Begin typing your search above and press return to search.

రీల్ కాదు రియల్..నాలుగేళ్లుగా వెతుకున్న రాబిన్ హుడ్ దొరికేశాడు

రీల్ కాదు రియల్ ఉదంతమిది. ఇతడి గురించి చదివిన తర్వత.. అతను పోలీసులకు దొరికినందుకు చాలామంది అయ్యో.. దొరకకుండా ఉండాల్సిందన్న భావనకు గురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 11:30 AM GMT
రీల్ కాదు రియల్..నాలుగేళ్లుగా వెతుకున్న రాబిన్ హుడ్ దొరికేశాడు
X

రీల్ కాదు రియల్ ఉదంతమిది. ఇతడి గురించి చదివిన తర్వత.. అతను పోలీసులకు దొరికినందుకు చాలామంది అయ్యో.. దొరకకుండా ఉండాల్సిందన్న భావనకు గురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందరికి దొంగగా కనిపించే ఇతడు.. ఆ ఊరికి మాత్రం హీరో. అంతేనా.. జానపద కథల్లో రాబిన్ హుడ్ తరహాలో.. పెద్దల్ని కొట్టి పేదలకు పంచటం.. ప్రభుత్వాలకు పట్టని తన ఊరికి మేలు చేసేందుకు వెనుకాడని ఇతడి ఉదంతం ఆద్యంత్యం ఆసక్తికరం. నాలుగేళ్లుగా నాలుగు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న ఈ హైప్రొఫైల్ దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టేశారు. సెల్ ఫోన్.. చెప్పులు వాడకుండా దొంగతనాలు చేసే ఈ ముదురు దొంగకున్న మరో అలవాటు.. సీసీ కెమేరాల కంటికి చిక్కకుండా తప్పించుకోవటం.

బిహార్ లోని గర్హ కు దగ్గర్లోని జోగియా అనే గ్రామం ఉంది. ఆ ఊరికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ ఉజ్వల్ అనే 33 ఏళ్ల ముదురు దొంగ ఉన్నాడు. అందరికి దొంగ కానీ ఆ ఊరికి మాత్రం హీరో. అతనికి మరో పేరుగా ఉన్న ఉజ్వల్ పేరు వెనుక కథ చివర్లో చెబుతాం. ఇతను దేశంలోని వివిధ నగరాల్లోని ఖరీదైన ప్రాంతాల్ని తాను దొంగతనం చేసేందుకు ఎంపిక చేసుకుంటాడు. ఖరీదైన హోటల్లలో బస చేస్తాడు. అతడి టార్గెట్ సంపన్నుల మీదనే ఉంటుంది. వజ్రాలు.. బంగారం.. డబ్బులు తప్పించి వెండిని టచ్ కూడా చేయడు.

అలాంటి ఈ ఖరీదైన దొంగ ఈ నెల 8న హైదరాబాద్ లోని లక్డీకాపూల్ లోని మెరిడియన్ గోల్డెన్ లాడ్జ్ లో దిగాడు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబరు 45లో ఒక సినీ ప్రముఖుడి ఇంటి సమీపంలో చోరీకి రెక్కి చేశాడు. అయితే.. ఆ ఇల్లు దొంగతనానికి అనువుగా లేకపోవటంతో జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీకి వెళ్లాడు. అనురాగ్ రెడ్డి అనే ప్రైవేటు ఉద్యోగి ఇంట్లోకి ప్రవేశించిన అతను రూ.5 లక్షలు విలువ చేసే రుద్రాక్షలతో పాటు బంగారు గొలుసును చోరీ చేవాడు. ముంబయికి పారిపోయాడు.

ఈ చోరీ ఫిర్యాదు పోలీసులకు అందిన తర్వాత 75 సీసీ కెమేరాల్ని జల్లెడ వేసినా.. ఇతగాడికి సంబంధించిన ఆచూకీ లభించలేదు. అదే సమయంలో వెంకటగిరి ప్రాంతంలోని ఒక సీసీ కెమేరాలో ఉజ్వల్ ఆచూకీని గుర్తించారు. అతడి వివరాలు తెలియకపోవటంతో.. మళ్లీ నగరానికి వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. తాజాగా మళ్లీ సిటీకి వచ్చి.. గతంలో తాను దిగిన మెరిడియన్ గోల్డెన్ లాడ్జిలోనే మరోసారి దిగాడు.

ఆ వెంటనే.. అతగాడి ఆచూకీ మీద పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. అతడి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసిన పోలీసులు శుక్రవారం యూసఫ్ గూడ చెక్ పోస్టు వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ.. హైదరాబాద్ లలో నాలుగేసి చోరీలు.. బెంగలూరులో ఏడు కేసుల్లో నిందితుడిగా అతడ్ని గుర్తించారు. ఇతగాడి దగ్గర నుంచి పెద్ద స్క్రుడ్రైవర్.. చిన్న స్క్రూడైవర్.. జియో డాంగిల్.. టెక్నో స్మార్ట్ ఫోన్.. మంకీ క్యాఫ్ తో ఉండే చొక్కా.. నలుపు రంగు టోపీని స్వాధీనం చేసుకున్నారు. ఇతగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతడి గురించిన వివరాలు తెలిసినంతనే ఆశ్చర్యపోతున్న పరిస్థితి.

ఇతను ముంబయిలో బ్యాగులు కుడుతూ.. దేశంలోని వివిధ నగరాల్లో చోరీలు చేయటం అలవాటు. ఒక ఇంటి నుంచి మరో ఇంటి మీదకు వేగంగా దూకుతూ పారిపోవటం.. ఖరీదైన వస్తువుల్ని మాత్రమే చోరీ చేయటం.. విలాసవంతమైన కార్లను దొంగలించి.. వాటిలోనే చోరీలకు వెళ్లటం ఇతడికి అలవాటు. చోరీ చేసిన తర్వాత వాటిని అమ్మేసి.. వచ్చిన డబ్బుతో తన సొంతూరిలో పేదలకు.. రైతులకు ఖర్చు చేస్తాడు. అంతేనా.. తాను చోరీచేసిన డబ్బుతో తన ఊరికి విద్యుత్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన ఈ నయా రాబిన్ హుడ్ ను ఆ ఊరి వాళ్లంతా ఉజ్వల్ అనే పేరుతో పిలుస్తుంటారు.

ఇక.. వ్యక్తిగత విషయాలకు వెళితే.. ఇతనికి ఇప్పటికి మూడు పెళ్లిళ్లుఅయ్యాయి. తాజాగా పూజ అనే యువతి ప్రేమలోపడ్డాడు. ఆమె పేరును తన చేతిపై పచ్చబొట్టుగా వేసుకున్నాడు. అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. అతడి గురించి.. అతడి వ్యవహారాల గురించి అధికారుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతుండటం గమనార్హం.