‘సింగ్ గీతం' మూవీ రివ్యూ : 94 ఏళ్ల వయసులోనూ సింగీతం మరో సాహసం!
By: Tupaki Desk | 12 Jun 2026 2:11 PM IST‘సింగ్ గీతం' మూవీ రివ్యూ
నటీనటులు: అహల్య బమ్రూ - అయాన్- షాలిని కొండెపూడి-బెనర్జీ- రాహుల్ రవీంద్రన్- తులసి- నివేథా పెతురాజ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: అంకుర్
నిర్మాత: నాగ్ అశ్విన్
రచన: సింగీతం శ్రీనివాసరావు - గౌతమి చల్లగుల్ల - శశాంక్ చింతలపూడి -నందకిశోర్ ఈమాని- రాహుల్ రాజేశ్వర్ - రత్న శ్రీకర్
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో చేసిన మరో ప్రయోగం.. సింగ్ గీతం. కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సింగీతం మరోసారి తన మార్కును చూపించారా? తెలుసుకుందాం పదండి.
కథ:
కుబేర పురం అనే గ్రామంలో బంగారం గనుల కోసం జరిగిన విధ్వంసం వల్ల కాల క్రమంలో చెట్టూ చేమలన్నీ మాయమై పతనావస్థకు చేరుకుంటుంది. ఆ ఊరికే చెందిన ప్రతాప్ (అయాన్) మరి కొందరితో కలిసి బంగారు గనులను మరింతగా కొల్లగొట్టే ఆలోచనతో తన సొంత ఊరికి వస్తాడు. ఈ క్రమంలో వాళ్లంతా కలిసి ఊరిలో ఉన్న చివరి చెట్టును కూడా కూల్చేస్తారు. ఐతే ఆ చెట్టును తల్లిలా భావించే గౌరి (అహల్య బమ్రూ).. ఊరి వాళ్ల మీద కోపంతో దేవుడి ముందు అన్న కొన్ని మాటలు నిజమై ఆ ఊరికి చిత్రమైన శాపం తగులుతుంది. తొలి దశలో ఊరి జనాల మాటలన్నీ పాటలైపోతాయి. తర్వాత ఒక్కొక్కటిగా విపరీత పరిణామాలు జరగడం మొదలవుతుంది. ఈ పరిణామాలతో ఊరు ఏమైంది? చివరికి ఊరి శాపం తొలగిందా లేదా? అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఒక పుష్పక విమానం.. ఒక ఆదిత్య 369.. ఒక విచిత్ర సోదరులు.. ఒక భైరవద్వీపం.. టైమ్ లెస్ క్లాసిక్స్ ఇవి. ఇప్పుడు చూసినా కనెక్ట్ అయ్యే కథాంశాలతో దశాబ్దాల కిందట సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మాట్లాడ్డం.. లేచి నిలబడ్డం కూడా కష్టమయ్యే 94 ఏళ్ల వయసులో ఆయన ‘సింగ్ గీతం’ సినిమా తీసి ఔరా అనిపించారు. సినిమా తీయడం అంటే మొత్తం కర్త-కర్మ-క్రియ ఆయనే అయ్యుండకపోవచ్చు. నాగ్ అశ్విన్ సహా ఒక పెద్ద బృందమే ముందుండి ఈ సినిమాను నడిపించింది. కానీ ఈ కథ రాసి.. స్టోరీ బోర్డ్ కూడా వేసి ఇచ్చిన సినిమా తీయించింది సింగీతమే కాబట్టి మేజర్ క్రెడిట్ ఆయనకే కట్టబెట్టాలి. 40 ఏళ్ల ముందు ఆయన ఇలాంటి ఒక ఆలోచన చేశారు అంటే దానికే ముందు అబ్బురపడాల్సి ఉంటుంది. సింగీతం అంటే వైవిధ్యం.. సింగీతం అంటే ప్రయోగం.. అని ముందు తరం ప్రేక్షకులకు బాగా తెలుసు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ.. ఈ తరం ప్రేక్షకులకు కూడా తనేంటో చాటి చెబుతూ ఆయన క్రియేట్ చేసిన కాన్సెప్టే ఈ సినిమాకు అతి పెద్ద సానుకూలాంశం. సినిమా చూస్తూ ఇలాంటి పాయింట్ కూడా ఎప్పుడూ వినలేదే.. ఒక కథను ఇలా నరేట్ చేయడం ఎన్నడూ చూడలేదే.. ఇలాంటి సన్నివేశాలు ఎందులోనూ లేవే.. అనే ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికీ కలుగుతుంది. కచ్చితంగా ఇలాంటి సినిమా ఇంతకుముందెన్నడూ చూడలేదు అని చూసే ప్రతి ప్రేక్షకుడూ అంటాడు. ఐతే కాన్సెప్ట్ వరకు బాగున్నా.. దాని ఎగ్జిక్యూషన్లో మాత్రం కొంత తడబాటు కనిపిస్తుంది. ఐడియా పరిచయం వరకు బాగున్నా.. ఆ ఐడియా ఏంటో అర్థం అయిపోయాక కథ పెద్దగా ముందుకు కదలకుండా ఒకే చోట అటు ఇటు తిరుగుతుండడం ‘సింగ్ గీతం’కు కొంత మైనస్ అయింది. మిడిల్ పోర్షన్స్ బోర్ కొట్టించినా.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే సర్ప్రైజులకు షాకులకు ‘సింగ్ గీతం’లో ఢోకా లేదు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది మంచి కిక్కిస్తుంది.
