Begin typing your search above and press return to search.

షూటింగ్ సెట్ కి చిరుత.. 200 మంది పరుగో పరుగు

ముంబైలోని గోరేగావ్‌ ఫిల్మ్‌ స్టూడియోలో మరాఠీ సీరియల్‌ సుఖ్‌ మాంజే కాయ్ ఆస్తా షూటింగ్

By:  Tupaki Desk   |   27 July 2023 8:52 AM GMT
షూటింగ్ సెట్ కి చిరుత.. 200 మంది పరుగో పరుగు
X

సాధారణంగా ఎక్కడ అయినా షూటింగ్‌ జరుగుతుంది అంటే జనాలు గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకోవడం మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ లోని షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన స్టూడియోలు.. ఫిల్మ్‌ సిటీలు చాలా సేఫ్ గా ఉంటాయి. కానీ ముంబయిలోని పలు స్టూడియోలకు వన్య ప్రాణులు పదే పదే రావడం వార్తల్లో నిలవడం మనం చూస్తూనే ఉంటాం.

గతంలో హిందీ సినిమాల షూటింగ్స్.. సీరియల్స్ షూటింగ్‌ సమయంలో పాములు.. ఇతర అడవి జంతువులు రావడం జరిగింది. ఈసారి ఏకంగా ఒక చిరుత పులి మరో చిన్న పులితో కలిసి రావడంతో అక్కడున్న వారు అంతా కూడా పరుగులు పెట్టారు. షూటింగ్ సీరియస్ గా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సెట్‌ లో చిరుత కనిపించడంతో రెండు వందల మంది పరుగులు పెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని గోరేగావ్‌ ఫిల్మ్‌ స్టూడియోలో మరాఠీ సీరియల్‌ సుఖ్‌ మాంజే కాయ్ ఆస్తా షూటింగ్ చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో అంతా కూడా షూటింగ్ తో బిజీగా ఉన్న సమయంలో చిరుత పులి రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు మొత్తుకుంటూ స్టూడియో నుంచి బయటకు వెళ్లారట.

నటీనటులు సాంకేతిక నిపుణులు అంతా కూడా బయటకు పరిగెత్తారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో షూటింగ్‌ సెట్స్ లోకి పులి రావడం ఇది నాల్గవ సారి అంటూ ఇండియన్ సినీ వర్కర్స్ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌ సురేష్ శ్యామ్‌లాల్‌ పేర్కొన్నాడు.

ఈ విషయమై పదే పదే విజ్ఞప్తి చేసినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని.. చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో కొండచిలువ తో పాటు అనేక రకాల పాములు జంతువులు కూడా షూటింగ్ స్పాట్ కు వచ్చాయి. ఫిల్మ్‌ స్టూడియోస్ కి ఆనుకుని అడవులు ఉండటం వల్ల ఇలా జరుగుతుందట.