Begin typing your search above and press return to search.

2025 సంక్రాంతి పందేలు షురూ

గత ఏడాది వాల్తేరు వీరయ్య.. అంతకుముందు అలవైకుంఠపురములో.. ఎలా వసూళ్ల మోత మోగించాయో తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Jan 2024 2:45 AM GMT
2025 సంక్రాంతి పందేలు షురూ
X

తెలుగు సినిమాలు సంబంధించి క్రేజీయెస్ట్ సీజన్ అంటే సంక్రాంతినే అనడంలో మరో మాట లేదు. ఈ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి టాక్ వస్తే వసూళ్లు అంచనా వేయలేని స్థాయిలో ఉంటాయి. మామూలుగా వచ్చేదాంతో పోలిస్తే 20 30 శాతం అదనపు వసూళ్లు వస్తాయి. గత ఏడాది వాల్తేరు వీరయ్య.. అంతకుముందు అలవైకుంఠపురములో.. ఎలా వసూళ్ల మోత మోగించాయో తెలిసిందే. ఇప్పుడు హనుమాన్ వాటిని మించి ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతికి ఉన్న ఈ అడ్వాంటేజ్ చూస్తే కనీసం ఆరు నెలల ముందు బెర్తులు బుక్ చేసేస్తుంటారు. వచ్చే సంక్రాంతికి ఇంకా తొందర పడుతున్నారు. ఏడాది ముందే అనౌన్స్మెంట్లు వచ్చేస్తుండడం విశేషం.

2025 సంక్రాంతికి రిలీజ్ అయ్యే రెండు సినిమాల గురించి ఈ సంక్రాంతికి ప్రకటనలు వచ్చేశాయి. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా విశ్వంభరను వచ్చే పండక్కి రిలీజ్ చేస్తున్నట్టు మొన్నటి టైటిల్ గ్లింప్స్ లో అనౌన్స్ చేశారు. వచ్చే సంక్రాంతికి వచ్చే అత్యంత భారీ చిత్రం ఇదే. మరోవైపు ఏడేళ్ల కిందట సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన శతమానంభవతి సీక్వెల్ ను మళ్లీ అదే పండక్కి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఇక సంక్రాంతికి సరిగ్గా సూటయ్యే పల్లెటూరి సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ సాధించడం అలవాటుగా మార్చుకున్న అక్కినేని నాగార్జున కూడా బంగార్రాజుకు కొనసాగింపుగా ఇంకో సినిమాను తేవాలని ఇప్పుడే ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలను పురమాయించినట్లు తెలిసింది. అతను సరైన కథతో వస్తే కొంచెం లేటుగా అయినా సినిమాను మొదలుపెట్టి సంక్రాంతికి తేవాలని నాగ్ చూస్తున్నాడట. ఏడాది ముందే సంక్రాంతి సినిమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి అంటే ఆ సీజన్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.