ఈ సినిమాకు ‘సింగ్ గీతం’ అని పేరు పెట్టడంతోనే ఈ కథ గురించి హింట్ ఇచ్చేశారు. ప్రోమోలు కూడా విషయమేంటో చెప్పేశాయి. ఒక ఊరికి విచిత్రమైన శాపం తగిలి మనుషుల మాటలే పాటలుగా మారిపోవడం ఈ సినిమాలో చాలా యునీక్ గా అనిపించే పాయింట్. సినిమాలో 80 శాతం సన్నివేశాల్లో పాటలే వినిపిస్తాయి. ఐతే అవి రెగ్యులర్ సాంగ్స్ కావు. మనుషులు ఏం మాట్లాడుకున్నా అవి పాటల్లా వినిపిస్తాయన్నమాట. ఈ వెరైటీ కాన్సెప్ట్ ద్వారా వినోదాన్ని పంచుతూ.. ఆ వినోదం మాటున ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది సింగీతం అండ్ టీమ్. సహజ వనరులను దోచుకునే ప్రయత్నంలో మనిషిద ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నాడో.. దాని తాలూకు విపరిణామాలు ఎలా ఉంటాయో భవిష్యత్ చిత్రం చూపించారు సింగీతం. కానీ ఇలాంటి సమస్యలను చర్చించడం.. సందేశాలు ఇవ్వడం ఇంతకుముందు ఏ సినిమాలో చూడనిదేం కాదు. కానీ డిఫరెంట్ స్టయిల్లో ఈ సందేశాన్ని చెప్పడంలోనే సంగీతం మార్కు కనిపిస్తుంది. ప్రకృతిని నాశనం చేసిన పాపానికి ఊరి వాళ్లందరి మాటలు పాటలుగా మారిపోవడం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. తొలి 40 నిమిషాల పాటు సినిమాలో చాలా వరకు సీన్లు కొత్తగా ఉంటాయి. కానీ ముందు కొత్తగా అనిపించే ఈ కాన్సెప్ట్ తర్వాత తర్వాత కొంచెం బోర్ కొట్టిస్తుంది. మాటలు పాటలైపోవడం అనే పాయింటు అర్థం అయిపోయాక వాట్ నెక్స్ట్ అన్నది తెలియడానికి చాలా టైం పడుతుంది. ఇక ఈ పాటల తంతును ముగించి తర్వాతేంటో తేలిస్తే బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది.
