Begin typing your search above and press return to search.

ఈసారి త్రీ ఇడియ‌ట్స్ కుటుంబ‌రావుల్లా!

బాలీవుడ్ సంచలన విజయం సాధించిన చిత్రాలలో `త్రీ ఇడియట్స్` ఒకటి. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో అమీర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన చిత్ర‌మిది.

By:  Srikanth Kontham   |   19 Jun 2026 7:40 PM IST
ఈసారి త్రీ ఇడియ‌ట్స్ కుటుంబ‌రావుల్లా!
X

బాలీవుడ్ సంచలన విజయం సాధించిన చిత్రాలలో `త్రీ ఇడియట్స్` ఒకటి. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో అమీర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన చిత్ర‌మిది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూనే.. కాలేజ్ లైఫ్ .. స్నేహం విలువను అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ మూవీ విడుదలై సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా? సీక్వెల్ పై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవ‌లే ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హిరాణీ సీక్వెల్ ని ఎలాంటి క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

దీంతో స్టోరీ లైన్ పై ఓ వార్త వెలుగులోకి వ‌చ్చింది. మొదటి భాగంలో రాంచో, ఫర్హాన్, రాజుల కాలేజ్ రోజులు.. వారి హాస్టల్ జీవితం.. కెరీర్ ఎంపికల చుట్టూ కథ తిరిగింది. అయితే సీక్వెల్‌లో కథ పూర్తిగా కొత్త పుంతలు తొక్కనుందని హిరాణీ దీన్నీ ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీగా మలచాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాలేజీ ముగించుకుని జీవితంలో స్థిరపడిన ఆ ముగ్గురు మిత్రుల పెళ్లి జీవితం, వారి కుటుంబాలు, పిల్లల పెంపకం , మధ్య వయస్కులుగా వారు ఎదుర్కొనే సరికొత్త సవాళ్ల చుట్టూ ఈ ప్రయాణం సాగతుంద‌ని సమాచారం.

రాజ్‌కుమార్ హిరాణీ మార్క్ సినిమాలను గమనిస్తే ఆయన ఏ కథను తీసుకున్నా? అందులో మానవీయ కోణాలు, భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తారు. `మున్నాభాయ్ ఎంబీబీఎస్`, `పీకే`, `సంజు`, `డుంకీ` చిత్రాలైనా హాస్యం వెనుక ఒక బలమైన సామాజిక సందేశం దాగి ఉంటుంది. `త్రీ ఇడియట్స్ 2` ని కూడా ఆయన కేవలం ఒక సాధారణ సీక్వెల్‌లా కాకుండా వివాహ బంధం, బాధ్యతలు , నేటి తరం తల్లిదండ్రుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా ఫ్యామిలీ డ్రామాగా తీర్చిదిద్దేలా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

మొదటి భాగంలో `ఆల్ ఈజ్ వెల్` అంటూ చదువు ఒత్తిడిని జయించిన ముగ్గురు ఇడియట్స్ ఇప్పుడు సంసార సాగరంలో ఎదురయ్యే ఒడిదొడుకులను ఎలా? ఎదుర్కొంటారనేది ఎంతో ఆసక్తికరంగా మారనుంది. రాంచో (అమీర్ ఖాన్) వైజ్ఞానిక ఆవిష్కరణలు , అతని వివాహ జీవితం, ఫర్హాన్ (మాధవన్) ఫోటోగ్రఫీ కెరీర్-కుటుంబం మధ్య బ్యాలెన్స్, అలాగే రాజు (శర్మన్ జోషి) మిడిల్ క్లాస్ బాధ్యతల నుండి ఫ్యామిలీ లైఫ్‌లోకి మారిన విధానం. ఈ ముగ్గురి భిన్నమైన వైవాహిక జీవితాల కలయికగా సీక్వెల్ ప్ర‌యాణం సాగొచ్చ‌ని వినిపిస్తోంది.

మొత్తంగా మొద‌టి భాగంలో కాలేజీ స్టూడెంట్ల‌ను హిరాణీ కుటుంబ‌రావుల్లా చూపిస్తున్నారు? అన్న‌ది సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అద్భుతమైన క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ప్రేక్షకులు మొదటి భాగంతో ఎంతగా కనెక్ట్ అయ్యారో? రెండో భాగంపై అంతకంటే ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. రాజ్‌కుమార్ హిరాణీ తనదైన శైలిలో హాస్యాన్ని.. ఎమోషన్‌ని జోడించి ముగ్గురు మిత్రుల పెళ్లి జీవిత ప్రయాణాన్ని తెరకెక్కిస్తే అది కచ్చితంగా మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.