Begin typing your search above and press return to search.

రామేశ్వరం కేఫ్.. రూ.కోట్ల వ్యాపారం.. వేలాది జనం.. అందుకే టార్గెట్

ఇలాంటి సమయంలో అది కూడా సరిగ్గా ఎన్నికల ముంగిట బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించడం సంచలనం రేపుతోంది.

By:  Tupaki Desk   |   2 March 2024 11:15 AM GMT
రామేశ్వరం కేఫ్.. రూ.కోట్ల వ్యాపారం.. వేలాది జనం.. అందుకే టార్గెట్
X

ఏ మాటకా మాట.. కేంద్రంలో ప్రభుత్వం మారాక 2014 నుంచి ఉగ్రవాద దాడులు దాదాపు తగ్గాయి.. అంతకుముందు పదేళ్లు ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ.. ప్రాణ నష్టం తీవ్రంగా ఉండేలా ఉగ్రవాదులు పన్నాగాలు పన్నారు. వీటిలో హైదరాబాద్ కూడా బాధిత నగరమే. 2007లో మక్కా మసీదు, గోకుల్ చాట్, లుంబినీ పార్క్, 2013లో దిల్ సుఖ్ నగర్ పేలుళ్లు సంభవించాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇక 2014 తర్వాత అడపాదడపా తప్ప తీవ్ర స్థాయి పేలుళ్లు మాత్రం లేవనే అనుకోవాలి. ఇలాంటి సమయంలో అది కూడా సరిగ్గా ఎన్నికల ముంగిట బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించడం సంచలనం రేపుతోంది.

నిత్యం రద్దీ.. అందుకే విపరీత బుద్ధి

కర్ణాటక రాజధాని బెంగళూరు అంటేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పెట్టింది పేరు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లక్షలాదిగా ఉంటారు. అలాంటి నగరంలో ప్రసిద్ధిగాంచింది రామేశ్వరం కేఫ్. మరి.. ఎన్నో స్టార్ హోటళ్లు, పర్యటక, వినోద ప్రాంతాలు ఉండగా.. రామేశ్వరం కేఫ్ నే ఎందుకు టార్గెట్ చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు అంటే.. దీనికి పెద్ద కథనే ఉంది. ఈ కేఫ్ కు రోజుకు 6,500 మంది వస్తారు. ప్రపంచంలోని ఫుడ్ లవర్స్ అందరూ ఇక్కడి ఆహారాన్ని ఇష్టపడతారట. ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, బటర్ ఇడ్లీ, లెమన్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీలు రామేశ్వరం హోటల్ స్పెషల్స్. కేవలం నెలవారీ బిజినెస్సే రూ.4.5 కోట్లు ఉంటుందని అంచనా. ఏడాదికి ఇది రూ.50 కోట్లపైనే అన్నమాట. ఈ క్రమంలోనే హోటల్ ను టార్గెట్ చేసుకుని విధ్వంసం రేపాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది.

వాడింది ప్రెజర్ కుక్కర్..

రామేశ్వరం కేఫ్ పేలుళ్ల నిందితుడు ప్రెజర్ కుక్కర్‌ బాంబు వాడాడని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అతడు భుజాన బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డయింది. మాస్క్, టోపీ పెట్టుకున్న ఆ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌ కు వచ్చాడు. రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్‌ చేసి, వెళ్లిపోయాడు. ఆ తర్వాత పేలుడు సంభవించింది. ఈ కేసులో కర్ణాటక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం 10 మంది గాయపడినట్లు చెప్పారు. కాగా, 2022 నవంబరులో మంగళూరులో ఇదే తరహాలో కుక్కర్‌ బాంబు పేలింది. దీంతో వీటి మధ్య సంబంధం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.