భారతీయ విద్యార్థుల బహిష్కరణ... ఇప్పుడు కెనడా వంతు?
కెనడా ప్రభుత్వం ఏటా విద్యార్థి వీసాల జారీపై పరిమితి విధించే దిశగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 23 Aug 2023 10:05 AM GMTతప్పుడు ధృవీకరణ పత్రాలో.. లేక, పార్ట్ టైం జాబ్ మంతనాలో... కారణాలు ఏవైనప్పటికీ అమెరికా నుంచి భారతీయ విద్యార్థులు బహిష్కరణకు గురైన సంఘటనలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కెనడా ప్రభుత్వం కూడా అలాంటి ఆలోచన చేస్తుందని తెలుస్తోంది!
అవును... కార్మికుల కొరత అధికంగా ఉండటంతో కెనడా ప్రభుత్వం విదేశీయులకు భారీస్థాయిలో ఆహ్వానం పలుకుతుందని అంటుంటారు. అయితే తాజాగా ఈ విధానం తాలూకు ప్రతికూల ఫలితాలు బయటపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుందట. దీంతో వీసాల విషయంలో పరిమితితులు విధించాలని ఆలోచిస్తుందని అంటున్నారు.
కెనడా ప్రభుత్వం ఏటా విద్యార్థి వీసాల జారీపై పరిమితి విధించే దిశగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కెనడాలో నివాసాల కొరత ఏర్పడి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయట. దీంతో, ప్రభుత్వం విదేశీ విద్యార్థుల రాకడను కట్టిడి చేసే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. తాజాగా కెనడా హౌసింగ్ శాఖ మంత్రి షాన్ ఫ్రేజర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
వలసల నిబంధనలు సడలించడం, సులువుగా వర్క్ పర్మిట్ లభిస్తుండటంతో విదేశీ విద్యార్థులు కెనడాకు క్యూ కట్టడం ప్రారంభించారని.. ఫలితంగా 2022లో కెనడాలో కాలపరిమితి ముగియని వీసాలు కలిగిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 8 లక్షలు ఉందని.. దీంతో దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఒత్తిడి పెరుగిందని చెబుతున్నారు.
అయితే ఈ విషయంపై ఓమారు ఆలోచించాలని చెబుతున్న మంత్రి మాటలను పరిశీలిస్తే... ఇకపై కెనడా వెళ్లాలనుకుంటున్న విదేశీ విద్యార్థులకు షాక్ తప్పదేమో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు నిపుణులు!