Begin typing your search above and press return to search.

కెనడాకు వెళ్లే భారత్ విద్యార్థుల్లో భారీ తగ్గుదల... కారణం ఇదే!

దీంతో కెనడా 41 మంది దౌత్యాధికారులను వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో స్టడీ పర్మిట్లను ఎక్కువమొత్తంలో ప్రాసెస్‌ చేయడం కుదరలేదని ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 9:40 AM GMT
కెనడాకు వెళ్లే భారత్  విద్యార్థుల్లో భారీ తగ్గుదల... కారణం ఇదే!
X

ప్రస్తుతం కెనడాలో నెలకొన్న పరిస్థితులతోపాటు.. భారత్ తో ఏర్పడిన దౌత్యపరమైన విభేదాలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ఇండియన్ ఏజెంట్సే కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన నిరాధార ఆరోపణలు రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలను రాజేశాయి. దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.

దీంతో దేశరాజధాని ఢిల్లీలోని తమ రాయబారులను భారీ సంఖ్యలో తగ్గించుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. దీంతో కెనడా 41 మంది దౌత్యాధికారులను వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో స్టడీ పర్మిట్లను ఎక్కువమొత్తంలో ప్రాసెస్‌ చేయడం కుదరలేదని ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదే సమయంలో సమీప భవిష్యత్తులో పెరిగే సంకేతాలు కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు.

ఫలితంగా... భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఈ క్రమంలో... గత ఏడాది డిసెంబర్‌ తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జారీ చేసింది. అంతకుముందు మూడు నెలల వ్యవధిలో ఈ సంఖ్య 1,08,940గా ఉండటం గమనార్హం. అంటే... పర్మిట్లలో సుమారు 86 శాతం తగ్గుదల నమోదైందన్నమాట.

కాగా... కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... 2022లో కెనడా ప్రభుత్వం 2,25,835 స్టడీ పర్మిట్లను జారీ చేయగా.. అందులో సుమారు 41 శాతం భారతీయ విద్యార్థులే సొంతం చేసుకున్నారు. మరోవైపు విదేశీ విద్యార్థుల వలసలు పెరగడంతో కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవల మార్క్‌ మిల్లర్‌ వెల్లడించారు.