Begin typing your search above and press return to search.

2024 ని స్టార్ హీరోలంతా ఇలా ముగించ‌బోతున్నారా?

2024 సంక్రాంతి స్టార్ హీరోలంతా హంగామా చేస్తారనుకుంటే? ఆ రేంజ్ లో హ‌డావుడి చేయ‌ని సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 April 2024 7:16 AM GMT
2024 ని  స్టార్ హీరోలంతా ఇలా ముగించ‌బోతున్నారా?
X

2024 సంక్రాంతి స్టార్ హీరోలంతా హంగామా చేస్తారనుకుంటే? ఆ రేంజ్ లో హ‌డావుడి చేయ‌ని సంగ‌తి తెలిసిందే. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన `హ‌నుమాన్` మాత్రం సంచ‌ల‌నాలే న‌మోదు చేసింది. 300 కోట్ల వ‌సూళ్ల‌తో తేజ స‌జ్జ పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయ్యాడు. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన చిత్రాలేవి ఆ రేంజ్ లో సౌండింగ్ ఇవ్వ‌లేక‌పోయాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన `టిల్లు స్క్వేర్`...`గామి` లాంటి చిత్రాలు మాత్రం మంచి ఫ‌లితాలు సాధించాయి. హ‌నుమాన్ త‌ర్వాత తెలుగులో హిట్ అయిన చిన్న చిత్రాల్లో పెద్ద హిట్లు ఇవే.

మ‌రి తదుప‌రి చిత్రాల లైన‌ప్ ఎలా ఉందంటే? మేలో ప్ర‌భాస్ `క‌ల్కి 2898` తో హంగామా చేస్తాడ‌నుకుంటే? ఆ చిత్రాన్ని జూన్ కి వాయిదా వేసారు. ఇక అదే నెల‌లో విశ్వ న‌టుడు క‌మ‌ల‌హాస‌న్ న‌టిస్తోన్న `భార‌తీయుడు-2` కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ముందే ఫిక్స్ అయింది. భార‌తీయుడుకి సీక్వెల్ కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. క‌ల్కిపైనే అదే స్థాయిలో అంచ‌నాలున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాల మ‌ధ్య జూన్ లో త‌గ్గాప్ వార్ త‌ప్ప‌దు. `భార‌తీయుడు -2 `లో క‌మ‌ల్ లీడ్ రోల్ అయితే `క‌ల్కీ`లో అదే క‌మ‌ల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

దీంతో క‌మ‌ల్ కిప్పుడిది స‌వాల్ గా మారింది. రెండు సినిమా ప్ర‌మోష‌న్లో కూడా క‌మ‌ల్ పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే మల‌యాళం స్టార్ మమ్ముట్టి న‌టిస్తోన్న ` టర్బో` కూడా జూన్‌లో విడుదల కానుంది. ఇటీవ‌ల మ‌ల‌యాళం కంటెంట్ తెలుగులోనూ సంచ‌ల‌నమవుతోన్న నేప‌త్యంలో `ట‌ర్బో` పోటీనిచ్చే చిత్రంగా భావించాల్సిందే. అలాగే చియ‌న్ విక్ర‌మ్ నుంచి మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రం `తంగ‌లాన్` కూడా మేలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో విక్ర‌మ్ బౌన్స్ బ్యాక్ అవుతాడ‌నే అంచ‌నాలున్నాయి. అదే జ‌రిగితే బాక్సాఫీస్ వ‌ద్ద విక్ర‌మ్ ఊచ కొత్త త‌ప్ప‌దు.

ఇక మ‌రో మ‌ల‌యాళం స్టార్ దుల్కర్ స‌ల్మాన్ న‌టిస్తోన్న `లక్కీ బాస్కర్` జూలైలో విడుదలకు రెడీ అవుతోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న `పుష్ప‌-2` కూడా ఆగ‌స్ట్ కి లాక్ అయింది. ఎట్టి ప‌రిస్థితుల్లో స్వాతంత్య్ర‌దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌ని సుకుమార్ కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానుల్లో కాక‌పుట్టిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న `ఓజీ` సెప్టెంబ‌ర్ లో రిలీజ్ అవుతుంది. ఎన్నిక‌లు అనంత‌రం పీకే ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉంటాడు. అభిమానుల అటెన్ష‌న్ సినిమాల నుంచి డైవర్ట్ కాకుండా ఓజీ అప్ డేడ్ తో ఎప్ప‌టిక‌ప్పుడు అలెర్ట్ చేస్తున్నారు.

ఇదే నెల‌లో కోలీవుడ్ స్టార్ విజ‌య్ న‌టిస్తోన్న `గోట్` కూడా రిలీజ్ అవుతుంది. రాజ‌కీయ పార్టీ పెట్టిన అనంత‌రం రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న `దేవ‌ర` అక్టోబ‌ర్ లో రిలీజ్ అవుతుంది. కొర‌టాల శివ దేవ‌ర‌ని ఆనెల‌లో క‌చ్చితంగా రిలీజ్ చేసే ప్లాన్ లో క‌నిపిస్తున్నారు. ఇంకా ర‌జ‌నీకాంత్ `వేట్టైయాన్` - అజిత్ కుమార్ నటిస్తో `విడా ముయార్చి` కూడ అక్టోబర్‌లో విడుదల కానున్నాయి.

అదే నెల‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ చ‌ర‌ణ్‌- శంకర్ కాంబోలో తెర‌కెక్కుతోన్న `గేమ్ ఛేంజర్` కూడా రిలీజ్ అవుతుంది. అక్టోబ‌ర్ మిస్ అయితే గ‌నుక డిసెంబ‌ర్ మ‌రో ఆప్ష‌న్ గా పెట్టుకున్నారు. ఇదేర‌క‌మైన క‌న్ ప్యూజ‌న్ లో డిసెంబ‌ర్ లో సూర్య పీరియాడికల్ డ్రామా `కంగువ` - ఎన్బీకే 109 చిత్రాలు క‌నిపిస్తున్నాయి. అక్టోబర్ లేదా డిసెంబర్‌లో ఆ చిత్రాలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా 2024 ఇలా ముగుస్తుంద‌ని చెప్పొచ్చు.