కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!
కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 75 షిగెల్లా కేసులు నమోదయ్యాయి. అరీకోడ్, పుల్పట్ట, ఎడవన్న ప్రాంతాల్లో కొత్త కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ నివారణకు కాచి చల్లార్చిన నీరు తాగాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో సామూహిక విందులపై నిషేధం విధించారు.
By: Tupaki Desk | 12 Nov 2026 11:47 PM ISTకేరళలోని మలప్పురం జిల్లాలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. అరీకోడ్, పుల్పట్ట, ఎడవన్న ప్రాంతాల్లో కొత్త కేసులు బయటపడటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధి మరింత వ్యాపించకుండా నిఘా, నివారణ చర్యలను పెంచింది.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి. వినోద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు మలప్పురంలో 75 షిగెల్లా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎనిమిది కాంటాక్ట్ కేసులు ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా స్థాయి రాపిడ్ రెస్పాన్స్ టీమ్ అత్యవసర సమావేశం నిర్వహించింది.
ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలేంటి?
షిగెల్లా అనేది పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి మలంతో సంబంధం ఏర్పడినా ఇతరులకు సోకే అవకాశం ఉంది. పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి రెండు రోజుల్లో లక్షణాలు మొదలవుతాయి. విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, వాంతులు, మలంలో రక్తం లేదా చీము కనిపించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తాగడానికి, వంటకు కాచి చల్లార్చిన నీటినే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తాజాగా తినాలి. పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగాలి. భోజనానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
విరేచనాలు వచ్చినప్పుడు డీహైడ్రేషన్ నివారణకు ORS తీసుకోవాలి. మలంలో రక్తం కనిపించినా, జ్వరం లేదా తీవ్రమైన విరేచనాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంతంగా మందులు వాడకూడదు.
మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో ఆహార తయారీ, నిల్వ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ముందుజాగ్రత్తగా అక్కడ సామూహిక విందులపై కూడా నిషేధం విధించారు.