‘సింగ్ గీతం’లో సందేశం బాగున్నా.. దాన్ని ఇంకొంచెం బలంగా చెప్పాల్సింది. ఫ్లాఫ్ బ్యాక్ ను మరీ కట్టె కొట్టె తెచ్చె అన్నట్లుగా లాగించేశారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఊరు ఎలా నాశనమైందో సరిగా చూపించలేదు. దీనికి తోడు వర్తమానంలో కనిపించే ఊరిలో సహజత్వం లోపించింది. ఇదంతా సెట్టింగ్ అన్న ఫీలింగే కలిగిస్తుంటుంది ఊరు మొదట్నుంచి. అక్కడి పరిస్థితులు.. మనుషులు.. నిర్మాణాలు.. అన్నింట్లోనూ కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే.. ద్వితీయార్ధంలో కథలో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి. ఏ సన్నివేశం ప్రేక్షకులు ఊహించేలా ఉండదు. ప్రి క్లైమాక్స్ నుంచి ‘సింగ్ గీతం’ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఊరి జనాల్లో పరివర్తన వచ్చే సన్నివేశాలను బాగా తీర్చిదిద్దారు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాకు మేజర్ హైలైట్ చివరి అరగంటే. పతాక ఘట్టం తర్వాత స్టార్ హీరో క్యామియో ఫన్నీగా అనిపిస్తుంది. ‘సింగ్ గీతం’లో ప్లస్సులతో పాటు కొన్ని మైనస్సులూ ఉన్నాయి. కానీ ఈ మూవీ కాన్సెప్ట్.. కథను నరేట్ చేయడంలో కొత్తదనం.. దీన్నొక యునీక్ ఎక్స్‌పీరియెన్స్ గా మార్చాయి. మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టినా సరే.. సింగీతం మార్కు ప్రయోగమంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ‘సింగ్ గీతం’ను చూసి తీరాల్సిందే. 94 ఏళ్ల దర్శకుడు అని లైట్ తీసుకోకుండా జెన్జీ సైతం ఈ సినిమాపై ఒక లుక్కేస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
నటీనటులు:
'సింగ్ గీతం'లో ఆర్టిస్టులందరూ బాగా నటించారు. అందరూ కథను అర్థం చేసుకుని నటించారు. కొత్త అమ్మాయి అహల్య బమ్రూ చక్కటి హావభావాలు పలికించింది. తన పాత్రకు సహజత్వం తీసుకొచ్చింది అహల్య. ఈ కథకు తగ్గట్లే ఒక వెరైటీ హీరోయిన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది తనను చూస్తే. కొత్త వాడే అయిన హీరో అయాన్ కూడా బాగా చేశాడు. చిన్న చిన్న హావభావాలను సరిగ్గా చూపించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో షాలిని కొండెపూడి కూడా బాగా చేసింది. రాహుల్ రవీంద్రన్.. నివేథా పెతురాజ్ అతిథి పాత్రల్లో ఆకట్టుకున్నారు. తులసి.. బెనర్జీ తమ అనుభవాన్ని చూపించారు. రచ్చ రవి.. వంశీ.. ఇంకా మిగతా ఆర్టిస్టుల్లో ఎవరికి వంకలు పెట్టడానికి లేదు.
సాంకేతిక వర్గం:
సాంకేతిక విభాగాల్లో మిగతా అన్నీ ఒకెత్తు అయితే దేవిశ్రీ సంగీతం మరో ఎత్తు. మాటల బదులు పాటలే.. మాటలే పాటలు వినిపించే ఈ సినిమాకు దేవి ప్రాణం పోశాడు అనడంలో సందేహం లేదు. తన కెరీర్ బెస్ట్ వర్క్స్ లో ఇది కచ్చితంగా ఒకటి. ఎప్పుడూ దేవీ పాటల్లో.. బీజీఎంలో వినిపించే సౌండ్స్ అన్ని చాలా వరకు పక్కన పెట్టి కథకు తగ్గట్లుగా కొత్త పాటలు.. స్కోర్ ఇచ్చాడు దేవి. సినిమాను తన స్కోర్ తో అతను ముందుకు నడిపించాడు. కెమెరామన్ అంకుర్ కూడా చక్కటి పనితనం చూపించాడు. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆర్ట్ వర్క్ బావుంది కానీ కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. సహజత్వం లోపించింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సింగీతం అండ్ టీం రైటింగ్ చాలా కొత్తగా సాగింది. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులకు వైవిధ్యం పంచడమే లక్ష్యంగా రాతతో పాటు తీత సాగాయి. స్క్రీన్ ప్లేలో ఒక దశ దాటాక సర్ప్రైజులు లేకపోవడం కొంత మైనస్ అయింది. కానీ కథలో మాత్రం ఆశ్చర్యపరిచే అంశాలు చాలానే ఉన్నాయి. అవి ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తాయి.
చివరగా: సింగ్ గీతం.. సింగీతం మార్కు ప్రయోగం
రేటింగ్ - 3/5
