Begin typing your search above and press return to search.

‘23 - ఇరవై మూడు’ మూవీ.. ఎలా ఉందంటే?

‘23 – ఇరవై మూడు’ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది.

By:  Tupaki Desk   |   17 May 2025 10:59 AM IST
23 – Iravai Moodu Brings Real-Life Dalit Atrocities
X

‘23 – ఇరవై మూడు’ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. దర్శకుడు రాజ్, ‘మల్లేశం’, ‘8 AM మెట్రో’ లాంటి నిజమైన కథలతో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈసారి 90వ దశకంలో జరిగిన చుండూరు మారణకాండ (1991), చిలకలూరిపేట బస్సు దహనం (1993), జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ (1997) లాంటి మూడు నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు.

సామాజిక అసమానతలు, న్యాయవ్యవస్థలో వివక్షలపై సమాజానికి కళ్లు తెరిపించేలా ఈ సినిమా రూపొందిందని పబ్లిక్ టాక్ నడుస్తోంది. సినిమా కథ ఒక ఉన్నత కుల న్యాయవాది చంద్ర (ప్రణీత్) కోణం నుంచి మొదలై, యువ జంట సాగర్ (తేజ), సుసీల (తన్మై) జీవితంలోకి వెళ్తుంది. సాగర్ స్నేహితుడు దాసు పాత్ర కూడా కీలకంగా ఉంది. ఒక చిన్న తప్పు ఎలా బస్సు దహనానికి దారితీసింది, దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఈ ఘటనలన్నీ న్యాయవ్యవస్థతో ఎలా ముడిపడ్డాయని సినిమా చూపిస్తుంది.

“అందరూ సమానమే, కానీ కొందరు మరింత సమానం” అనే ట్యాగ్‌లైన్‌తో సమాజంలో న్యాయం అందరికీ సమానంగా జరుగుతుందా అనే ప్రశ్నను హైలెట్ చేసింది. సినిమా ట్రైలర్‌లోనే హైలైట్ అయిన కొన్ని డైలాగ్‌లు, నిజాయితీతో కూడిన చిత్రణ ప్రేక్షకులను ఆకర్షించాయి. చుండూరు ఘటనలో ఎనిమిది మంది దళితులు చనిపోగా, నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం, చిలకలూరిపేట ఘటనలో దళిత నిందితులకు మరణశిక్ష (తర్వాత జీవిత ఖైదుగా మార్చబడింది) లాంటి నిజ ఘటనలను సినిమా తీసుకుంది.

ఈ అంశాలను డాక్యు-డ్రామా స్టైల్‌లో చూపించడం సినిమాకు ప్లస్ అయిందని, జైలు వాతావరణం, నేరస్తుడి పశ్చాత్తాపం లాంటి అంశాలను ఆలోచింపజేసేలా చూపించారని ప్రేక్షకులు చెబుతున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, తేజ సాగర్‌గా మొదట్లో అమాయకత్వాన్ని బాగా చూపించాడు, కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఎమోషనల్ డెప్త్‌లో మరింత ఆకట్టుకున్నాడు. తన్మై సుసీలగా మంచి నటన కనబరిచింది, ముఖ్యంగా గ్రామీణ నేపథ్య సన్నివేశాల్లో ఆమె నటన అందరినీ ఆకర్షించింది.

తాగుబోతు రమేష్ క్లైమాక్స్‌లో ఎమోషనల్ సన్నివేశాలతో మెప్పించాడు. ప్రణీత్, ఝాన్సీ, షైనింగ్ ఫణి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గా సినిమా బడ్జెట్ పరిమితులను చూపించినప్పటికీ, సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ నిజమైన లొకేషన్స్‌ను బాగా క్యాప్చర్ చేసినట్లు అంటున్నారు. మార్క్ కె. రాబిన్ సంగీతం ఓకే అనేలా ఉన్నప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగ్గట్లు ఉందని ప్రేక్షకులు చెప్పారు. అయితే కథనం మరింత స్మూత్‌గా ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు.

మొత్తంగా, ‘23 – ఇరవై మూడు’ సినిమా నిజాయితీతో కూడిన ప్రయత్నంగా ఉందని, సామాజిక అసమానతలను ప్రశ్నించే కథతో ఆలోచింపజేస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. కొన్ని చోట్ల కథ కనెక్ట్ అవ్వడంలో లోపం ఉన్నప్పటికీ, నిజమైన సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన రాజ్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా ఆలోచింపజేసే సినిమాలను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుందనే టాక్ నడుస్తోంది.