చరణ్- బుచ్చిబాబు సింక్ వెనక బంధం
అలాంటి సింక్ చరణ్- బుచ్చిబాబు మధ్య ఉండటానికి కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు! వివరాల్లోకి వెళితే..
By: Tupaki Desk | 22 April 2025 8:52 PM ISTలైక్ మైండెడ్ పీపుల్ కలవడం సులువు. వారి మధ్య ప్రతిదీ సింక్ అవుతుంది. అలాంటి సింక్ చరణ్- బుచ్చిబాబు మధ్య ఉండటానికి కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు! వివరాల్లోకి వెళితే..
ఉప్పెన తెరకెక్కించిన తర్వాత రామ్ చరణ్ కి పెద్ది కథ చెప్పి ఒప్పించాడు బుచ్చిబాబు సన. తన రెండో సినిమాకి అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ ని మెప్పించాడంటే బుచ్చిబాబులో మ్యాటర్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. అతడు పిఠాపురం(ఆంధ్రా)లో జరిగిన ఓ ఆసక్తికర కథను చరణ్ కి వినిపించి ఒప్పించాడు. తన రెండో చిత్రంలో హీరో పాత్ర పెద్ది కావాలని ప్రతిజ్ఞ చేసాడట. కరోనా క్రైసిస్ సమయంలో ఈ కథను రాసాడు. కానీ తన కోరిక నెరవేరుతుందని అతడికి తెలియదు. ``నా రెండవ చిత్రం ప్రతిదీ సానుకూలంగా మారి కార్యరూపం దాల్చినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను. అది దైవశక్తి.. ఎవరైనా ఏదైనా ఘాఢంగా ప్రతిజ్ఞ చేసి దాని కోసం కృషి చేస్తే ప్రతిదీ జరుగుతుందని నమ్ముతాను!`` అని బుచ్చి బాబు గుర్తుచేసుకున్నాడు.
ఆసక్తికరంగా తాను భక్తి భావంతో ఉంటాడు గనుక చరణ్ లాంటి భక్తితత్వం ఉన్న హీరో తనకు కలిసాడు. ఇద్దరూ చాలా ఆధ్యాత్మికంగా ఉండటంతో చాలా సింక్ కుదిరింది. ఆధ్యాత్మికత సహా చాలా విషయాలను షేర్ చేసుకుంటూ బంధం ఏర్పరచుకున్నారు. చరణ్ సర్ చాలా భక్తికి సంబంధించిన పుస్తకాలు చదువుతారని, ఆయన నాక్కూడా పుస్తకాలు పంపుతూనే ఉంటారని బుచ్చిబాబు చెప్పాడు.
దైవానికి సంబంధించిన.. పౌరాణిక, భక్తి అంశాలను కలిసినప్పుడు చర్చిస్తామని బుచ్చిబాబు తెలిపాడు. ఇలాంటి విషయాలపై చరణ్ సర్ కి అపారమైన జ్ఞానం ఉందని కితాబిచ్చాడు. చరణ్ బర్త్ డే సమయంలో కస్టమ్-మేడ్ భక్తి ప్రయాణ కిట్ - చెరియాల్ హనుమాన్ మాస్క్.. భక్తి శ్లోకం హనుమాన్ చాలీసాను తనకు ఉపాసన చరణ్ బహుమతిగా ఇచ్చారని బుచ్చి బాబు గుర్తు చేసుకున్నారు. ``వారి ప్రేమ మద్దతుకు రుణపడి ఉన్నాను. చరణ్ సర్ ఎల్లప్పుడూ స్థిరంగా, వినయంగా ఉంటాడు. సూపర్‌స్టార్ అయినా ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారు. చరణ్-ఉపాసన దంపతులు ఎక్కడికి వెళ్ళినా రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి చిన్న విగ్రహాలు ఉన్న పోర్టబుల్ టెంపుల్ సెట్ (కిట్)ను తీసుకువెళతారు. ఆలయ శక్తులతో కనెక్ట్ అవ్వడానికి గొప్ప మార్గం.. కృతజ్ఞతను వ్యక్తపరిచే మార్గం అని ఈ జంట నమ్ముతార``ని బుచ్చిబాబు తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు.
