Begin typing your search above and press return to search.

ఆ ఆటోలో జర్నీ చేస్తే కేజీ టమాటాలు ఫ్రీ

హాట్ టాపిక్ గా మారింది టమాటా

By:  Tupaki Desk   |   22 July 2023 3:47 AM GMT
ఆ ఆటోలో జర్నీ చేస్తే కేజీ టమాటాలు ఫ్రీ
X

హాట్ టాపిక్ గా మారింది టమాటా. కేజీ పది రూపాయిలు.. పదిహేను రూపాయిలుగా ఉండే టమాటాలు.. అమాంతం కేజీ రూ.140 వరకు చేరుకోవటం.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వీటి ధరలు కేజీ రూ.200 వరకు వెళ్లటం తెలిసిందే. ఇలాంటి వేళ.. కేజీ టమాటలు ఉచితంగా ఇస్తానంటూ పోస్టర్లు వేసిన ఒక ఆటోవాలా ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది.

కొన్ని వాణిజ్య సంస్థలు.. కొందరు వ్యాపారులు తమ దుకాణంలో ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తే టమాటాలు ఫ్రీగా ఇవ్వటం చూశాం కానీ.. ఒక ఆటోవాలా ప్రకటించిన కేజీ టమాటా ఫ్రీ ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చంఢీగడ్ కు చెందిన ఒక ఆటో డ్రైవర్.. తన ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ ప్రకటించాడు. తన ఆటోలో ప్రయాణించే వారికి కేజీ టమాటాలు ఫ్రీగా ఇస్తానని చెబుతున్న అతను.. తన ఆఫర్ కు ఒక కండీషన్ పెట్టాడు.

తాను పెట్టిన ఆఫర్ ను సొంతం చేసుకోవాలంటే.. తన ఆటోలో ఐదు రైడ్లు చేయాలని మాత్రం కోరుతున్నాడు. ఇతగాడి ఆఫర్ స్థానికంగా అందరి నోట నానుతోంది. అయితే.. ఈ ఆటోవాలా గురించి కాస్తంత ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అదేమంటే.. సైన్యంలో పని చేసే సైనికులకు గడిచిన పన్నెండేళ్లుగా ఉచితంగా తన ఆటోలో సేవలు అందిస్తుంటాడు. అంతేకాదు.. గర్భణీలకు సైతం ఉచితంగా సర్వీసు చేస్తాడు. వారు ఇస్తున్నా పైసా ముట్టుకోవటానికి ఇష్టపడడు. అలా అని అతగాడికి మరేమైనా వ్యాపారాలు ఉన్నాయా? అంటే అవేమీ లేవు.

కానీ.. తన నిర్ణయాలు తనకు ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పే ఇతడు.. రానున్న రోజుల్లో తన ఆటో ఎక్కే వారికి మరో ఉరించే ఆఫర్ ను ప్రకటించాడు. పాకిస్థాన్ పై ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిస్తే.. ఐదు రోజుల పాటు ఉచితంగా ఆటో రైడ్ లు అందిస్తానని ప్రజలకు చెబుతున్నాడు. వావ్ అనిపించేలా ఉన్న ఆఫర్లతో అదరగొట్టేస్తున్న ఈ ఆటోవాలా ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు.