Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ తో పోటీప‌డిన సినిమాకి డ‌బుల్ లాభాలు

10 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల‌ తో బాక్సాఫీస్ రన్ ను ముగించింది

By:  Tupaki Desk   |   14 July 2023 3:49 PM GMT
ఆదిపురుష్ తో పోటీప‌డిన సినిమాకి డ‌బుల్ లాభాలు
X

ఏదైనా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించాలంటే ప్ర‌మోష‌న్స్ చాలా కీల‌కం. ప్రీరిలీజ్ లు స‌క్సెస్ మీట్ లు.. ఈ మీడియా ఇంట‌ర్వ్యూలు అంటూ హ‌డావుడి చేయాలి. సినిమా విజయానికి హామీ లేనప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడానికి ఘ‌న‌మైన‌ ప్రమోషన్ లు క‌చ్చితంగా సహాయపడతాయన్న‌ది ఎవ‌రూ కాద‌న‌లేనిది. సినిమా కమర్షియల్ పెర్ఫార్మెన్స్ కు ప్ర‌చారం ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. అయితే అందుకు భిన్నంగా ఒక్కోసారి కొన్ని సినిమాలు ఎటువంటి విస్తృతమైన ప్రచారం లేకుండానే విడుద‌ల‌వుతాయి.

బాక్సాఫీస్ వద్ద సహేతుకమైన విజయాన్ని సాధిస్తాయి. అటువంటి తాజా ఉదాహరణ ఈ సంవత్సరం హారర్ చిత్రం '1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్'. రాహుల్ దేవ్- బర్ఖా బిష్త్ - డానిష్ పండోర్ లతో కలిసి ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అవికా గోర్ కి చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం ద‌క్కిందని ట్రేడ్ చెబుతోంది.

1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్ కి ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత విక్రమ్ భట్ కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. ఇది ఆమెకు దర్శకురాలిగా తొలి చిత్రం. జూన్ 23న ఎలాంటి సందడి లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రమోషనల్ క్యాంపెయిన్లు మార్కెటింగ్ వ్యూహాలు వేటినీ అనుస‌రించ‌లేదు. కాస్తంత తక్కువ ప్ర‌చారంలోనే ఉంచారు.

ఇతర ప్రాజెక్ట్ ల మాదిరిగా ఈ చిత్రం విడుద‌ల స‌మ‌యంలో ఎటువంటి సందడి లేదు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. నిజానికి అవిక చిత్రానికి ప‌రిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. పైగా రిలీజ్ డే విపరీతమైన ప్రతికూల సమీక్షలను అందుకుంది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ చిత్రం 'ఆదిపురుష్‌'తో పోటీ పడవలసి వచ్చింది. ఇందులో పెద్ద స్టార్స్ లేరు. ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం పెట్టిన పెట్టుబ‌డికి రెండింతలు అద‌నంగా వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ చెబుతోంది. 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల‌ తో బాక్సాఫీస్ రన్ ను ముగించింది. ఇది హిట్ చిత్రంగా నిరూపించింది.

అయితే 1920 ఫ్రాంచైజీ ట్యాగ్ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచిందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా బాలికా వధు సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ ఉన్న‌ అవికా గోర్ సోషల్ మీడియా విజ్ఞప్తి పని చేసి ఉండవచ్చని కూడా ట్రేడ్ విశ్లేషిస్తోంది. క‌థానాయిక‌గా పరిణతి చెందడం కూడా హిందీ సినీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు.

ఒక‌సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే...

'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన‌ అవికా గోర్ చాలా కాలానికి హిందీ చిత్ర‌సీమ‌లో క‌థానాయిక‌గా అడుగుపెట్టింది. హిందీ టీవీ రంగంలో బాల‌న‌టిగా పాపుల‌రైన ఈ బ్యూటీ టాలీవుడ్ లో కెరీర్ ఆరంభ‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంతో సంచ‌ల‌న నాయిక అయింది.

అయితే ఆ త‌ర్వాత అవిక కెరీర్ ఊహించినంత సాఫీగా సాగ‌లేదు. చాలామంది ఇత‌ర నాయిక‌ల్లానే అవిక ముళ్ల‌బాట‌లోనే న‌డ‌వాల్సొచ్చింది. త‌న‌పై తెలుగు చిత్ర‌సీమ‌లో ఒక ప్ర‌ముఖుడు ప‌గ‌బ‌ట్టి త‌ప్పుడు ప్ర‌చారం చేసాడ‌ని కూడా అవిక ప‌బ్లిగ్గానే వాపోయింది. అయితే ఎన్ని జ‌రిగినా ప్ర‌తిభ‌ను ఆపేదెవ‌రు? ఇప్పుడు హిందీ చిత్ర‌సీమ‌లో తొలి విజ‌యం అందుకుంది. అవిక న‌టించిన హార‌ర్ చిత్రం '1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్' కెరీర్ లో డీసెంట్ హిట్ గా నిలిచింద‌ని బాలీవుడ్ ట్రేడ్ డిక్లేర్ చేసింది.