంకేతిక వర్గం:
అమృత్ రామ్ నాథ్ సినిమా నడతకు తగ్గ నేపథ్య సంగీతాన్ని అందించాడు. చాలా వరకు ఎమోషనల్ టచ్ కనిపిస్తుంది బీజీఎంలో. కొన్నిసార్లు డోస్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. దినేష్ కృష్ణన్-జితిన్ ల ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రాకేందు మౌళి మాటలు బాగున్నాయి. రచయిత-దర్శకుడు శ్రీ గణేష్.. ప్రస్తుతం తమిళ చిత్రాల సక్సెస్ ట్రెండును అందిపుచ్చుకునే కథను ఎంచుకున్నాడు. ఎమోషనల్ సీన్లను బాగా డీల్ చేశాడు. కానీ తన స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగింది. ఎక్కువమంది కనెక్ట్ అయ్యే కథ రాసుకోవడం బాగున్నా.. తన టేకింగ్ మాత్రం సోసోగానే సాగింది.
చివరగా: 3 బీహెచ్‌కే.. రొటీన్ కథకు ఎమోషనల్ టచ్
రేటింగ్- 2.25/5