Begin typing your search above and press return to search.

భక్తి మాటున కనిపిస్తున్న పర్యావరణ విషాదం.. యమునా నదిలో ఏంటీ భయానక పరిస్థితి?

ఢిల్లీలోని యమునా నది తెల్లటి విషపూరిత నురగతో నిండిపోయినా, ఛత్ పూజ సందర్భంగా వేలాది మంది భక్తులు అదే నీటిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీరు, రసాయనాల వల్ల నది కలుషితమవుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా యమునా ప్రక్షాళన పూర్తికాకపోవడం, భక్తుల ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Nov 2026 7:00 PM IST
భక్తి మాటున కనిపిస్తున్న పర్యావరణ విషాదం.. యమునా నదిలో ఏంటీ భయానక పరిస్థితి?
X

నదులను తల్లిగా భావించి.. పూజించే దేశం మనిది.. అయితే ఒకప్పుడు అవి నదులు.. ఇప్పుడు కాలుష్య కారకాలు.. వాటి దుస్థితి ఎంత దారుణంగా చూస్తే మీ ఒళ్లు జలదించడం ఖాయం. అసలు ఈ నీళ్లలో మునిగితే ప్రాణాలు పోవడం ఖాయం. తాజాగా ఢిల్లీలోని యమునా నది దృశ్యాలే నిదర్శనం.

భక్తి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఛత్ పూజ వేడుకలు ఒకవైపు ఘనంగా జరుగుతుంటే.. మరోవైపు అదే పండుగ సందర్భంగా యమునా నదిలో కనిపిస్తున్న కాలుష్య దృశ్యాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కాళింది కుంజ్ ప్రాంతంలో నది మొత్తం తెల్లటి విషపు నురగతో కప్పుకుపోయినప్పటికీ వేలాది మంది భక్తులు అదే నీటిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలిరావడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఉత్తర భారతదేశంలో ఛత్ పూజ అత్యంత పవిత్రమైన పండుగ. సూర్యభగవానుడిని.. ఛత్తీ మాతను ఆరాధిస్తూ మహిళలు ఎంతో నిష్ఠతో ఈ వేడుకను నిర్వహిస్తారు. నదులు, జలాశయాల వద్దకు చేరుకుని నీటిలో నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఈ పూజలో ప్రధాన ఘట్టం. అయితే ఢిల్లీలోని యమునా నది వద్ద మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. నదిలో పేరుకుపోయిన తెల్లటి నురగలు.. మురుగునీటి ప్రవాహాల మధ్యే మహిళలు భక్తితో నదిలోకి దిగుతున్నారు. భక్తుల మనసుల్లో దేవుడిపై ఉన్న నమ్మకం గొప్పదే అయినప్పటికీ వారు మునిగే ఆ నీటి నాణ్యత మాత్రం తీవ్రమైన ఆరోగ్య ముప్పును తలపిస్తోంది.

యమునా నది కాలుష్యం ఢిల్లీకి కొత్త సమస్యేమీ కాదు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నా ఈ నది ప్రక్షాళన మాత్రం ఎవరి హయాంలోనూ పూర్తిస్థాయిలో నెరవేరలేదు. గతంలో కాంగ్రెస్.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రస్తుతం బీజేపీ పాలనలో ఉన్నప్పటికీ యమునా నది దుస్థితి మారలేదు. ఎన్నికల సమయంలో నదిని శుభ్రం చేస్తామని.. మురుగునీటి శుద్ధి వ్యవస్థలను మెరుగుపరుస్తామని భారీ హామీలు ఇస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.

యమునా నదిలో కనిపిస్తున్న ఈ తెల్లటి నురగకు పారిశ్రామిక వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీరు.. డిటర్జెంట్లలో ఉండే హానికారక రసాయనాలే కారణమని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషపూరిత నీటిలో ఛత్ పూజల సమస్యలు మునిగితే చర్మవ్యాధులు, కళ్ల మంటలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూనే వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పండుగ రోజుల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేయడం కాకుండా.. నదిలోకి చేరుతున్న వ్యర్థాలను పూర్తిగా అరికట్టడం అత్యవసరం.

ఒకప్పుడు జీవనదులుగా విలసిల్లిన నదులు నేడు మురుగునీటి కాలువలుగా మారుతుండటం మన సంస్కృతికి తీరని మచ్చ. నదులను కేవలం పూజించడం మాత్రమే కాదు.. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా మన బాధ్యత కావాలి. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం.. పరిశ్రమలు.. ప్రజలు సమష్టిగా స్పందిస్తేనే రాబోయే తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించగలం. నదులను దేవతలుగా కొలుస్తూ మన చేతులతోనే వాటిని విషతుల్యం చేయడం ఏ అభివృద్ధికి సంకేతం? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.