మరిదితో లవ్: భర్తను చంపి.. ఇంటి ముందే పూడ్చేసింది!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో ఉన్న పాతచెరువు గ్రామంలో చోటు చేసుకుంది.
By: Garuda Media | 28 March 2026 10:21 AM ISTవినడానికి కూడా అత్యంత గగుర్పాటు కలిగించే ఈ ఘటన ఏపీలో జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో ఉన్న పాతచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. 13 ఏళ్ల కిందట గ్రామానికి చెందిన హనుమంతుతో సుకన్యకు వివాహమైంది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. వ్యవసాయ పనిచేసుకునే హనుమంతుకు ఆదాయం తక్కువ. అయితే.. సోషల్ మీడియా రీల్స్‌కు.. మధ్యతరగతి అలవాట్లకు అలవాటు పడిన సుకన్య.. ఆదాయంపై హనుమంతుతో నిత్యం గొడవలు పడేది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న మరిదితో ఆమెకు చనువు ఏర్పడింది.
ఆచనువు కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో భర్తను అడ్డు తప్పించి.. ఇరువురు కలిసి ఉండాలని సుకన్యే నిర్ణయానికి వచ్చింది. నాలుగు మాసాల కిందటే ఓ రోజు రాత్రి.. భర్తకు అన్నంలో విషం కలిపి పెట్టింది. దీంతో ఆయన చనిపోయాడు. అయితే.. ఈ గుట్టు బయటకు పొక్కకుండా.. తల్లి సాయంతోనే సుకన్య భర్త శవాన్ని ఇంటి ముందున్న ప్రాంతంలో గొయ్యి తీసి పాతి పెట్టింది. అనంతరం.. అక్కడ అలికి ముగ్గులు పెట్టడం ప్రారంభించింది. దీంతో ఎవరికీ అనుమానం రాలేదు. దీంతో తరచుగా మరిదిని ఇంటికి పిలుచుకుని సహజీవనం చేయడం ప్రారంభించింది.
అయితే.. నాటి `సహాయాన్ని` తరచుగా గుర్తు చేస్తూ.. సుకన్య నుంచి ఆమె తల్లి ఆర్థికంగా లబ్ధిపొందుతోంది. ఈ క్రమంలో తాజాగా మరింత సొమ్ము కావాలని శుక్రవారం ఆమె కుమార్తెతో గొడవకు దిగింది. అయితే..`చిన్నసాయానికి` ఇప్పటికే చాలా ఇచ్చానని.. ఇకపై ఇచ్చేది లేదని సుకన్య కూడా తల్లికి తెగేసి చెప్పింది. ఇది కాస్తా.. తిట్టుకోవడం నుంచి తన్నుకోవడం వరకు దారి తీసింది. ఈ క్రమంలో ఇరుగు పొరుగు వారు గుమిగూడారు. ఈ సందర్భంలో తల్లి నోరు జారి .. అసలు విషయాన్ని వెల్లడించింది.
నాలుగు మాసాల కిందట భర్తను ఎలా చంపిందో కన్న తల్లే చెప్పేసరికి అందరూ నిర్ఘాంత పోయారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. విచారించారు. ఇంటి ముందు పాతిపెట్టిన హనుమంతు మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టమ్‌కు పంపించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా సుకన్యను.. ఆమెకు సహకరించిన ఆమె తల్లిని కూడా అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ కేసులో సహజీవన భాగస్వామిగా ఉన్న మరిదిని కూడా నిందితుడిగా చేర్చారు. విచారణను ముమ్మరం చేశారు. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.
