మోడీ సభలో కాంగ్రెస్ సీఎం ప్రసంగం... గెహ్లాత్ సెటైర్ కి పీఎంవో రియాక్షన్!
అవును... రాజస్థాన్ లో ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమం నుండి తన మూడు నిమిషాల ప్రసంగాన్ని తొలగించారని అశోక్ గెహ్లాత్ ఆరోపించారు!
By: Tupaki Desk | 27 July 2023 9:02 AM GMTప్రధాని మోడీ అధికారికంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుంటారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటనలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. పైగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలంటే మోడీకి విపరీతమైన ఆసక్తి అని అంటుంటారు. ఉదాహరణకు తాజాగా కర్ణాటక ఎన్నికల సమయాన్ని గుర్తుచేస్తున్నారు.
అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ సభల సంగతి కాసేపు పక్కనపెడితే... బీజేపీయేతర రాష్ట్రాల్లో అయితే మోడీ సభలో "అంతా మోడీనే" అన్నట్లుగా సాగుతుంటాయని అంటుంటారు. కనీసం ముఖ్యమంత్రులకు కూడా ప్రయారిటీ ఉండదనేది కీలక విషయం. ఈ నేపథ్యంలో తాజాగా మోడీ రాజస్థాన్ పర్యటన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఈ పర్యటన సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది! అవును... రాజస్థాన్ లో ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమం నుండి తన మూడు నిమిషాల ప్రసంగాన్ని తొలగించారని అశోక్ గెహ్లాత్ ఆరోపించారు! అనంతరం ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాజస్థాన్ సీఎం.
అవును... మోడీ రాజస్థాన్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సభలో మూడు నిమిషాలు ప్రసంగించే ఛాన్స్ లేదని తెలియడంతో ఆయన ఆన్ లైన్ వేదికగా సెటైర్స్ వేశారు. ఇందులో భాగంగా... ట్విట్టర్ లో స్వాగతం చెప్పడం మినహా మీ సభలో పాల్గొని నాలుగు మాటలు మాట్లాడే అవకాశం తనకు లేదని, అశక్తుడనంటూ చతురోక్తులు విసిరారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
దీంతో అలర్ట్ అయిన ప్రధానమంత్రి కార్యాలయం రిప్లై ఇచ్చింది. గెహ్లాట్ ప్రసంగం తీసేసిన మాట నిజమేనని అంగీకరిస్తూనే మరోవైపు ఇందుకు దారి తీసిన కారణం ఉందంటూ రీట్వీట్ చేసింది. రాజస్దాన్ ముఖ్యమంత్రి కార్యాలయం... సీఎం అశోక్ గెహ్లాట్, ప్రధాని మోడీ కార్యక్రమానికి అందుబాటులో ఉండటం లేదని చెప్పినట్లు పీఎంవో చెప్పుకొచ్చింది. అందుకే ఆయన ప్రసంగాన్ని తీసేసినట్లు వెల్లడించింది.
కాగా... రాజస్తాన్ లో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని మోడీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయన ఏడుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. ఈసారి రాజస్తాన్ లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ సర్వేలు వెలువడుతున్నాయనే కథనాలొస్తున్న వేళ... ప్రధాని ఇక అక్కడే తిష్టవేసినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.