దాంపత్యంలో దారుణాలు..ఇన్‌స్టాగ్రామ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన భర్తలు!
బరేలీలో భార్య వేధింపులు తాళలేక భర్త ప్రాణాలు తీసుకుంటే, ఝాన్సీలో భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసిన భర్త తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించాడు.
By: Tupaki Desk | 12 April 2025 7:00 AM ISTఉత్తరప్రదేశ్‌లో రెండు వేర్వేరు ఘటనలు పెళ్లి బంధం ఎంత బలహీనంగా మారుతుందో, భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంతలా సన్నగిల్లుతుందో చూపిస్తున్నాయి. బరేలీలో భార్య వేధింపులు తాళలేక భర్త ప్రాణాలు తీసుకుంటే, ఝాన్సీలో భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసిన భర్త తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించాడు. ఈ రెండు సంఘటనలు సమాజంలో వివాహ వ్యవస్థ ఎటువైపు పోతుందో అద్దం పడుతుంది.
బరేలీలో భర్త ఆత్మహత్య
బరేలీకి చెందిన రాజ్ ఆర్య అనే యువకుడు తన భార్య సిమ్రాన్, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఏప్రిల్ 2024లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు 45 రోజుల క్రితమే పాప పుట్టింది. అయితే, కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో సిమ్రాన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం సిమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన భర్తపై పోలీసు ఫిర్యాదు చేసినట్లు రాసింది. "ఉదయం 10:30 గంటలకల్లా అతను జైలులో ఉంటాడు" అని, ఆ తర్వాత "ఇప్పుడు జైలుకు వెళ్ళు" అని పోస్టులు చేసింది. అదే రోజు సాయంత్రం రాజ్ ఆర్య తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడితో మాట్లాడినప్పుడు "అమ్మా, నేను శాశ్వతంగా నిద్రపోతున్నాను" అని చెప్పాడని రాజ్ తల్లి పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఝాన్సీలో భర్త ప్రాణభయం
ఝాన్సీ జిల్లాలోని మౌరాణిపూర్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి తన భార్య రీతూ వర్మ, ఆమె ప్రియుడు అభిషేక్ పాఠక్‌ను తన ఇంట్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ప్రభుత్వ బాలికల కళాశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్న రీతూ వర్మ, స్థానిక కౌన్సిలర్ అభిషేక్ పాఠక్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పవన్ వేరుగా ఉంటున్నాడు. పవన్ మహోబా జిల్లాలో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాడు. తన భార్య ప్రియుడు ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న పవన్ పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్లాడు. తలుపు తెరిచినప్పుడు కౌన్సిలర్ అభిషేక్ పాఠక్ బయటకు వచ్చి స్థానికులను, పోలీసులను బెదిరించడం ప్రారంభించాడు.
"నా భార్య నన్ను, నా కొడుకుని చంపేస్తుంది. విషం టీ ఇస్తుంది. మా శరీరాలు డ్రమ్ములో కనిపిస్తాయి" అని పవన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా పవన్ చిత్రీకరించాడు. అక్టోబర్ 2024లో తన భార్య ఎవరో ఒకరితో చాటింగ్ చేయడం చూశానని, ఆ తర్వాత ఆమెను మానుకోవాలని చెప్పానని పవన్ తెలిపాడు. "నా శరీరం నా ఇష్టం, నేను ఏమి చేసినా చేస్తాను, నన్ను ఆపడానికి నువ్వెవరు?" అని ఆమె బదులిచ్చిందని పవన్ చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
