యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్ ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ కలిసి ‘సోషల్ చేంజ్ ఫ్రంట్’ ఏర్పాటు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించడంతో ఎస్పీ ముస్లిం, దళిత ఓటు బ్యాంకుపై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఈ కూటమితో బీజేపీకే నష్టమని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 15 Nov 2026 3:11 PM ISTఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి గట్టిపోటీ ఇస్తున్న విపక్షం ఇండి కూటమికి షాక్ ఇచ్చే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ మైనార్టీ నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), చంద్రశేఖర్ ఆజాద్ (ఆజాద్ సమాజ్ పార్టీ) కలిసి ఏర్పాటు చేసిన నూతన కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలను తలకిందులు చేయనున్నట్లు భావిస్తున్నారు. 'సోషల్ చేంజ్ ఫ్రంట్' పేరుతో ఈ ఇద్దరు నేతలు రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ పొత్తు అధికార బీజేపీ కంటే ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కు పెద్ద టెన్షన్‌గా మారిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో దళిత, ముస్లిం మైనార్టీ ఓటర్లు అత్యంత కీలకంగా చెబుతున్నారు. రాష్ట్ర జనాభాలో ఈ రెండు వర్గాల ఓట్లు దాదాపు 40 శాతం వరకు ఉంటాయని అంచనా. పశ్చిమ ఉత్తరప్రదేశ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో ఈ రెండు సామాజిక వర్గాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు ఈ వర్గాల ఓటర్లు ఎక్కువగా ఎస్పీ, బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) మద్దతుదారులుగా ఉండేవారని అంటున్నారు. అయితే, ఇప్పుడు ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ కలిసి ఆ వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు కూటమి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఆయా వర్గాల హక్కుల కోసమే తాము కూటమి కట్టామని ప్రకటించినప్పటికీ ఈ కూటమి ప్రభావం వల్ల ఎస్పీ నమ్ముకున్న ముస్లిం ఓటు బ్యాంకులో చీలిక వచ్చే ప్రమాదం పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇదే జరిగితే అధికార బీజేపీ కలిసివచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మైనార్టీ ఓట్లు ఎస్పీ లేదా కాంగ్రెస్ పార్టీకి పడకుండా ఎంఐఎంకి మళ్లుతాయని, దాంతో విపక్షం ఓటు బ్యాంకుకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, ఒకప్పుడు యూపీలో బలమైన శక్తిగా ఉన్న మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ప్రభావం క్రమంగా తగ్గిపోవడం, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చంద్రశేఖర్ ఆజాద్ తీవ్రంగా ప్రయత్నించడం కూడా ఎస్పీ నేతృత్వంలోని కూటమికి నష్టం చేసేదిగా ఉందని అంటున్నారు. జాటవ్ వర్గానికి చెందిన ఆజాద్, దళిత యువతను ఆకట్టుకుంటూ మాయావతికి చెక్ పెట్టాలని చూస్తున్నారని చెబుతున్నారు. దీనివల్ల బీఎస్పీ సంప్రదాయ ఓటు బ్యాంకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు.
మొత్తానికి ఈ పరిణామాలతో ఉత్తరప్రదేశ్ లో ద్విముఖ పోరు జరుగుతుందనే అంచనాలు తలకిందులు అవుతున్నాయని అంటున్నారు. ఒవైసీ, చంద్రశేఖర్ అజాద్ తో కూడిన కూటమి అన్నిస్థానాల్లో పోటీకి దిగుతామని చేసిన ప్రకటనతో త్రిముఖ పోరు జరగడం ఖాయమే అంటున్నారు. అయితే ఈ కొత్త కూటమి వల్ల తమకు జరిగే నష్టమేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన చర్చకు తావిస్తోంది. కొత్త కూటమి వల్ల అధికార బీజేపీకే నష్టమని, బీజేపీ ఓట్లలో 2 నుంచి 3 శాతం చీలిపోతాయని అఖిలేష్ విశ్లేషించారు. అయితే మాజీ సీఎం ఆలోచన ఏంటో తెలియడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సహజంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకు వచ్చే పార్టీలు, కూటముల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని, కానీ కొత్త కూటమి వల్ల అధికార పార్టీ నష్టపోతుందన్న అఖిలేష్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని అంటున్నారు. మొత్తానికి యూపీలో ముఖ్యమంత్రి యోగి మంచి కోసమే ఒవైసీ పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా చాలా ఉత్తారాది రాష్ట్రాల్లో ఒవైసీ కారణంగా కాంగ్రెస్ ఓటుకు చిల్లుపడిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలతో యూపీ ఎన్నికలు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు.
