Begin typing your search above and press return to search.

కాబోయే అల్లుడికి కట్నంగా 9 రకాల పాములు!

అవును... ఛత్తీస్‌ గఢ్‌ లోని కొర్బా ప్రాంతానికి చెందిన గిరిజన తెగ.. పాములను కట్నంగా ఇచ్చే ఆచారాన్ని వందల ఏళ్లుగా పాటిస్తోంది.

By:  Tupaki Desk   |   22 July 2023 6:03 AM GMT
కాబోయే   అల్లుడికి   కట్నంగా  9 రకాల పాములు!
X


వరకట్నం తీసుకోవడం నేరం అని తెలిసినా కొన్ని చోట్ల డిమాండ్ చేసి మరీ తీసుకుంటారు కొందరు! ఈ సమయంలో వరకట్నంగా బంగారం, డబ్బు, భూములు, బిల్డింగ్ లు, వాహనాలూ ఇస్తుంటారని కథనాలొస్తుంటాయి. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా... ఒక గిరిజన తెగ లో మాత్రం పాములను కట్నంగా ఇవ్వాల్సి ఉంటుంది!

అవును... ఛత్తీస్‌ గఢ్‌ లోని కొర్బా ప్రాంతానికి చెందిన గిరిజన తెగ.. పాములను కట్నంగా ఇచ్చే ఆచారాన్ని వందల ఏళ్లుగా పాటిస్తోంది. పెళ్లిలో సన్వారా తెగలోని వధువు తరఫువారు వరుడికి సర్పాలను కట్నంగా ఇచ్చుకుంటారు. మొత్తం 9 రకాల జాతులకు చెందిన 21 పాములను అల్లుడికి కానుకగా ఇస్తారు.

అలా కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లను సన్వారా తెగలో ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని తెలుస్తుంది. వివాహ సమయంలో మెట్టి నింటికి ఆ ఇంటి కోడలు సుమారు 9 జాతుల పాములను తీసుకురాలేకపోతే.. ఆ పెళ్లి అసంపూర్ణంగా మిగిలిపోతుందని సన్వారా గిరిజనులు భావిస్తారు.

ఇదే సమయంలో మా పూర్వీకులు 60 పాములను ఇచ్చేవారు.. నేను 40 పాములు కట్నంగా తెచ్చాను.. క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోయింది.. వంటి అత్తగారి దెప్పుపొడుపులు వంటివి కూడా ఉంటాయని అంటున్నారట.

ఈ సమయంలో పాములను కట్నంగా తీసుకుని వాటిని ప్రజల ముందు ప్రదర్శిస్తారు. వాటితో నృత్యం చేయించడం వంటివి చేసి జీవనం సాగిస్తారు. ఒకప్పుడు వీరు విషపూరిత సర్పాలను కూడా కట్నంగా ఇచ్చుకునేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అందుకు అనుమతించట్లేదు. కేవలం విషరహిత పాములను మాత్రమే పట్టుకునేందుకు గిరిజనులకు అనుమతిస్తోంది.

"జీవనోపాధి కోసం విషం లేని పాములను పట్టుకోవడం, వాటిని ప్రజల ముందు ప్రదర్శించి వారు జీవనం సాగిస్తారు. మేము వారికి జాగ్రత్తగా ఉండాలని, విషం లేని పాములను మాత్రమే పట్టుకోవాలని తరచూ సూచిస్తాం. స్థానిక సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం ఇందుకు అనుమతులు ఇస్తోంది" అని అటవీ రేంజి అధికారి సియారామ్‌ కర్మాకర్‌ తెలిపారు.