Begin typing your search above and press return to search.

చంద్ర‌బోస్ బంగారం హృద‌యాల‌ను గెలుచుకుంది

చాలా కాలం త‌ర్వాత ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన పాట‌ను విన్నామ‌నే భావ‌న ఈ పాట వింటే క‌లుగుతుంది.

By:  Tupaki Desk   |   2 April 2025 4:32 PM IST
చంద్ర‌బోస్ బంగారం హృద‌యాల‌ను గెలుచుకుంది
X

అంద‌మైన ప‌ల్లెటూరు.. చుట్టూ పొలాలు మ‌ధ్య‌లో నిండు కుండలా తొణికిస‌లాడే చెరువు.. గ‌ల‌గ‌ల పారే సెల‌యేళ్లు.. ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నం.. అలాంటి ప‌ల్లె ప‌ట్టు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో అమ్మాయి - అబ్బాయి ప్రేమ‌క‌థ అంటే క‌చ్ఛితంగా అది అంద‌రినీ ఆక‌ర్షించే ఎలిమెంట్. అలాంటి ఒక ప‌ల్లె ప‌ట్టు ప్రేమ‌క‌థ‌తో మ్యాజిక్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు రాజ్ ఆర్. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హిచిన మ‌ల్లేశం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన సంగ‌తి తెలిసిందే. అత‌డు త‌దుప‌రి `23` అనే మూవీని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. టీజ‌ర్ తోనే క‌థేంటో తెలిసిపోయింది. ఇప్పుడు రిలీజైన `బంగారం సాంగ్`తో ప్రేమ‌క‌థ గుట్టంతా లీకైపోయింది.

చాలా కాలం త‌ర్వాత ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన పాట‌ను విన్నామ‌నే భావ‌న ఈ పాట వింటే క‌లుగుతుంది. సీనియ‌ర్ లిరిసిస్ట్, నాటు నాటుతో `ఆస్కార్‌` అందించిన‌ చంద్ర‌బోస్ ఈ `బంగారం..` పాట కోసం ఉప‌యోగించిన గ‌మ్మ‌త్త‌యిన ప‌దాలు హృద‌యాన్ని హ‌త్తుకుంటున్నాయి. మార్క్ కె రాబిన్ అంద‌మైన ఆహ్లాద‌క‌ర‌మైన మెలోడీని అందించారు. ఇది గుండెను మీటే అంద‌మైన సంగీతం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. చాలా కాలం త‌ర్వాత మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా త‌ర‌హాలో గ‌జిబిజి లేని ట్యూన్ ఇవ్వాల‌న్న అత‌డి ప్ర‌య‌త్నాన్ని అభినందించ‌కుండా ఉండ‌లేం. కార్తీక్ -రమ్య బెహరా ఈ అంద‌మైన పాట‌ను పాడారు. సింగ‌ర్ సునీత త‌ర‌హాలో యువ‌గాయ‌ని ర‌మ్య బెహ‌రా త‌న‌దైన స్వ‌ర‌లాలిత్యంతో ఆక‌ట్టుకుంటున్నారని ఈ పాట మ‌రోసారి నిరూపించింది.

సాహిత్యపరంగా `ఆస్కార్` రేంజ్ గేయ రచయిత ప‌దాల మాయాజాలం ఎలా ఉంటుందో ఈ పాట వింటే శ్రోత‌ల‌కు తెలుస్తుంది. చంద్రబోస్ రాసిన `బంగారం అక్కర్లేని ప్రేమ`.. థీమ్ ఎంతో హృద్యంగా సాగుతుంది. ప్రేమికుల లోతైన భావ‌న‌ల‌ను బోస్ వోన్ చేసుకుని ర‌చ‌న‌లోకి తెచ్చిన‌ విధానం ఆక‌ర్షించింది. సాహితీ ప‌రిభాష ఎంతో సింపుల్ గా ఉంటూనే, అందంగా హృద‌యాల‌ను తాకుతుంది. న‌వ‌త‌రం న‌టీన‌టులు స‌హ‌జ‌సిద్ధ‌మైన వేషధార‌ణ‌లు, భావ వ్య‌క్తీక‌ర‌ణ‌లు హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. వారి మ‌ధ్య కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంది. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా పంపిణీ చేస్తోంది.