Begin typing your search above and press return to search.

భారతీయ విద్యార్థుల 'డాలర్‌ డ్రీమ్స్‌' కు కష్టాలు!

కాగా వీసా ఇంటర్వ్యూకు ఒకసారి వెళ్లిన విద్యార్థి తిరస్కారానికి గురైతే ఏం చేయాలన్నది తెలియడం లేదని అంటున్నారు

By:  Tupaki Desk   |   24 March 2024 7:50 AM GMT
భారతీయ విద్యార్థుల డాలర్‌ డ్రీమ్స్‌ కు కష్టాలు!
X

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనేది దాదాపు ప్రతి భారతీయ విద్యార్థి కల. అక్కడ ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత కొలువును దక్కించుకుని, తమ డాలర్స్‌ డ్రీమ్స్‌ ను నెరవేర్చుకోవాలనుకుంటారు. అయితే అమెరికాలో విద్యాభ్యాసం కోసం కావాల్సిన ఎఫ్‌1 వీసా ఇంటర్వ్యూల స్లాట్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

సాధారణంగా అమెరికాలో విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి ఫాల్‌ సీజన్, స్ప్రింగ్‌ సీజన్‌ అని రెండు ఉంటాయి. ఫాల్‌ సీజన్‌ సాధారణంగా ఆగస్టు మధ్యలో మొదలవుతుంది. దీనికోసం మార్చి నుంచి దశల వారీగా విద్యార్థి వీసా (ఎఫ్‌1) తేదీలు విడుదలవుతాయి.

ప్రస్తుతం మార్చి నెల చివరకు వచ్చినప్పటికి ఇంకా వీసా స్లాట్లు విడుదల కాకపోవడంతో అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభానికి 60 రోజుల ముందుగా మాత్రమే వీసా ఇంటర్వ్యూ తేదీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో అడ్మిషన్లకు తక్కువ సమయం మాత్రమే ఉండగా చివరలో స్లాట్లు విడుదల చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా వీసా ఇంటర్వ్యూకు ఒకసారి వెళ్లిన విద్యార్థి తిరస్కారానికి గురైతే ఏం చేయాలన్నది తెలియడం లేదని అంటున్నారు. గతంలో స్లాట్లు అందుబాటులో ఉంటే మూడు దఫాల వరకు ఇంటర్వ్యూకు వెళ్లేందుకు వీలుండేది. అయితే ఇక నుంచి దీన్ని రెండుసార్లకు కుదించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఒకసారి వీసా తిరస్కారానికి గురైనవారికి విడిగా మళ్లీ స్లాట్లు జారీ చేసేవారు. ఈసారి ఎప్పుడు విడుదల చేస్తారు.. తిరిగి వీసా పొంది, అమెరికా వెళ్లేసరికి తరగతులు మొదలైపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో జూన్, జూలైల్లో విడుదల చేసే స్లాట్లలో వీసా రాకపోతే పరిస్థితి ఏంటని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఫాల్‌ సీజన్‌ అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు రెండో వారం తర్వాత నుంచి తరగతులు ప్రారంభమవుతాయిు.

కాగా హైదరాబాద్‌ లోని అమెరికా కాన్సులేట్‌ పరిధిలో పర్యాటక వీసా(బీ1, బీ2) స్లాట్లను కూడా పరిమితంగా విడుదల చేయటం హాట్‌ టాపిక్‌ గా మారింది. విద్యార్థి వీసాలను ఆయా సమయాల్లో విడుదల చేస్తున్నప్పటికీ పర్యాటక వీసా దరఖాస్తులకు మాత్రం ఎదురుచూపులు తప్పట్లేదని అంటున్నారు.

వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు దాదాపు ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తుందని అంటున్నారు. హైదరాబాద్‌ లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం నూతన ప్రాంగణంలోకి మారిన నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూ కౌంటర్ల సంఖ్యను భారీగానే పెంచారు. అయితే ఆ స్థాయిలో ఇంటర్వ్యూ స్లాట్లను విడుదల చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూ కోసం 322 రోజులు, పర్యాటక వీసా ఇంటర్వ్యూ కోసం 324 రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు.

అలాగే చెన్నై కాన్సులేట్‌ పరిధిలో స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూ కోసం 368 రోజులు, పర్యాటక వీసా కోసం 479 రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది.