Begin typing your search above and press return to search.

'పెళ్లికి నో చెబుతావా? ఉదయానికి ప్రాణంతో ఉంటే ఫోన్ చేయ్'

దీంతో.. ఆ యువకుడితో పెళ్లికి తాను సిద్ధంగా లేదని యువతి స్పష్టం చేయటంతో షాక్ తిన్న పరిస్థితి. అయితే.. ఆమెకున్న కారణాలతో ఇంట్లో వారు ఏమీ అనలేదు

By:  Tupaki Desk   |   6 Sep 2023 5:18 AM GMT
పెళ్లికి నో చెబుతావా? ఉదయానికి ప్రాణంతో ఉంటే ఫోన్ చేయ్
X

ప్రేమ.. ప్రేమించుకోవటం.. చాలా మామూలైపోయింది. అయితే.. ప్రేమించినంతకాలం ఆనందాన్ని పంచే బంధాలు.. ప్రేమ విషయంలో కాస్తంత తేడా రాగానే.. అప్పటివరకు కురిపించిన ప్రేమ స్థానే కసిని ప్రదర్శించటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ప్రేమ అంటే.. ఇవ్వటమే తప్పించి తీసుకోవటం కాదన్న విషయాన్ని మర్చిపోయి.. తాము మనుషులమన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. అప్పటివరకు ప్రాణపదంగా ప్రేమించినట్లుగా వ్యవహరించిన వారు.. ఇప్పుడు అందుకు భిన్నంగా కౌర్యాన్ని ప్రదర్శిస్తున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా విశాఖలో అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 26 ఏళ్ల యువతి.. 27 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వయసు పదేళ్లు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా పది రోజుల క్రితమే రెండు కుటుంబాల వారు కూర్చొని ఇద్దరికి పెళ్లి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హటాత్తుగా ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయి.

దీంతో.. ఆ యువకుడితో పెళ్లికి తాను సిద్ధంగా లేదని యువతి స్పష్టం చేయటంతో షాక్ తిన్న పరిస్థితి. అయితే.. ఆమెకున్న కారణాలతో ఇంట్లో వారు ఏమీ అనలేదు. అయితే.. తనతో పెళ్లికి నో చెప్పిన ఆమెపై విపరీతమైన ద్వేషాన్ని పెట్టుకున్న అతడు.. ఆమె ఇంటికి రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లాడు. ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఆమె అందుకు నో చెప్పటంతో అతడిలోని రాక్షసుడు నిద్ర లేచాడు.

తాను ఎంత చెప్పిన వినకపోవటంతో విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తూ.. తనతో తెచ్చుకున్న బ్లేడ్ తో యువతి గొంతునుకోశాడు. అనంతరం తాను సైతం స్వల్పంగా గాయం చేసుకున్నాడు. 'ఉదయం వరకు ప్రాణాలతో ఉంటే ఫోన్ చేయ్' అంటూ కసాయిని మరిపించేలా మాట్లాడిన అతను అక్కడినుంచి వెళ్లిపోయాడు. రక్తం మడుగులో ఉన్న బాధితురాలి అరుపులతో ఇంట్లోని వారు అలెర్టు అయి.. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఆమెకు చికిత్స చేసిన వైద్యులు.. ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ప్రేమించుకునే వేళలో ఎలా అయితే.. ఇద్దరి మధ్య అంగీకారం అవసరమో.. జీవితాంతం కలిసి ఉండే విషయంలోనూ అలాంటి కమిట్ మెంట్ అవసరం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విషయంలో ఏమైనా తేడా జరిగితే.. కన్వీన్స్ చేయాలే కానీ క్రైం చేయకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.