వీడు మామూలోడు కాడు: సీఎం పేరుతో ఎమ్మెల్యేకు టోకరా
కష్టపడటం.. సంపాదించటం లాంటి వాటికి భిన్నంగా.. మాటలతో మోసం చేయటం మామూలుగా మారిపోవటం
By: Tupaki Desk | 19 May 2024 5:30 AM GMTకష్టపడటం.. సంపాదించటం లాంటి వాటికి భిన్నంగా.. మాటలతో మోసం చేయటం మామూలుగా మారిపోవటం.. తేలిగ్గా సంపాదించే ధోరణి ఈ మధ్యన ఎక్కువైన సంగతి తెలిసిందే. తాజా ఉదంతం గురించి విన్నంతనే అవాక్కు అయ్యే ముదురు కేసు గురించి హైదరాబాద్ సైబర్ పోలీసులు వెల్లడించిన వివరాలు చూస్తే నోట మాట రాదంతే. పథకాల పేర్లతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతున్నారంటూ ఎమ్మెల్యేలను మోసం చేసే ఘనుడిగా వీడిని చెప్పాలి. తాజాగా ఒక ఎమ్మెల్యే వీడి బాధితుల జాబితాలో చేరారు. అసలేమైందంటే..
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి ఉరఫ్ దాసరి అనిల్ కుమార్ మాటలతో మోసాలకు పాల్పడుతుంటారు. పెద్దపెద్ద స్థానాల్లో ఉన్న వారికి టోకరా వేస్తుంటాడు. తాజాగా తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన ఇతడు..తనను తాను రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టనున్న రుణ పథకం గురించి చెప్పి.. ఈ ప్రోగ్రాంకు సీఎం హాజరవుతున్నారని.. దీనికి జనాల్ని తరలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.3600 చొప్పున మొత్తం 3.60 లక్షలు పంపాలని పేర్కొన్నాడు.
అతడు చెప్పిన మాటల్ని నమ్మిన సదరు ఎమ్మెల్యే నిందితుడు చెప్పిన ఖాతాకు డబ్బులు పంపాడు. డబ్బులు పంపిన తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాప్ కావటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించారు. వెంటనే.. తన పీఏకు ఈ విషయాన్ని చెప్పి.. హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఈ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఈ ముదురు కేసును అదుపులోకి తీసుకున్నాడు. ఇతడి చరిత్రను తవ్వి తీస్తే షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.
రకరకాల పేర్లు చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను మోసం చేయటం ఇతని అలవాటని.. ఇప్పటివరకు ఇతనిపై రెండు రాష్ట్రాల్లో 37 కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. ఎంపీలు.. ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను వెబ్ సైట్ ద్వారా సేకరించి.. ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటాడని చెప్పారు. 2008లో రామగుండం ఎన్ టీపీసీలో ఏఈగా చేరిన ఇతను.. 2009లో ఒక ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకున్న సందర్భంలో అధికారులు అతన్ని పట్టుకొన్నారు. ఆ కేసు నుంచి బయటపడిన తర్వాత విశాఖ పరవాడ సింహాద్రి పవర్ ప్లాంట్ లో జాబ్ లో చేరిన అతను.. అక్కడా మోసాలకు తెర లేపాడు. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో.. అప్పటి నుంచి అతడు మోసాలకు పాల్పడటం ఒక అలవాటుగా మార్చుకున్నట్లుగా గుర్తించారు.